ఈసారికి పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు ? కరోనా భయాలతో- గతంలోనూ ఇలాగే...
ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా ఇంకా అదుపులోకి రాకపోవడంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలపైనా దీని ప్రభావం పడేలా కనిపిస్తోంది. ప్రతీ ఏడాది నవంబర్ మూడో వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈసారి కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేకపోవడంతో శీతాకాల సమావేశాల నిర్వహణ డోలాయమానంలో పడింది. ఢిల్లీలో నెలకొన్న కరోనా పరిస్ధితులు కేంద్రానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో సమావేశాల నిర్వహణపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

పార్లమెంటు సమావేశాలపై కరోనా..
కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం గత రెండు పార్లమెంటు సమావేశాలను నిర్వహించింది. దీంతో పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు కరోనా బారిన పడ్డారు. కేంద్రమంత్రి సురేష్ అంగడి కరోనా కారణంగా చనిపోయారు. దీంతో ఈసారి పార్లమెంటు సమావేశాల పేరు చెబితేనే ఎంపీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విషయాన్ని గ్రహించిన కేంద్రం.. ఈసారి శీతాకాల సమావేశాలను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శీతాకాలంలో కరోనా వ్యాప్తి సెకండ్ వేవ్ తప్పదనే హెచ్చరికలే ఇందుకు ప్రధాన కారణం.
అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఢిల్లీలో దారుణ పరిస్ధితులు
ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసులు పతాకస్దాయికి చేరాయి. సాధారణ కాలుష్యానికి తోడు దీపావళి కాలుష్యం కూడా ప్రభావం చూపుతోంది.
ప్రస్తుతం ఢిల్లీలో ప్రతీ ఇంట్లోనూ కరోనా ఉందని, ప్రతీ నలుగురిలో ఒకరు వైరస్ బారిన పడ్డారని తాజాగా సీరో సర్వే రిపోర్ట్ నిర్ధారించింది.
దీంతో పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎంపీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. కాబట్టిశీతాకాల సమావేశాలను రద్దు చేసి ఏకంగా వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలతో పాటే వీటిని నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

గతంలో ఏం జరిగింది ?
గతంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలను పలుమార్లు రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. 1975, 1979, 1984లో ఇలా శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. మరోవైపు ఈ క్యాలెండర్ సంవత్సరంలో పార్లమెంటు అతి తక్కువ పని దినాలను నమోదు చేసింది. పార్లమెంటు సమావేశమైన తేదీలు, సెషన్స్, సభ్యుల హాజరీ ఇలా అన్ని విషయాల్లోనూ పార్లమెంటు ఈ ఏడాది కనిష్ట రికార్డులు నమోదు చేసుకుంది. 1991లో గరిష్టంగా పార్లమెంటు ఏడాదిలో ఆరుసార్లు సమావేశమైంది. ఇప్పటివరకూ ఏడుసార్లు పార్లమెంటు ఏడాదిలో ఐదుసార్లు సమావేశాలైన సందర్భాలున్నాయి. కనీసం ఏడాదిలో నాలుగుసార్లు సమావేశమైన సందర్భాలు కూడా 31సార్లు ఉన్నాయి. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు రద్దు కాకపోతే మాత్రం ఈ ఏడాది మూడు పార్లమెంటు భేటీలపైనా కరోనా ప్రభావం చూపినట్లవుతుంది.