• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణలో ‘లాక్‌డౌన్ నకిలీ జీవో’ సృష్టికర్త అరెస్ట్... ఎందుకిలా చేశావంటే ఏమన్నాడో తెలుసా... - ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

వాట్సాప్

తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తున్నారంటూ నకిలీ జీవోను సృష్టించి, ప్రచారంలో పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారంటూ ‌'నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

నకిలీ జీవోను సృష్టించి, దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌చేసిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను హైదరాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు.

ఈ నెల ఒకటో తేదీ నుంచి తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉంటుందంటూ సోషల్‌మీడియాలో నకిలీ జీవో సర్క్యులేట్‌ అయ్యింది.

దీనిపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ స్పందించి అది నకిలీ జీవో అని వివరణ ఇచ్చారు. ఆ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి మాదాపూర్‌కు చెందిన శ్రీపతి సంజీవ్‌కుమార్‌ అని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం తెలిపారు.

ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి బంజారాహిల్స్‌లోని ఓ సంస్థలో చార్టెర్డ్‌ అకౌంటెంట్‌‌గా పనిచేస్తున్నారు.

గతంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినప్పుడు విడుదల చేసిన జీవోను డౌన్‌లోడ్‌ చేసుకొని నకిలీ జీవోను ఆయన తయారుచేశారు.

నిందితుడు శ్రీపతి సంజీవ్‌కుమార్‌ను సోమవారం సీసీఎస్‌, పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన అపరేషన్‌లో పట్టుకున్నారు. ఆయన నుంచి ల్యాప్‌టాప్‌, ఒక ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

స్నేహితులను ఏప్రిల్‌ ఫూల్‌ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ జీవోను రూపొందించినట్టు విచారణలో శ్రీపతి పోలీసులకు వెల్లడించారు.

నకిలీ వార్తలు, నకిలీ జీవోలను ఫార్వర్డ్‌ చేసే వాట్సాప్‌ అడ్మిన్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. ఏదైనా సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేసే ముందు ప్రతి ఒక్కరూ, అందులో నిజా నిజాలు తెలుసుకోవాలని సూచించారు.

కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ గ్రూపు సొంతం

కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు సొంతం చేసుకుందంటూ 'సాక్షి’ దినపత్రిక ఓ కథనం రాసింది.

ఇప్పటికే కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను కలిగి ఉన్న అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసింది.

కృష్ణపట్నం పోర్టులో విశ్వ సముద్ర హోల్డింగ్స్‌కు చెందిన 25 శాతం వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏపీసెజ్‌ సోమవారం స్టాక్‌ ఎక్చేంజ్‌‌లకు తెలియచేసింది.

దీంతో కృష్ణపట్నం పోర్టులో వాటా 75 శాతం నుంచి 100 శాతం వరకు చేరినట్లు తెలిపింది. గతేడాది అక్టోబర్‌ నెలలో 75 శాతం వాటాను కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక ఏడాది 2021 ఎబిట్టాకు(చెల్లించాల్సిన పన్నులు, వడ్డీలు, తరుగుదల వంటివన్నీ లెక్కలోకి తీసుకొని లెక్కించే ఆదాయం) 10.3 రెట్లు అధికంగా కృష్ణపట్నం పోర్టు విలువను రూ.13,765 కోట్లుగా మదింపు వేసినట్లు తెలిపింది.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో 38 మిలియన్‌ టన్నుల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా రూ.1,840 కోట్ల ఆదాయం, ఎబిట్టా రూ.3,125 కోట్లుగా పేర్కొంది.

కృష్ణపట్నం పోర్టులో ఏపీసెజ్ 100 శాతం వాటాను కొనుగోలు చేసినా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై ఎటువంటి ప్రభావమూ చూపదని ఏపీ మారిటైమ్‌ బోర్డు స్పష్టం చేసింది.

కృష్ణపట్నం పోర్టు ఆదాయంలో 2.6 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుందని, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందని ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో మురళీధరన్ తెలిపారు.

కరోనావైరస్

తెలంగాణలో కరోనావైరస్ యూకే స్ట్రెయిన్‌

తెలంగాణలో కరోనావైరస్ యూకే స్ట్రెయిన్‌ను గుర్తించారంటూ 'ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంత వేగంగా ఉండటానికి యూకే స్ట్రెయిన్‌ ఒక కారణమని తెలుస్తోంది.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో 93 నమూనాలను పరీక్షించి, విశ్లేషించగా.. ఏకంగా 12 నమూనాల్లో యూకే స్ట్రెయిన్‌ను గుర్తించారు. ఈ విషయాన్ని మెడ్రిక్సివ్‌ జర్నల్‌ గత నెల 27వ తేదీన ప్రచురించింది.

యూకే స్ట్రెయిన్‌ వేగం 60 శాతం అధికమని పలు అధ్యయనాల్లో తేలింది. ఆర్‌నాట్‌ (వైరస్‌ పునరుత్పత్తి సంఖ్య) కూడా 20 శాతం ఎక్కువని వెల్లడైంది.

ఈ నేపథ్యంలో వ్యాప్తి పెరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఓ ఇంటివాడవుతున్న గగన్ నారంగ్...

ఒలింపిక్ కాంస్య పతక విజేత, ప్రముఖ షూటర్ గగన్ నారంగ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ 'ఈనాడు’ దినపత్రిక ఓ కథనం రాసింది.

2010 కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలిచిన ఉత్తర్‌ ప్రదేశ్‌ షూటర్‌ అన్నురాజ్‌ సింగ్‌తో గగన్‌ పెళ్లి ఈ నెల 21న హైదరాబాద్‌లోని ఒక స్టార్‌ హోటల్లో జరగబోతోంది.

వీళ్లిద్దరి వయసూ 37 ఏళ్లే. రెండు దశాబ్దాలుగా షూటింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అనేక అంతర్జాతీయ టోర్నీల్లో కలిసి పోటీ పడుతున్నారు.

తన తల్లికి అన్ను అంటే చాలా ఇష్టమని, అలాగే అన్ను తల్లిదండ్రులకు తాను నచ్చానని, దీంతో పెళ్లికి మార్గం సుగమగమైందని గగన్‌ తెలిపారు.

''మేం పెళ్లి చేసుకుందామని సరిగ్గా ఎప్పుడు అనుకున్నామో చెప్పలేను. 2002 నుంచి జట్టు సభ్యులుగా ఉన్నాం. తర్వాత స్నేహితులయ్యాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అన్ని సమయాల్లో ఒకరికొకరు అండగా నిలిచాం. కాలం గడిచేకొద్దీ పెళ్లి చేసుకుందామన్న ఆలోచన ఇద్దరికీ కలిగింది’’ అని అన్ను చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Person who circulated fake news on lockdown in Telangana arrested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X