వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్: దేశ విభజన సమయంలో కరాచీలో హిందువులు, సిక్కులను ఎలా ఊచకోత కోశారు.. ఆస్తులను ఎలా లూటీ చేశారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విభజన తర్వాత ఫొటోలు

మంగారాం కర్మచందానీ ఆ రోజు ఉదయం తన ఇంటి బాల్కనీలో ఉన్నారు. జనం గురుద్వారాపై దాడి చేయడం ఆయనకు కనిపించింది.

అక్కడ ఉన్న సిక్కు సర్దార్లు కత్తులతో తమను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గురుద్వారాలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. కొందరు సర్దార్లు తమ ప్రాణాలు కాపాడుకోడానికి పరుగులు తీస్తున్నారు.

కొంతమంది నిర్జీవంగా నేలపై పడి ఉన్నారు. ఆగ్రహంతో ఉన్న గుంపులు నగరమంతా వివిధ ప్రాంతాల్లో నిప్పు పెట్టడం మొదలైంది.

ఈ అల్లర్లలో కరాచీలోని హిందువులు తీవ్రంగా నష్టపోయారు.

అప్పుడు, మంగారాం వయసు 15 ఏళ్లు. ఆయన కరాచీ రతన్ తలాబ్ ప్రాంతంలో అకాల్ బుంగా గురుద్వారా దగ్గర ఉండేవారు.

1948 జనవరి 6న జరిగిన ఆ దాడులు, అల్లర్ల తర్వాత ఆయన కుటుంబం కూడా వేల కుటుంబాలతో కలిసి భారత్ చేరుకుంది.

మంగారాం ఒక ఇంటర్వ్యూలో నందితా భవానీ అనే రచయిత్రికి ఈ విషయం చెప్పారు.

ఆమె భారత విభజన, సింధీ హిందువుల సమస్యలపై 'ద మేకింగ్ ఆఫ్ ఎగ్జైల్ సింధీ హిందూ అండ్ పార్టిసన్' అనే పుస్తకం రాశారు.

పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత 1948 జనవరి 6 నుంచి 7 వరకూ రాజధాని కరాచీలో జరిగిన అల్లర్లలో వంద మందికి పైగా చనిపోయారు.

కానీ, కరాచీలో ప్రచురితమయ్యే వార్తా పత్రికల్లో ఆ గణాంకాలు పతాక శీర్షికల్లో కనిపించలేదు.

ముస్లిం లీగ్‌కు సంబంధించిన సింధీ పత్రిక 'అల్-వహీద్' అసోసియేటెడ్ ప్రెస్‌ను ఉంటంకిస్తూ ఒక వార్త ప్రచురించింది. అందులో 127 మంది చనిపోయారు.. 300 మందికి పైగా గాయపడ్డారని రాశారు.

లాహోర్ నుంచి వచ్చే పత్రిక 'ఇంక్విలాబ్‌' జనవరి 10న వచ్చిన పేపర్లో మృతుల సంఖ్య 105గా రాసింది, దాదాపు అంతేమంది గాయపడ్డారని తెలిపింది.

కరాచీలో విభజన అల్లర్లు

ఉత్తర సింధ్ నుంచి వచ్చిన సిక్కులు

"జనవరి 6న సిక్కులు ఉత్తర సింధ్ నుంచి రైల్లో కరాచీ చేరుకున్నారు. అక్కడ నుంచి భారత్ వెళ్లాలనుకున్నారు.

రైల్వే స్టేషన్ నుంచి పోలీసులు వ్యానుల్లో వారిని రతన్ తలాబ్‌లో అకాల్ బుంగా గురుద్వారా దగ్గరకు తరలిస్తారని వారంతా అనుకున్నారు" అని నందితా భవానీ రాశారు.

కాంగ్రెస్ స్థానిక అసెంబ్లీ సభ్యుడు స్వామీ కృష్ణానంద్ పోలీసుల వ్యాన్లు కనిపించకపోవడంతో, ఒక టాంగా అద్దెకు తీసుకుని మెకలో రోడ్ నుంచి రతన్ తలాబ్ గురుద్వారా దగ్గరికి బయల్దేరారు.

దారిలో అల్లరిమూకలు సిక్కులను టాంగాల నుంచి లాగి చంపండి, చంపండి అని అరుస్తున్నారు.

కానీ, ఆయన ఎలాగోలా గురుద్వారా చేరుకోగలిగారు. తర్వాత రెండు గంటల్లోనే ఆవేశంగా ఉన్న ఒక గుంపు వచ్చింది. లోపలికి చొరబడి నిప్పుపెట్టింది. సిక్కుల ఊచకోత ప్రారంభించింది.

కరాచీలోని ప్రీడీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒకప్పుడు ఆ గురుద్వారా ఉన్న స్థలంలో ప్రస్తుతం నబీ బాగ్ కాలేజీ ఉంది.

దాని వెనుక కొన్ని గోడలు, తగలబడిన తలుపులు చరిత్రలోని ఆ విషాదానికి ఇప్పుడు సాక్ష్యంగా నిలిచాయి. ఈ దారి పేరు ఇప్పటికీ టెంపుల్ రోడ్ అనే ఉంది.

కరాచీలో విభజన అల్లర్లు

హిందువుల్లో భయం భయంభయం

రతన్ తలాబ్ గురుద్వారా నుంచి మొదలైన ఈ అల్లర్లు కరాచీ అంతటా వ్యాపించాయి.

సింధీ భాష కవి, చిన్న కథల రచయిత ఠాకూర్ చావ్లా తన 'తుమ్ సింధ్ మే రహ్ జావో' పుస్తకంలో ఆ రోజు జరిగిన ఘటనల గురించి రాశారు.

అల్లర్లు కాసేపట్లోనే నగరమంతా వ్యాపించాయి.

ముఖ్యంగా హిందూ జనాభా ఎక్కువగా ఉన్న గాడీ ఖాతా, ఫేరే రోడ్, బిరింస్ రోడ్, జమ్‌షెద్ క్వార్టర్స్, ఆమిల్ కాలనీలను అల్లరిమూకలు చుట్టుముట్టాయి. లూటీలు జరిగాయి.

హిందువులు ఎక్కువగా ఉన్న ఆర్య సమాజ్ రాం బాగ్, రతన్ తలాబ్‌లోని కాంగ్రెస్ కార్యాలయం, స్వరాజ్ భవన్, లారెన్స్ రోడ్‌లోని కృష్ణ మాన్షన్‌పై దాడులు జరిగాయి.

ఇళ్లపై దాడులు, లూటీలు

ఠాకూర్ చావ్లా అప్పట్లో గాడీ ఖాతా(ఇప్పటి పాకిస్తాన్ చౌక్) దగ్గర ఠాకూర్ నివాస్ అనే ఒక ఐదంతస్తుల భవనంలో ఉండేవారు.

మొదటి అంతస్తులో ఆయన ఆఫీసు, మూడో అంతస్తులో ఇల్లు ఉండేదని, మిగతా అంతస్తుల్లో అద్దెకు ఉండేవారని ఆయన తన పుస్తకంలో రాశారు.

"1948 జనవరి 6న ఉదయం 10 గంటలకు వీధిలో గొడవ మొదలైంది. 'అల్లాహు అక్బర్' నినాదాలు వినిపిస్తున్నాయి.

నేను బాల్కనీలోకి వచ్చినపుడు, డాక్టర్ ప్రేమ్‌చంద్ ఇంటి కింద వీధిలో మూల ఒక ట్రక్ ఉంది. అందులో హిందువుల నుంచి లూటీ చేసిన సామాన్లు నింపుతున్నారు.

అక్కడ 40, 50 మంది ఉన్నారు. వాళ్ల చేతుల్లో కత్తులు, బాకులు, కర్రలు ఉన్నాయి. కాసేపట్లోనే ఆ గుంపు మా భవనంలోకి చొరబడింది.

నేను గట్టిగా ఇనుప గేటు మూసేసి తాళాలు వేయమని వాచ్‌మన్‌తో చెప్పాను".

"మా బంధువులు తమ అమ్మాయిల పెళ్లి కట్నం వస్తువులు ముందే మా దగ్గర ఉంచారు. ఓడ ఎక్కే ఒక రోజు ముందు వచ్చి తీసుకుంటామని చెప్పారు.

మేం మొదటి అంతస్తులో ఉన్న ఆరు గదుల్లో వాళ్ల వస్తువులు ఉంచాం.

ప్రతి పెట్టె మీద వాళ్ల పేరు రాసుంది. దురదృష్టవశాత్తూ ఆ రోజు మా వస్తువులు కూడా అక్కడే ఉండిపోయాయి".

"గుంపు ఇనుప గేటును పగలగొడుతున్నారు. మేం మా చేతికి దొరికినవి వాళ్లపై విసురుతున్నాం. తరిమికొట్టాలనుకున్నాం.

కానీ చివరకు వాళ్లు లోపలికి చొరబడ్డారు. సామాన్లు లూటీ చేసి ట్రక్కులో పడేశారు. పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే, వాళ్ల నంబర్ కలవలేదు".

"వాళ్లు నినాదాలు చేస్తూ తలుపు విరగ్గొట్టి కత్తితో దాడి చేశారు. నా ముఖం, ముక్కు, వీపులో గాయాలయ్యాయి.

మహిళలు, పిల్లలను మేం పైన ఒక గదిలో దాచేశాం. బయటి నుంచి గదికి తాళం వేశాం.

ఇంగ్లిష్ దినపత్రిక 'సింధ్ అబ్జర్వర్‌'లో చనిపోయిన వారి జాబితాలో నా పేరు కూడా ఉంది. ఎందుకంటే నేను తీవ్ర గాయలతో ఉన్నాను" అని ఠాకూర్ రాశారు.

కరాచీలో విభజన అల్లర్లు

స్వచ్ఛంద సంస్థలు, ఆస్పత్రులపైనా దాడులు

ఆ రోజుల్లో కరాచీ నుంచి బాంబే వెళ్లే నౌక కోసం టికెట్ తీసుకోవాల్సి వచ్చేది. ప్రయాణికులు వాటిలో బయలుదేరడానికి పది రోజుల వరకూ వేచిచూడాల్సి వచ్చేది.

"శోభరాజ్ ఆస్పత్రి దగ్గరున్న ఒక ఆర్య సమాజ్ స్కూల్(ఈ స్కూలుకు తర్వాత పాక్ కేంద్ర మంత్రి ఫజ్‌లూర్ రహ్మాన్ పేరు పెట్టారు) ఉండేది. అక్కడ వందకు పైగా కుటుంబాలు తలదాచుకుంటున్నాయి.

వాళ్లంతా ఉత్తర సింధ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు" అని చీతోమల్ నందితా భవానీకి చెప్పారు..

"గుంపు తలుపు విరగ్గొట్టి లోపలికి చొరబడింది. ఎదురు తిరిగిన వారిని చంపుతున్నారు, గాయపరుస్తున్నారు. వస్తువులతోపాటూ మహిళల నగలు కూడా లాక్కుంటున్నారు.

టాంగాలలో, ట్రక్కుల్లో, కార్లలో సామాన్లు నింపుతున్నారు. ఏ వాహనాలు లేని వారు దోచుకున్న వాటిని తలపై పెట్టుకుని వెళ్తున్నారు. అక్కడ మహిళలు, పిల్లలు, పురుషులు కేకలు వేస్తున్నారు. అక్కడ నుంచి వెళ్లే ముందు అల్లరిమూకలు కిరోసిన్ చల్లి, టైర్లు వేసి స్కూలుకు నిప్పుపెట్టారు".

సివిల్ అండ్ మిలట్రీ గెజెట్ కరాచీ ఎడిటర్ ఎంఎస్ఎం శర్మ అప్పటి తన జ్ఞాపకాలతో 'పీప్స్ ఇన్‌టు పాకిస్తాన్' అనే పుస్తకం రాశారు.

మద్రాసులోని తన ఇంటికి వెళ్లిన ఆయన కుటుంబంతో జనవరి 6న కరాచీ తిరిగి వచ్చారు.

విమానాశ్రయానికి వారికోసం కార్లు వెళ్లలేకపోయాయి. దాంతో వాళ్లు ముఖ్యమంత్రి ఖుడోకు ఫోన్ చేశారు, దాంతో ఆయన వారికి వాహనం పంపించారు.

కరాచీలో అల్లరిమూకలు స్వచ్చంద సంస్థ రామకృష్ణ మాన్షన్‌ను కూడా వదల్లేదు. ఎంఎస్ఎన్ శర్మ ఎలాంటి మత వివక్ష చూపకుండా బెంగాల్ కరవు సమయంలో చాలా మందికి సాయం చేశారు.

"నేను మొదట రామకృష్ణ విగ్రహం విరిగిపోయిన చోటుకు వెళ్లాను. పుస్తకాలు చెల్లాచెదురుగా ఉన్నాయి.

ఆస్పత్రిలో ఉన్న డాక్టర్ హేమన్ దాన్ వాధ్వానీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తన నర్సింగ్ హోంలో పేదలకు ఉచితంగా చికిత్స చేసేవారు" అని శర్మ రాశారు.

అలలరిమూకలపై ముఖ్యమంత్రి ఖుడో కాల్పులు

డాక్టర్ హమీదా ఖుడో తన తండ్రి అయూబ్ ఖుడో జ్ఞాపకాలతో 'మొహమ్మద్ అయూబ్ ఖుడో' అనే పుస్తకం రాశారు. అల్లర్లు జరిగిన నాటి పరిస్థితి వివరించారు.

"జనవరి 6న అల్లర్ల వార్తలు వచ్చినపుడు, ముఖ్యమంత్రి అయూబ్ తన ఆఫీసులో ఉన్నారు.

సిక్కులపై సాయుధ దుండగులు దాడులు చేస్తున్నారని ఆయనకు సమాచారం వచ్చింది.

గురుద్వారాలో ఉన్నవారిని కాపాడాలని ఆయన ఐఎస్‌పీని ఆదేశించారు.

అప్పటికీ ఊచకోత కొనసాగుతుండడంతో అయూబ్ నేరుగా అల్లర్లు జరిగే ప్రాంతానికి వెళ్లారు.

తన గార్డుతో కాల్పులు జరుపమని చెప్పిన ఆయన, తన పిస్టల్‌తో కూడా ఫైరింగ్ చేశారు. దాంతో అల్లరిమూకలు చెల్లాచెదురయ్యాయి" అని చెప్పారు.

పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత మొదటి కర్ఫ్యూ

1948 జనవరిలో అల్లర్ల వల్ల పాకిస్తాన్ రాజధానిలో మొదటిసారి కర్ఫ్యూ విధించారు. అది నాలుగు రోజుల వరకూ కొనసాగింది.

అయూబ్ ఖాన్ వివరాల ప్రకారం మూడు గంటలకు సైన్యం నగరంలోకి ప్రవేశించింది.

వారితో సమావేశమైన ఖుడో అవసరమైతే దుండగులను కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ముస్లిం లీగ్‌ అనుకూల సింధీ పత్రిక అల్-వహీద్‌లో జనవరి 6న ప్రచురించిన వార్తల్లో పోలీసులు, సైన్యం పరిస్థితిని అదుపు చేశారని, 9 మందిని కాల్చి చంపారని రాశారు.

సిక్కుల పట్ల ముస్లింల ఆగ్రహం

పాకిస్తాన్ ప్రభుత్వం, సింధ్ ముఖ్యమంత్రి అయూబ్ ఖుడో సిక్కులపై జరిగిన దాడులను ముస్లింల ప్రతిచర్యగా చెప్పారు. వారి ప్రకటనలు పత్రికల్లో వచ్చాయి.

"1947 డిసెంబర్ 7న భారత్‌లోని అజ్మేర్‌లో జరిగిన అల్లర్లలో దాదాపు 20 మంది ముస్లింలు చనిపోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. శతాబ్దాల నుంచి అక్కడే ఉంటున్న ముస్లింలకు భారత ప్రభుత్వం ఎలాంటి రక్షణ అందించలేదు.

వారంతా అన్నీ వదులుకుని సింధ్ వచ్చారని, వేలల్లో ఉన్న వారికి సిక్కుల మీద చాలా కోపం ఉంది" అని కేంద్ర హోం మంత్రి ఫజ్‌లూర్ రహమాన్ ఒక ప్రకటనలో చెప్పారు.

"దురదృష్టవశాత్తూ ఇటీవల దిల్లీలో కూడా అల్లర్లు జరిగాయి. అక్కడ కొంతమంది సిక్కులు ముస్లింలను వారి ఇళ్ల నుంచి బలవంతంగా వెళ్లగొట్టడానికి ప్రయత్నించారు.

ఎదురు తిరిగిన వారిని చంపేశారు. అలాగే దిల్లీ నుంచి కరాచీ వచ్చిన ముస్లింలకు కూడా సిక్కులపై చాలా కోపం ఉంది" అన్నారు.

ముఖ్యమంత్రి అయూబ్ ఖుడో కూడా అలాంటి ప్రకటనే చేశారు. భారత్‌లో సిక్కుల అరాచకాల వల్లే ముస్లిం శరణార్థులు అదుపు తప్పారని చెప్పారు.

కాంగ్రెస్ ఒత్తిడితో సిక్కులను భారత్ చేర్చాలని నిర్ణయం తీసుకున్నామని, రాత్రి చీకటి పడిన తర్వాత వారిని నగరానికి తీసుకొచ్చి, భారత్ తరలించాలని అనుకున్నామని, ఇలా ఇంతకు ముంద కూడా ఇలా జరిగిందని ఖుడో చెప్పారు.

కానీ, అయూబ్ ఖుడో జ్ఞాపకాలపై రాసిన పుస్తకంలో అల్లర్లు జరిగిన రోజు పోలీసులు సిక్కులకు రక్షణ అందించడానికి రైల్వే స్టేషన్‌కు వేళ్లలేదని తేలింది. వాళ్లు నగరంలో జరిగిన అల్లర్లను పట్టించుకోలేదని, లేదంటే భయపడి ఉంటారని రాశారు. పోలీసులు వాటిని అడ్డుకోడానికి అసలు ప్రయత్నించనట్టే అనిపించిందని చెప్పారు.

బురఖా, టర్కీ టోపీ, ముస్లిం శరణార్థులు

కరాచీలో అల్లర్లు జరిగిన సమయంలో ముస్లింలు కొందరు తమ పొరుగువారికి ఆశ్రయం కూడా ఇచ్చారు. అల్-వహీద్‌లో ఒక కథనం ప్రకారం ఓరియంటల్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఒక ఉద్యోగి 20 మంది హిందూ మహిళలకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు.

అల్లరిమూకలు ఆ మహిళల నగలు లాక్కోవాలని చూసినప్పుడు, వారిని తరిమేశాడు.

నందితా భవానీ కూడా తన పుస్తకంలో ఒక విషయం రాశారు.

"కలా షాహ్నీ అనే ప్రముఖ కాంగ్రెస్ నేత ఉండేవారు. ఆమె భర్త శాంతి కూడా కాంగ్రెస్‌ నేత. రతన్ తలాబ్ దగ్గర కాంగ్రెస్ కార్యాలయంపై దాడి జరిగినట్టు తెలీగానే ఆమె తమ పక్కనే ఉన్న ఒక ముస్లింల ఇంట్లో ఆశ్రయం పొందారు.

వాళ్లు బురఖా వేసి ఆమెను కాపాడారు. హిందూ కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయిందని అల్లరిమూకలకు చెప్పారు".

తన సోదరుడు, ఆ రోజుల్లో జైల్లో పనిచేసేవారని, ఆయన ఎర్ర టర్కీ టోపీ పెట్టుకుని తనను కాపాడుకున్నారని, తన కుటుంబాన్ని పక్కనే ఉన్న ముస్లిం ఇంట్లో దాచిపెట్టాడని చీతోమల్ నందితకు చెప్పారు.

విభజన తర్వాత ఫొటోలు

ముస్లింలకు చెడ్డపేరు వచ్చింది

అల్లర్ల జరిగిన తర్వాత రోజు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మొహమ్మద్ అలీ జిన్నా తన సోదరి ఫాతిమా జిన్నా, సింధ్ ముఖ్యమంత్రి అయూబ్ ఖాన్ ఖుడోతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దినపత్రిక అల్-వహీద్ కథనం ప్రకారం ఆయన విక్టోరియా రోడ్(ఇప్పటి అబ్దుల్లా హారూన్ రోడ్) కాలనీల్లో, బందర్ రోడ్‌లో పర్యటించారు. సెంట్రల్ బందర్ రోడ్ దగ్గర లూటీ చేసిన షాపులను పరిశీలించారు.

ఆ తర్వాత రోజు అల్-వహీద్ పత్రిక "అల్లర్ల వల్ల ముస్లింలకు చెడ్డపేరు వచ్చింది. హిందువులకు వారి షాపులు, ఇళ్లు, మిగతా ఆస్తులు తిరిగి అందిస్తాం" అనే హెడ్ లైన్ పెట్టింది.

దేశ విభజన నాటి ఫొటో

నవాబ్ షా దగ్గర దాడి

హమీదా ఖుడో పుస్తకంలో వివరాలను బట్టి ఉత్తర సింధ్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉందని తెలుస్తోంది. నవాబ్ షాలో సిక్కుల ఊచకోత ఈ మొత్తం అల్లర్లు ప్రారంభం కావడానికి కారణంగా తెలుస్తోంది.

1974 సెప్టెంబర్ 1న రైల్వే విడుదల చేసిన ఒక ప్రకటనలో "నవాబ్ షా నుంచి బయల్దేరిన 55-అప్ మిక్సడ్ ట్రైన్ 25 నిమిషాల తర్వాత షఫీబాద్ మధ్య పట్టాలు తప్పింది. ఒక

సాయుధుల గుంపు ఆ రైల్లో ఎక్కి సిక్కులపై దాడులు చేసింది. ఈ దాడిలో 11 మంది పురుషులు, నలుగురు మహిళలు చనిపోయారు. 17మంది గాయపడ్డారు" అని ఉంది.

సెప్టెంబర్ 1న ఈ ఊచకోత కరాచీలో మిగతా లూటీలకు అల్లర్లకు కారణమయ్యింది. సింధ్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించేలా చేసింది.

కరాచీలో విభజన అల్లర్లు

కరాచీలో అల్లర్లు ప్రణాళికా ప్రకారమే జరిగాయా

కరాచీలో జరిగిన ఈ అల్లర్ల గురించి అప్పటి పాక్ కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలు ఒకే మాట ఇవి ప్రతిచర్యలని, యాదృచ్చికంగా జరిగాయని అన్నాయి.

కానీ కొందరు మాత్రం ఇవి పక్కా ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయని అంటున్నారు.

కమ్యూనిస్ట్ నేత సుభో జ్ఞానచంద్రానీ 'ఆవామీ ఆవాజ్' పత్రికకు రాసిన ఒక కాలంలో తను ఆ రోజుల్లో ట్రేడ్ యూనియన్‌లో ఉండేవాడినని చెప్పారు.

"ఒక టైలర్ నాతో జనవరి 5న రాత్రి దాదాపు పది గంటలకు బందర్ రోడ్(ఇప్పటి ఎంజే జిన్నా రోడ్) దగ్గర మోలెడ్నో ఇన్‌లో కొందరు గుమిగూడారు. నగరం నుంచి హిందువులను తరిమేసేలా, వారి ఇళ్లు ఖాళీ అయ్యేలా అల్లర్లు చేయాలని నిర్ణయించారని చెప్పాడు. తర్వాత రోజే జనవరి 6న వారు దానిని అమలు చేయాలని నిర్ణయించారు. కరాచీలో గొడవలు మొదలయ్యాయి" అని రాశారు.

కరాచీలో విభజన అల్లర్లు

హిందువులకు ఆస్తులు అమ్ముకోవడం కష్టమైంది

పాకిస్తాన్ ఏర్పడగానే హిందువులు నగదు, ఆభరణాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించారు.

హమీదా ఖుడో తన తండ్రి జ్ఞాపకాల గురించి రాసిన పుస్తకంలో ఆ వివరాలు రాశారు

"పాకిస్తాన్ వస్తున్న ముస్లింలను దిల్లీ, మిగతా ప్రాంతాల్లో అడ్డగించి వారి సామాన్లు లాక్కుంటున్నట్టు ప్రధాని లియాకత్ అలీ ఖాన్‌కు ఒక రిపోర్టు వచ్చింది. దాంతో, ఆయన జాయింట్ సెక్రటరీని ఖుడో దగ్గరకు పంపించి, సింధ్ నుంచి పారిపోతున్న హిందువులు తమతో పెద్ద మొత్తంలో నగదు తీసుకు వెళ్లకుండా ప్రాంతీయ స్థాయిలో ఒక ఆర్డినెన్స్ పాస్ చేయాలని ఆదేశించారు. ఖుడో దానికి అంగీకరించారు. శాంతిభద్రతలు పరిరక్షించడానికి ఆయుధాలు, బాంబులు, బంగారం లాంటి వాటి అక్రమ రవాణాను అడ్డుకునేలా ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు".

1974 అక్టోబర్ 21న 'ద డాన్' పత్రిక "హైదరాబాద్ స్టేషన్లో ముఖ్యమంత్రి స్వయంగా సింధ్ నుంచి జోధ్‌పూర్, బొంబాయి, మిగతా నగరాలకు వెళ్లే హిందువుల వస్తువుల తనిఖీలను పర్యవేక్షించారు. వారితో సున్నితంగా వ్యవహరించాలని, వ్యక్తిగత సామాన్లు తీసుకెళ్లడానికి అనుమతించాలని ఆదేశించారు" అని రాసింది.

కరాచీ అల్లర్లతో హిందువులు తీవ్ర సమస్యలు ఎదుర్కున్నారు. వారు తమ ఆస్తులు అమ్ముకోవడం కష్టమైపోయింది. సింధీ రచయిత ఠాకూర్ చావ్లా తన పరిస్థితి రాశారు.

"డీజే సింధ్ కాలేజీ వెనక 20 ఫ్లాట్లు ఉన్న నా భవనాన్ని ఆరు లక్షల రూపాయలకు అమ్మేందుకు లూటీలకు ముందు ఒప్పందం జరిగింది. కానీ ప్రభుత్వం జనవరి 6 తర్వాత హిందువుల నుంచి ఎవరూ ఆస్తులు కొనుగోలు చేయకూడదని ఒక ప్రకటన జారీ చేసింది. దీనికి ముందు ఏదైనా ఒప్పందం జరిగుంటే కరాచీ కలెక్టర్ నుంచి ఎన్ఓసీ తీసుకోవడం తప్పనిసరి అని చెప్పింది"

"కానీ, ప్రభుత్వ ఆదేశం తర్వాత కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాలేదు. కలెక్టర్ ఆఫీసులో 10 వేల రూపాయలు లంచం ఇచ్చి ఎన్ఓసీ తీసుకున్నా, దానిని ఎవరూ కొనలేదు. చివరికి ఆ భవనాన్ని ఆరు లక్షలకు బదులు 68 వేల రూపాయలకు అమ్మేలా ఒప్పందం చేసుకున్నాను" అని ఠాకూర్ రాశారు.

పాకిస్తాన్ జెండా పట్టినవారే పారిపోయారు

కరాచీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖ నేత గోబింద్ మాల్హీ. ఆయన 'నయీ దునియా' పత్రిక ప్రచురించేవారు. పాకిస్తాన్ ఆవిర్భావ ప్రకటన తర్వాత తర్వాత ఆయన షేర్వాణీ, జిన్నా క్యాప్ పెట్టుకుని 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ జాతీయ జెండాతో ర్యాలీలు కూడా చేశారు.

గోబింద్ మాల్హీ తన ఆత్మకథలో తర్వాత తన పరిస్థితి గురించి చెప్పారు.

"నేను ప్రింటింగ్ ప్రెస్‌లో ఉన్నప్పుడు ఒక పొడవాటి వ్యక్తి వచ్చాడు. 50 వేల రూపాయలు తీసుకుని నీ ప్రెస్ నాకు అప్పగించు, ఇక్కడ నుంచి వెళ్లిపో.. ఇది ఇప్పుడు మా దేశం అన్నాడు. నేను అతడితకో ఇది నా దేశం కూడా అన్నాను. దాంతో పేపర్ వెయిట్‌తో బెదిరిస్తూ, మూడు రోజుల్లో నా వాళ్లతో వస్తా, దీన్ని స్వాధీనం చేసుకుంటా. నువ్వు ఇవ్వకపోతే నీ అంతు చూస్తా అని అక్కడ నుంచి వెళ్లిపోయాడు" అని రాశారు.

మాల్హీ అదే రోజు టాటా కంపెనీ విమానంలో అహ్మదాబాద్ వెళ్లిపోయారు.

"కొన్ని రోజుల తర్వాత ఇంట్లోవాళ్లు వద్దని వారిస్తున్నా, నేను తిరిగి కరాచీ వెళ్లాను. కానీ అప్పటికే ఆ నగరం గందరగోళంగా ఉంది. గొడవలు, అల్లరలతో కరాచీ స్వరూపమే మారిపోయింది" అన్నారు.

కొన్ని రోజులకే ఆయన కరాచీ వదిలి శాశ్వతంగా భారత్‌లో ఉండడానికి వెళ్లిపోయారు.

అరెస్ట్ అయిన అల్లరిమూకల విడుదల

హిందువుల ఇళ్లలో లూటీలు చేసి, వాటిని ఆక్రమించిన ముస్లింలను కఠినంగా శిక్షిస్తామని సింధ్ ముఖ్యమంత్రి అయూబ్ ఖుడో నిర్ణయించారు.

ఆ అల్లర్ల సమయంలో మొత్తం 1500 మందిని అదుపులోకి తీసుకున్నారని కరాచీ మేజిస్ట్రేట్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

'సివిల్ అండ్ మిలిటరీ గజట్' కరాచీ ఎడిటర్ ఎంఎస్ఎన్ శర్మ తన జ్ఞాపకాలు 'పీప్స్ ఇన్ టూ పాకిస్తాన్‌'లో దాని గురించి రాశారు.

"కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ మంత్రులు ఖుడో మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కొందరిని విడుదల చేయాలని చెప్పారు. దాంతో అల్లర్లలో పాల్గొన్నారని, లూటీలు చేశారని, మహిళలపై అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చిన వారందరినీ ఖుడో విడుదల చేయించారు. అయితే ఆ అల్లర్లలో లూటీ చేసిన మొత్తం సొత్తు సెక్రటేరియట్ సిబ్బంది ఇళ్ల నుంచే స్వాధీనం చేసుకున్నారు" అని చెప్పారు.

"అల్లర్లు ముగిసిన తర్వాత జనవరి 9 లేదా 10న అయూబ్ ఖుడో ఏదో పనిగా ప్రధాని లియాకత్ అలీ ఖాన్ దగ్గరకు వెళ్లారు. ఆయన 'నువ్వు అసలు ముస్లింవేనా. భారత్‌లో ముస్లింల ఊచకోత జరుగుతుంటే, నువ్వు ఇక్కడి హిందువులకు భద్రత అందిస్తావా, సిగ్గు లేదా అని వ్యగ్యంగా మాట్లాడారు" అని హమీదా ఖుడో తన పుస్తకంలో రాశారు.

"ఏ వివక్షా లేకుండా నా పౌరులకు భద్రత అందించడం నా బాధ్యత" అని అప్పుడు ఖుడో ఆయనకు సమాధానం ఇచ్చారని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
During Partition Hindus and Sikhs were looted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X