• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పరకాల - దక్షిణాది జలియన్‌వాలాబాగ్: భారత్‌లో తెలంగాణ విలీనం కాకముందు అక్కడేం జరిగింది?

By BBC News తెలుగు
|

అమరధామం

తెలంగాణలోని పరకాలలో నిజాం పాలన కాలంలో జరిగిన మారణ హోమం జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని తలపించిందని చెబుతుంటారు చరిత్రకారులు. నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు ఇక్కడ మారణ మోమానికి పాల్పడ్డారు.

1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక, నిజాం రాజ్యంలోనూ జాతీయ పతాకం ఎగురవేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. వాటిని అణగదొక్కేందుకు రజాకార్లు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు.

ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా వందల మంది అమరులు అయ్యారు. వాళ్ల వీరోచిత పోరాటానికి నిలువెత్తు నిదర్శనం పరకాలలోని అమరధామం. పరకాల వరంగల్ రూరల్ జిల్లాలో ఉంది.

ఆ రోజు ఏం జరిగిందంటే...

భారత దేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్రం వచ్చింది.. కానీ తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం, రజాకార్ల పాలనలోనే ఉంది.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో తిరుగుబాటు మొదలైంది. 1945-46 ... తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న కాలం అది. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, భూమి కోసం దొరలపైన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతల అధ్వర్యంలో పోరు తీవ్ర స్థాయిలో జరుగుతోంది.

నిజాం తన అధికారం చేజారుతోందని భావించి, ప్రైవేటు సైన్యమైన రజాకార్లను ఖాసిం రిజ్వీ నాయకత్వంలో నియమించారు. రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా తెలంగాణ గ్రామాల్లోని ప్రజలు సాయుధ పోరు బాట పట్టారు.

అమరధామం

1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న పరకాలలో జాతీయ పతాకం ఎగురవేయలని నిర్ణయించారు. కానీ, వారిపై రజాకార్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఘటనలో అక్కడి వాళ్లు 22 మంది అమరులు అయ్యారు.

నాడు జరిగిన దమనకాండను కళ్లార చూసిన వ్యక్తి పావుశెట్టి వైకుంఠం. ఆ రోజు జరిగిన సంఘటన వివరాలు గుర్తుచేసుకుంటూ వైకుంఠం బీబీసీతో మాట్లాడారు.

ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన ఆయన పరకాల మారణకాండ జరిగినప్పుడు తన వయసు తొమ్మిదేళ్లని చెప్పారు.

వైకుంఠం

దేశానికి స్వాతంత్రం రావడంతో 1947 సెప్టెంబర్ 2న జాతీయ పతాకం ఎగురవేసేందుకు చుట్టు పక్క గ్రామాల నుంచి వందల సంఖ్యలో జనాలు చాపల బండ చేరుకున్నారని వైకుంఠం తెలిపారు.

"మేము చెట్టు కొమ్మలెక్కి చూశాం. ఆ రోజు జరిగింది నాకు ఇప్పటికీ కళ్లకు కట్టినట్టు గుర్తుంది. పరకాలలో చాపల బండ ప్రాంతానికి జనాలు చేరుకున్నారు. రజాకార్లు వారిని అడ్డుకుని కాల్పులు జరిపారు. ఎటువంటి హెచ్చరికలు చేయకుండా కాల్పులు జరిపారు. కొందరు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది గాయాలపాలయ్యారు" అని చెప్పారు.

కేవలం చాపల బండ ప్రాంతంలో మాత్రమే కాదు, బెహరాన్ పల్లిలో కూడా రజకార్లు మారణకాండ సృష్టించారని ఆయన అన్నారు.

అమరధామం

"అక్కడ జరిగిన మారణకాండ గురించి మాకు తర్వాత తెలిసింది. రాత్రికి రాత్రి రజాకార్లు ఇళ్లలోకి చొరబడ్డారు. ఆడవారిపై అత్యాచారాలు చేశారు. అంతే కాదు పరకాలకు దగ్గరలోనే ఉన్న రంగాపూరు గ్రామంలో జెండా ఎగురవేసే ప్రయత్నం చేసిన ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చేశారు" అని వైకుంఠం నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

రజాకార్ల ఆగడాలు గురించి వివరిస్తూ తమ కుటుంబం ఎదుర్కొన్న అనుభవాన్ని కూడా ఆయన పంచుకున్నారు.

"అవి సాయుధ పోరాటం జరుగుతున్న రోజులు. ఎటు చూసినా రజాకార్లు ఉండేవారు. ఊళ్లోకి వస్తున్న వారిపై నిఘా పెట్టి ఉంచే వారు. ఊరి బయటే ఉంటూ అనుమానం వస్తే, వారి ఇంటికి వెళ్లి ఏది పడితే అది లాక్కునే వారు. వారి దగ్గర తుపాకులు కూడా ఉండేవి. ఒక సారి మా నాన్న గారు పని మీద వేరే ఊరు వెళ్లారు. కొంత డబ్బు తీసుకొని వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఊరి బయట ఆయన్ను ఆపారు. మా అమ్మకు కబురు వచ్చింది. షావుకారు దగ్గర రూ. 20 తీసుకొని ఏడ్చుకుంటూ పోయింది మా అమ్మ. నాన్న ఇంటికి వచ్చాక చూశాను. వీపు మీద వాతలు ఉన్నాయి. ఆయన చనిపోయే వరకు కూడా ఆ గుర్తులు అలాగే ఉండిపోయాయి" అని వైకుంఠం చెప్పారు.

విద్యాసాగర్ రావు

ఖాసిం రిజ్వీ నేతృత్వంలో తెలంగాణ అంతటా రజాకర్ల ఆగడాలకు దిగారు. అయితే, ఆ తర్వాత భారత సైన్యం తెలంగాణను దేశంలో విలీనం చేసుకునేందుకు ఆపరేషన్ పోలో చేపట్టింది.

1948 సెప్టెంబరు 13న ప్రారంభమైన ఆపరేషన్ పోలో... సెప్టెంబర్ 17న నిజాం సైన్యం లొంగిపోవడంతో ముగిసింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

భాజపా నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు నాటి పోరాటాన్ని కళ్లకు కట్టేట్టుగా 1998లో పరకాలలో అమరధామం పేరిట ఓ నిర్మాణం చేపట్టారు. దాన్ని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ ఆవిష్కరించారు.

"మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పరకాల ఘటనను దక్షిణాది జలియన్ వాలాబాగ్‌గా వర్ణించారు. నాటి పోరాటాలను గుర్తించకపోతే, ఎన్నో బలిదానాల ఫలితంగా సాధించుకున్న ఈ తెలంగాణ అసంపూర్ణంగా మిగిలిపోతుంది" అని విద్యాసాగర్ రావు బీబీసీతో అన్నారు.

"తెలంగాణ పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంగా మొదలైన పోరు బాట, చాకలి ఐలమ్మతో మొదలైన తిరుగుబాటు, పేద రైతులు భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరులో ఎంతో బలయ్యారు. దొరల చేతుల్లో వందాలది మంది పేద రైతులు దోపిడికి గురైయ్యారు. స్వాతంత్రం వచ్చాక హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం చేసే క్రమంలో ఎన్నో ఘటనలు జరిగాయి. వాటిలో పరకాల, బెహరాన్ పల్లి వంటి ఘటనలు విషాదభరితం" అని చరిత్రకారులు వకుళాభరణం రామకృష్ణ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Parakala was called as the south India Jalianwalabagh.దక్షిణ భారత దేశ జలియన్‌వాలా బాగ్‌గా పరకాల పిలువబడింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X