ఎవరు గెలిచారన్నది కాదు..: బీహార్ ఎన్నికల ఫలితాలపై సోనూ సూద్ ఆసక్తికర వ్యాఖ్యలు
పాట్నా: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాడ్డౌన్లో వేలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాకు చేరుకునేందుకు అడగకుండానే సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. తాజాగా వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఆ గ్రామానికి వస్తా: సోనూ సూద్, దేశానికే వారు స్ఫూర్తినిచ్చారంటూ ప్రశంస

తమ జీవితాలు మెరుగుపడతాయనే..
తమ జీవితాలు ఇంకా మెరుగుపడతాయనే ఉద్దేశంతోనే బీహార్ ప్రజలు ఎన్డీఏకు అవకాశం ఇచ్చారని, మరోసారి కూడా అవకాశం ఇవ్వొచ్చని సోనూ సూద్ వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా తమకు ఏదో మేలు జరిగిందని భావించారు కాబట్టే మరోసారి అవకాశం కల్పించారన్నారు.

ఎవరు గెలిచారన్నది ముఖ్యం కాదు.. ఐదేళ్ల తర్వాత..
బీహార్ రాష్ట్రంలో ఎవరు గెలిచారన్నది ముఖ్యం కాదని.. ఐదేళ్ల తర్వాత అక్కడి ప్రజల జీవనస్థితిగతులు మారాయా? లేదా? అన్నదే ముఖ్యమని సోనూ సూద్ అన్నారు. ప్రజలు తాము ఎంచుకున్న ప్రభుత్వం మంచిదని గర్వపడేలా ఉండాలన్నారు. బీహార్ ప్రజలు మంచి కోసం ఎదురుచూస్తున్నారని, ఈ దేశ ప్రజలు ప్రభుత్వాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని తెలిపారు.

బీహార్ ప్రజలతో ప్రత్యేక అనుబంధం
బీహార్ రాష్ట్ర ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సోనూ సూద్ వ్యాఖ్యానించారు. బీహార్ రాష్ట్రంలో విద్య, మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 125 స్థానాల్లో విజయం నమోదు చేసిన ఎన్డీఏ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.తేజస్వి యాదవ్ ఆర్జేడీ మహాకూటమికి 110 సీట్లు వచ్చాయి.

సోనూ సూద్.. రీల్ హీరో కాదు.. రియల్ హీరో
కాగా, కరోనా లాక్డౌన్ కష్టకాలంలో ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు సోనూ సూద్ అలుపెరుగని సాయం చేసిన విషయం తెలిసిందే. సొంతంగా బస్సులను ఏర్పాటు చేసి బీహార్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోని వారి స్వస్థలాలకు చేర్చారు. ఇతర దేశాల్లో చిక్కుకున్న కొందరికి టికెట్లు కొనిచ్చి స్వదేశానికి రప్పించడం గమనార్హం. అంతేగాక, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి కష్టాల్లో ఉన్నవారికి సాయమందించారు. ఈ క్రమంలో సోనూ సూద్ రియల్ హీరో అంటూ నలువైపుల నుంచి ప్రశంసలు దక్కాయి. పలు అవార్డులు కూడా ఈ మనసున్న మనిషిని వరించాయి. ఇప్పటికీ సాయం కావాలంటూ ఏ పేద పిలిచినా నేనున్నానంటూ సాయం చేస్తున్నారు ఈ రియల్ హీరో.