వేతన జీవులకు ఊరట: వ్యక్తిగత ఆదాయపు పన్ను తగ్గింపు: అంత కట్టక్కర్లేదిక..!
న్యూఢిల్లీ: వేతనాల మీద ఆధారపడి జీవించే వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి కుటుంబాల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. కొత్తగా శ్లాబుల విధానాన్ని సవరించారు. ఈ సారి బడ్జెట్లో కొత్తగా వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎలాంటి డిడక్షన్లు లేనట్టయితేనే ఈ విధానం వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Union Budget 2020: సబ్ కా సాథ్..సబ్ కా వికాస్: బడ్జెట్ స్థూల సందేశం ఇదే: నిర్మలా సీతారామన్.. !

వార్షికాదాయం రూ రెండున్నర లక్షల లోపే ఉంటే..
వార్షికాదాయం అయిదు లక్షల రూపాయలకు మించిన ఉద్యోగులు ప్రస్తుతం 20 శాతం వ్యక్తిగత ఆదాయపు పన్నును చెల్లిస్తారు. దీన్ని 10 శాతానికి తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వార్షికాదాయం రెండున్నర లక్షల రూపాయల వరకు ఉన్న ఉద్యోగులను పన్ను చెల్లింపులను మినహాయిస్తునట్లు చెప్పారు. సంవత్సరానికి రెండున్నర లక్షల నుంచి అయిదు లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారు అయిదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

వార్షికాదాయం అయిదు లక్షలు దాటితే..
సంవత్సరానికి అయిదు లక్షల కంటే అధిక మొత్తాన్ని ఆర్జించే ఉద్యోగులు 10 శాతం వ్యక్తిగత ఆదాయపు పన్నును చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటిదాకా ఈ మొత్తం 20 శాతం వరకు ఉండేదని అన్నారు. ఏడున్నర లక్షల రూపాయల వరకూ 10 శాతం పన్నును వర్తింపజేసినట్లు తెలిపారు. ఏడున్నర నుంచి నుంచి 10 లక్షల రూపాయల ఆదాయం ఉంటే 15 శాతం, 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించే వారికి 20 శాతం పన్నులను విధించామని అన్నారు.

12.5 లక్షల రూపాయలకు మించి ఆదాయం ఉంటే..
12.5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల ఆదాయం ఉంటే 25 శాతం, వార్షికాదాయం 15 లక్షల కంటే అధికంగా ఉంటే 30 శాతం పన్ను విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 15 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారు సంవత్సరానికి లక్షా 95 వేల రూపాయల పన్నును చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దీనివల్ల ఖాజానాకు వచ్చే రాబడి తగ్గుతుందని, అయినప్పటికీ.. దిగవ, మధ్య తరగతి కుటుంబీకుల ఆదాయ వనరులను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు ప్రతిపాదించినట్లు చెప్పారు.