వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్: సైనికాధికారులపై నవాజ్‌ షరీఫ్‌కు ఎందుకంత ఆగ్రహం?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

"కార్గిల్‌లో మన వందల మంది సైనిక వీరులు చనిపోవడానికి కారణమైన నిర్ణయం తీసుకుంది సైన్యం కాదు. కొద్దిమంది జనరల్స్ మాత్రమే.‌ వారు సైన్యాన్ని, దేశం మొత్తాన్ని యుద్ధంలోకి నెట్టారు. ఆ కొండల మీద మన సైనికులకు కనీసం ఆహారం కూడా అందించలేక పోయాం. రక్షించుకోవడానికి కనీసం ఆయుధాలైనా పంపించలేకపోయాం. అది తలచుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. 1999 అక్టోబర్‌ నాటి తిరుగుబాటు వెనకున్నవారే కార్గిల్‌ యుద్ధానికి కారకులు. పర్వేజ్‌ ముషారఫ్‌, ఆయన అనుచరులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సైన్యాన్ని ఉపయోగించుకుని దేశం పరువు తీశారు.’’

ఈ మాటలన్నది పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌. ఆదివారం క్వెట్టాలో జరిగిన పాకిస్తాన్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్ (పీడీఎం) మూడో ర్యాలీలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 20న పాకిస్తాన్‌ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇస్లామాబాద్‌లో సమావేశమై పాకిస్తాన్‌ డెమొక్రటిక్ మూవ్‌మెంట్‌ అనే ఫ్రంట్‌ను ఏర్పాటు చేశాయి. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఈ కూటమి నిర్ణయించింది.

నవాజ్‌ షరీఫ్ ఈ ప్రసంగంలో జనరల్ పర్వేజ్‌ ముషారఫ్‌తో పాటు ప్రస్తుత పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్ కమర్‌ జావెద్ బజ్వా, ఐఎస్‌ఐ చీఫ్‌ జనరల్‌ ఫయాజ్‌ అహ్మద్‌లపై కూడా విమర్శలు గుప్పించారు.

“జనరల్ బజ్వా సాహెబ్‌, మీరు 2018 పాకిస్తాన్‌ ఎన్నికల సందర్భంగా దేశంలో జరిగిన అతి పెద్ద రిగ్గింగ్‌ వ్యవహారంపై విచారణ జరపాలి’’ అని షరీఫ్ అన్నారు.

“తమ యూనిఫామ్‌ల మీద మరక పడకుండా జరిగిన వాస్తవాలేమిటో అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వీటికి సమాధానం చెప్పాల్సింది సైన్యం కాదు. జనరల్ కమర్‌ జావెద్ బజ్వా, జనరల్ ఫయాజ్‌’’ అన్నారు షరీఫ్‌.

క్వెట్టా ర్యాలీలో దేశ నాయకత్వం, సైనిక నాయకత్వం మీద చేసిన ఆరోపణలపై అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అయితే మొదటి పీడీఎం ర్యాలీలో పాల్గొన్న నేతలు కొందరు ఆర్మీ చీఫ్‌ మీద కాకుండా ఆర్మీ మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా నవాజ్‌ షరీఫ్‌ ఆర్మీ చీఫ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.

గత మూడు ర్యాలీలలో పాకిస్తాన్‌ సైన్యంపై పీడీఎం వ్యక్తం చేసిన వైఖరికి భిన్నంగా నవాజ్‌ షరీఫ్‌ సైన్యంలో పెద్దలపై విమర్శలు చేశారు.

https://twitter.com/NawazSharifMNS/status/1320321058495315968

సైన్యంపై నవాజ్‌ దూకుడుకు కారణం?

“నవాజ్‌ షరీఫ్‌ రాజకీయంగా ఎదగడానికి సైన్యం కూడా ఒక కారణమే. కానీ తర్వాత కాలంలో సైన్యంతో ఆయన సంబంధాలు చెడిపోయాయి. పాకిస్తాన్‌కు ఆయన మూడుసార్లు ప్రధానిగా చేశారు. మూడుసార్లు కూడా ఆయన పూర్తి కాలం పని చేయలేదు. సైన్యం కారణంగానే తాను పదవిని అనుభవించలేకపోయానని షరీఫ్ అనేవారు. సైన్యం ప్రభుత్వాన్ని నడిపించాలనుకునేది. దీంతో ఆయనకు, సైన్యానికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆయన సైన్యంపై ఆగ్రహంగానే ఉన్నారు’’ అని పాకిస్తాన్‌లో సీనియర్‌ జర్నలిస్టు హరూన్ రషీద్‌ అన్నారు.

"నవాజ్‌ షరీఫ్‌ పార్టీ నేత మహమ్మద్‌ జుబేర్‌ ఈ ఏడాది ఆగస్టులో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వాతో చర్చలు జరిపారు. ఈ చర్చల గురించి మొదట అటు సైన్యంగానీ, ఇటు షరీఫ్‌ పార్టీ గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇరువర్గాల మధ్య చర్చలు చాలా రహస్యంగా జరిగాయి. కానీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆర్మీ ప్రతినిధి స్వయంగా షరీఫ్‌, బజ్వా వర్గాల మధ్య చర్చలు జరిగినట్లు నేషనల్‌ టెలివిజన్‌లో ప్రకటించారు. దీంతో తాను మోసపోయినట్లు, సైన్యం తనను మరోసారి అవమానించినట్లు షరీఫ్‌ భావించారు. రహస్యంగా జరిపిన చర్చలను బయట పెట్టడం వల్ల ప్రజల ముందు తాను అవమానం పాలయ్యానని షరీఫ్‌ భావించారు. అందుకే ఆర్మీ చీఫ్‌‌పై విమర్శలు మొదలుపెట్టారు’’ అని హరూన్‌ వివరించారు.

ఈ సమావేశం వల్ల నవాజ్‌ షరీఫ్‌ పార్టీ చాలా నష్టపోయిందని హరూన్‌ అన్నారు. పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నవాజ్‌ షరీఫ్‌ సైన్యంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు తన పార్టీ నాయకులను పంపి ఆర్మీ చీఫ్‌తో చర్చలు జరిపిస్తున్నారు.

తాను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి సైన్యం తనను పడగొట్టిందన్న కసి నవాజ్ షరీఫ్ లో ఉంది

ఈ రహస్య చర్చలను బయటపెట్టి తనను చిన్నబుచ్చిన ఆర్మీ నాయకత్వంపై తానెందుకు మౌనంగా ఉండాలని నవాజ్‌ షరీఫ్ భావిస్తున్నారు. అందుకే విమర్శలను తీవ్రం చేస్తున్నారు.

మరోవైపు తనపై ఉన్న అవినీతి కేసులు ఇప్పట్లో విచారణకు వచ్చే అవకాశం లేదని అర్ధం కావడంతో షరీఫ్‌ స్వరం పెంచారు. అవినీతి కేసులో షరీఫ్‌ దోషిగా నిర్ధారణ అయ్యాక ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స కోసం లండన్‌ వెళ్లారు.

“సైన్యంపై విమర్శలు చేయడం ద్వారా నవాజ్‌ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు కౌంటర్‌ సిద్ధం చేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం, అవినీతి, మనీ లాండరింగ్‌ వంటి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం ఇది’’ అని పాకిస్తాన్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ నదీమ్‌ రజా అన్నారు.

కానీ సైన్యానికి వ్యతిరేకంగా వెళుతున్న షరీఫ్‌కు పీడీఎంలోని పార్టీలన్నీ మద్దతిస్తాయా?

"నవాజ్‌ షరీఫ్ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన స్థాయిలో మిగిలిన పార్టీలు మాట్లాడటం లేదు. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ నేత బిలావల్‌ భుట్టో చేసిన ప్రసంగంలో ఎక్కడా సైన్యాన్ని విమర్శించలేదు. జమాతుల్‌-ఉలేమా-ఇ-ఇస్లాం నాయకుడు మౌలానా ఫజల్‌ ఉర్‌ రెహమాన్‌ మిలటరీపై విమర్శలు చేశారు. మొత్తంగా రాజకీయాల్లో ఉన్న వారెవరూ సైన్యంపై ఎక్కువగా విమర్శలు చేయడం లేదు, మిలిటరీతో తలపడాలని వారు కోరుకోవడం లేదు’’ అన్నారు నదీమ్‌ రజా.

నవాజ్ షరీఫ్

సైన్యం వర్సెస్ నవాజ్ షరీఫ్

2018 ఎన్నికలకు ముందు పాకిస్తాన్‌ వార్తాపత్రిక 'డాన్'కు నవాజ్‌ షరీఫ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ రోజుల్లో ఆ పత్రిక పాకిస్తాన్‌లోని పట్టణ ప్రాంతాల్లో అమ్మకుండా నిషేధం విధించారు.

ముంబయి వెళ్లి కనీసం 150మందిని చంపాల్సిందిగా ఆదేశిస్తూ ఉగ్రవాదులను దేశం దాటించడానికి ప్రభుత్వం ఎలా అనుమతించిందని నవాజ్‌ షరీఫ్‌ ఆ ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2008 ముంబై దాడుల సూత్రధారిపై పాకిస్తాన్‌ ఎందుకు చట్ట పరమైన చర్యలు తీసుకోలేదని షరీఫ్‌ ఈ ఇంటర్వ్యూలో అడిగారు.

అయితే ఆ వార్తా పత్రికను నిషేధించాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. మరి పత్రిక ఎందుకు విడుదల కాలేదు? ఇది సైన్యం పనేనని అందరికీ అర్ధమైంది. ఆ వార్తా పత్రిక రాని ప్రాంతాలపై సైన్యానికి మంచి పట్టుంది.

అయితే సైన్యం నవాజ్‌ షరీఫ్‌ల మధ్య సంబంధాలు కొన్నాళ్లు బాగానే ఉన్నాయి. మూడుసార్లు పాకిస్తాన్‌‌కు ప్రధానిగా చేసిన నవాజ్‌ షరీఫ్‌కు మద్దతిచ్చిన వారిలో సైన్యం కూడా ఉంది.

రాజకీయాలతో సైనిక కూటమికి ఆయన నాయకత్వం వహించారు. మితవాద గ్రూపులను, సంఘాలను సైన్యానికి చేరువ చేయడానికి షరీఫ్‌ ప్రయత్నించారు.

1988లో జనరల్‌ జియావుల్‌ హక్‌ మరణించిన తరువాత నవాజ్‌ షరీప్‌ మాజీ ఐఎస్ఐ చీఫ్‌ సాయంతో రాజకీయంగా ఎదిగారని చెబుతారు.

కార్గిల్‌ను ఆక్రమించింది ఉగ్రవాదులని పాకిస్థాన్‌ చెప్పగా, దీని వెనక సైన్యం ఉందని తర్వాత బయటపడింది. ఈ యుద్ధానికి అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ ప్రధాన కారణమని నవాజ్‌ ఇప్పటికే చెప్పారు. కానీ ఆయన పూర్తి వివరాలను బైటపెట్టలేదు.

కార్గిల్‌ కొండల్లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తాన్‌ సైనికులు కార్గిల్‌ కొండల్లోకి చొరబడి రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ యుద్ధం మొదలైంది.

నవాజ్ షరీఫ్, వాజపేయి

చివరికి భారతదేశం ఆ కొండలలో దాక్కున్న పాకిస్తాన్‌ సైనికులను తరిమికొట్టి ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అప్పట్లో భారత్‌కు వాజ్‌పేయి ప్రధాని కాగా, నవాజ్‌ షరీఫ్‌ పాకిస్తాన్‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

క్వెట్టా ర్యాలీలో కార్గిల్‌ గురించి కూడా నవాజ్‌ షరీఫ్‌ ప్రస్తావించారు.

భారతదేశంతో సంబంధాలను మెరుగు పరచడానికి షరీఫ్‌ చేస్తున్న ప్రయత్నాలను విఫలం చేయడానికి కార్గిల్ యుద్ధం జరిగిందని పాకిస్తాన్‌లో చాలామంది నమ్ముతారు.

జనరల్‌ ముషారఫ్‌కు నవాజ్‌ షరీఫ్‌కు మధ్య విభేదాలు పెరిగి సైన్యం నవాజ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఆ కోపం నవాజ్‌ షరీఫ్‌లో ఇంకా ఉంది. పార్టీ నాయకుడు మహమ్మద్‌ జుబేర్‌, ఆర్మీ చీఫ్‌ల మధ్య సంభాషణలను బహిర్గతం చేయడం ద్వారా పాకిస్తాన్‌ సైన్యం నవాజ్‌ షరీఫ్‌ పాత గాయాలను మళ్లీ రగిలించింది.

ర్యాలీలకు జనం ఎందుకు వస్తున్నారు?

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే పీడీఎం నిర్వహించిన క్వెట్టా, గుజ్రన్‌వాలా, కరాచీ ఈ మూడు ర్యాలీలకు జనం పెద్ద ఎత్తున వచ్చారు. మరి ఈ పరిస్థితులలో నవాజ్‌ షరీఫ్ సైన్యంపై చేస్తున్న ఆరరోపణలను ప్రజలు నమ్ముతున్నారా? అందుకే సభలకు జనం ఎక్కువగా వస్తున్నారా?

"పాకిస్తాన్‌లో ఓ ప్రమాదకరమైన ధోరణి మొదలైంది. అంతకు ముందు ఎవరూ సైన్యం గురించి మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు సైన్యానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. సైన్యం కూడా రాజకీయాలు చేయడం దీనికి ఒక కారణం. వాస్తవానికి సైన్యం రాజకీయాలకు దూరంగా ఉండాలి. అందుకే సోషల్ మీడియాలో #SandVidArmy లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి’’ అని జర్నలిస్ట్‌ హరూన్‌ వ్యాఖ్యానించారు.

"నవాజ్‌ షరీఫ్‌ మాటలను ప్రజలు నమ్ముతారని చెప్పలేం. భారతదేశంలో కాంగ్రెస్‌ ర్యాలీలకు జనం బాగా వచ్చేవారు. కానీ వారు గెలిచారా? పీడీఎం 11 పార్టీల సమూహం. ఒక్కో పార్టీ 10,000 మందిని తీసుకువచ్చినా జనం ఎక్కువగానే కనిపిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తోంది. అందుకే ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. సైన్యంపై చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే ఈ ర్యాలీలు జరిగేవి కావు" అని వ్యాఖ్యానించారు సీనియర్‌ జర్నలిస్ట్ నదీమ్ రజా.

కారణాలు ఏమైనా నవాజ్‌ షరీఫ్‌ ప్రకటనలతో సైన్యం కాస్త అసౌకర్యంగా ఫీలవుతోందన్నది మాత్రం వాస్తవం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Nawaz sharif angry with Pakistan military officials
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X