శశికళను తరిమేస్తా.. దమ్ముంటే ఎమ్మెల్యేలను బయటకు పంపించాలి: పన్నీర్
చెన్నై: తమిళ రాజకీయాల్లో ప్రతీ క్షణం క్లైమాక్స్ ను తలపించేలా రాజకీయాలు కొనసాగుతున్నాయి. నేడు గవర్నర్ చెన్నైకి విచ్చేస్తుండటంతో.. పన్నీర్-శశికళ వర్గాలు సీఎం కుర్చీ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు.
కాగా, రాజకీయ బలం లేకపోయినా.. ప్రజల్లో వెల్లువెత్తుతున్న మద్దతు పన్నీర్ పట్ల సానుభూతిని పెంచుతోంది. ఈ సానుభూతే శశికళకు వ్యతిరేకంగా ఆయన్ను ధీటుగా నిలబడేలా చేస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. పోయెస్ గార్డెన్ నుంచి చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్న శశికళను అక్కడినుంచి తరిమేస్తానని పన్నీర్ గట్టి హెచ్చరిక జారీ చేశారు.

ఎప్పుడూ సున్నిత వ్యాఖ్యలకే పరిమితమయ్యే పన్నీర్ నోట ఇలాంటి పదునైన వ్యాఖ్యలు రావడం ఇదే తొలిసారి. పోయెస్ గార్డెన్ లో ఉండే హక్కు శశికళకు లేదని, ఆ ఇంటిని అమ్మ స్మారక కేంద్రంగా మారుస్తానని తెలిపారు. అవినీతి కేసులున్న వ్యక్తుల ప్రవేశంతో పోయిస్ గార్డెన్ ను శశికళ కుటుంబ సభ్యులు అపవిత్రం చేశారని నిప్పులు చెరిగారు.
జయలలితకు వీర విదేయురాలిని అని చెప్పుకునే శశికళ, జయకు ఇష్టం లేకపోయినా ఆమె కుటుంబ సభ్యులను పోయెస్ గార్డెన్ లోకి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.
గవర్నర్ ఎదుట తన బలాన్ని నిరూపించుకుని తానే సీఎం కుర్చీలో కూర్చుంటానని ధీమా వ్యక్తం చేశారు. శశికళకు ధైర్యముంటే ఎమ్మెల్యేలను బయటకు పంపి, గవర్నర్ ఎదుట బలాన్ని నిరూపణకు సిద్దపడాలని సవాల్ చేశారు.