• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెట్రోలు, డీజిల్ రేట్లు: యూపీఏ విధానాల కారణంగానే చమురు ధరలు పెరుగుతున్నాయా? మోదీ ప్రభుత్వ వాదనలో నిజమెంత?

By BBC News తెలుగు
|
యూపీఏ హయాంలో జారీ చేసిన బాండ్ల కారణంగానే చమురు భారం పడుతోందని మోదీ ప్రభుత్వం చెబుతోంది.

గత రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర రూ .100 దాటగా, మిగతా అన్ని రాష్ట్రాల్లో రూ.100కు చేరువగా ఉంది.

మంగళవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 30 నుంచి 35 పైసలు పెరిగాయి. దిల్లీలో పెట్రోల్‌ రూ.98.81, డీజిల్‌ రూ.89.18గా ఉంది. అదే సమయంలో ముంబయి బెంగళూరు, పట్నా, భోపాల్‌లో పెట్రోల్ ధర రూ .100 కంటే ఎక్కువగానే ఉంది.

పెట్రోల్-డీజిల్ ధరలను నాలుగో నెలలో వరుసగా 18 రోజులు పెంచలేదు. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు మే 2న వెల్లడి కాగా, ఆ తర్వాత నుంచి ధరలు పెరగడం మొదలు పెట్టాయి.

పెట్రోల్-డీజిల్ ధరలు ఒక్క మే నెలలోనే 16 సార్లు పెరిగాయి. మే, జూన్ మధ్య పెట్రోల్, డీజిల్ ధరలను 32 సార్లు పెంచారు. గత రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ రెండింటి ధర సుమారు రూ.8.50 పెరిగింది.

https://twitter.com/BJP4India/status/1039096527782797312

ధరలు పెరగడానికి కారణాలేంటి?

పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నిరసనలు చేపట్టింది. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది.

అయితే, 2014కి ముందు ఆయిల్ కంపెనీలకు బాండ్లను జారీ చేసిన కాంగ్రెస్ పార్టీయే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణమని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో అన్నారు.

యూపీఏ హయాంలో జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి ఉందని, ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

2018లో కూడా బీజేపీ ఇదే వాదన చేసింది. ''పెట్రోలియం ధరలపై ఆర్థికవేత్త ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిందేమిటి, చేసిందేమిటి? డబ్బులు చెట్లకు కాయవు అంటూ రూ.1.3 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ బిల్లులు చెల్లించకుండానే వెళ్లిపోయారు. మోదీ ప్రభుత్వం ఆ బిల్లులన్నింటినీ వడ్డీతో సహా చెల్లించింది. ఎందుకంటే అది మన పిల్లలకు భారం కారాదు'' అని అప్పట్లో బీజేపీ ట్వీట్ చేసింది.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ కూడా స్పందించింది. గత 7 సంవత్సరాలలో రూ.22 లక్షల కోట్లు సంపాదించగా, ఆయిల్ బాండ్లపై కేవలం రూ.3,500 కోట్లు మాత్రమే చెల్లించామని ట్వీట్‌లో పేర్కొంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుణంగా భారతదేశంలో చమురు ధరలు మారిపోతున్నాయి.

ఆయిల్ బాండ్లు అంటే ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ చేస్తున్న వాదనల్లో తరచుగా వినిపిస్తున్న పేరు చమురు బాండ్లు. అసలు ఈ చమురు బాండ్లు అంటే ఏంటో తెలుసుకోవాలి.

చమురు కంపెనీలు, ఎరువుల కంపెనీలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలకు వివిధ బాండ్లను జారీ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు రాజకీయంగా సున్నితమైనవిగా భావిస్తారు. పెరుగుతున్న చమురు ధరలు సాధారణ ప్రజలకు భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చేది.

అంటే, అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు ఎలా ఉన్నా, దేశంలోని ప్రభుత్వాలు వాటిని నియంత్రించగలవు.

అదే సమయంలో, గత ప్రభుత్వాలు చమురు కంపెనీలకు చమురు బాండ్లను జారీ చేశాయి. యూపీఏకు ముందు వాజ్‌పేయి ప్రభుత్వం కూడా చమురు బాండ్లను జారీ చేసింది.

ఆయిల్ బాండ్లు నగదు రాయితీలకు బదులుగా చమురు కంపెనీలకు ప్రభుత్వాలు ఇచ్చే హామీయే ఈ బాండ్లు. సాధారణంగా ఈ బాండ్లు ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉంటాయి. చమురు కంపెనీలకు వీటిపై వడ్డీ కూడా చెల్లిస్తారు.

కాబట్టి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తన ఖజానాపై భారం పడకుండా 2005 నుండి 2010 వరకు చమురు కంపెనీలకు చమురు బాండ్లను జారీ చేసింది. అంటే అప్పటి ప్రభుత్వం నగదు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రభుత్వం

దేశంలో ఆర్థిక మందగమనం తరువాత 2010లో పెట్రోల్ ధరలను నియంత్రించే పని నుంచి ప్రభుత్వాన్ని యూపీఏ బైటికి తీసుకు వచ్చింది. అప్పటి నుంచి ఆయిల్ బాండ్ల జారీ ముగిసింది.

ప్రభుత్వ నియంత్రణ ముగియడం అంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర పెరిగే కొద్దీ, దేశంలోని చమురు కంపెనీలు తమ ధరలను మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచడం, తగ్గించడం చేస్తాయి. అంటే, చమురు ధరల భారం నేరుగా సాధారణ వినియోగదారుడి భుజాల మీద పడింది.

2014లో కేంద్రంలో ప్రభుత్వం మారింది. అదే సంవత్సరం అక్టోబర్‌లో మోదీ ప్రభుత్వం కూడా డీజిల్‌ను ప్రభుత్వ నియంత్రణ నుండి తప్పించింది.

మొదట్లో పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉండేవి. కానీ జూన్ 15, 2017 నుండి డైనమిక్ ఆయిల్ ప్రైస్ విధానం అమలులోకి వచ్చింది. దీంతో చమురు ధరలు రోజువారీగా హెచ్చుతగ్గులకు గురయ్యాయి.

ఉదయం 6 గంటలకే పెట్రోలు బంకుల దగ్గర ఆ రోజు ధరలను ప్రకటించే విధానం మొదలైంది.

చమురు బాండ్‌ల భారం ఎంత?

ప్రభుత్వ బడ్జెట్ డేటా ప్రకారం.. గత యూపీఏ ప్రభుత్వ కాలంలో జారీ చేసిన సుమారు 1.31 లక్షల కోట్ల చమురు బాండ్లను 2026 మార్చి నాటికి చమురు కంపెనీలకు చెల్లించాల్సి ఉంది.

క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్) గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం 2014 నుండి చెల్లించాల్సిన అసలులో రూ.3,500 కోట్లు తిరిగి చెల్లించింది.

ఈ సంవత్సరం ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయల విలువైన బాండ్ల మెచ్యూరిటీని చెల్లించబోతోంది.

అక్టోబర్ 16, 2006న 15 సంవత్సరాలపాటు చెల్లే విధంగా రూ. 5000 కోట్ల విలువైన చమురు బాండ్లను అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు జారీ చేసింది.

వీటి మెచ్యూరిటీ ఈ ఏడాది అక్టోబర్ 16న ఉంటుంది. 2006 నవంబర్ 28న జారీ చేసిన రూ.5000 కోట్ల చమురు బాండ్‌ల మెచ్యూరిటీ కూడా ఈ ఏడాది నవంబర్ 28కి ఉంటుంది.

పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే వాటి ధరలు సగానికి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల ముందు నాటికి ఎంత చెల్లించాలి?

2008లో జారీ చేసిన రూ. 22,000 కోట్ల చమురు బాండ్లు నవంబర్ 10, 2023 నాటికి చెల్లించాలి

2006లో జారీ చేసిన రూ .4,150 కోట్ల విలువైన ఆయిల్ బాండ్లు డిసెంబర్ 15, 2023 నాటికి చెల్లించాలి.

2007లో జారీ చేసిన రూ. 5,000 కోట్ల విలువైన ఆయిల్ బాండ్లు ఫిబ్రవరి 12, 2024 నాటికి మెచ్యూరిటీకి వస్తాయి.

ఈ మొత్తం రూ.31,150 కోట్లు అవుతుంది. ఈ ఏడాది చెల్లించాల్సిన రూ.10 వేల కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.

పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం ఎంత సంపాదిస్తుంది?

యూపీఏ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన చమురు బాండ్ల గురించి ప్రస్తుత ప్రభుత్వం పదే పదే చెబుతోందన్న విషయం గుర్తించాలి. మరి పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం నుండి కేంద్ర ప్రభుత్వం ఎంత సంపాదిస్తుంది?

మోదీ ప్రభుత్వం తన మొదటి పదవీ కాలం మొదటి సంవత్సరంలో అంటే 2014-15లో ఎక్సైజ్ సుంకం నుండి పెట్రోల్‌పై రూ.29,279 కోట్లు, డీజిల్‌పై రూ.42,881 కోట్లు సంపాదించింది.

ఈ ఏడాది మార్చిలో లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకుర్ తన లిఖిత పూర్వక సమాధానంలో, 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో పన్నుపై వచ్చే ఆదాయం పెట్రోల్, డీజిల్ రూ. 2.94 లక్షల కోట్లకు పెరిగిందన చెప్పారు.

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దీర్ఘకాలిక లాక్‌డౌన్లు విధించిన సంవత్సరం పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింది.

చమురు కంపెనీల బాండ్లకు కోసం కేంద్ర ప్రభుత్వం అసలు రూ.1.31 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ కూడా కలిపితే రెట్టింపు అవుతుంది. అప్పుడు చమురు కంపెనీలకు చెల్లించే మొత్తం రూ. 2.62 లక్షల కోట్లకు అటుఇటుగా ఉంటుంది.

ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏడాదిలోపు సంపాదించిన పన్ను కంటే తక్కువ అని స్పష్టమైంది. (2020-21 మొదటి 10 నెలల్లో, పెట్రోల్, డీజిల్ పన్ను నుండి రూ. 2.94 లక్షల కోట్లు సంపాదించింది.)

అంటే, యూపీఏ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన చమురు బాండ్లు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమని ప్రభుత్వం చెప్పడం ఒక విధంగా తప్పు.

చమురు ధరలు ఎలా నిర్ణయిస్తారు?

దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో 85% భారత ప్రభుత్వం దిగుమతి చేసుకోవాలి. ముడి చమురు బ్యారెల్‌కు సుమారు $75 ఖర్చు అవుతుంది. సోమవారం, ఈ ధర $ 74.58.

అంటే, రూపాయి విలువ (74.29) ఆధారంగా ఒక బ్యారెల్ ముడి చమురు ధర రూ. 5540.32. ఇప్పుడు ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు. అంటే ముడి చమురు ధర లీటరుకు 34.84 రూపాయలు.

ముడి చమురును కొనుగోలు చేసిన తరువాత, దానిని భారతదేశానికి తీసుకురావడానికి, పోర్టుల నుంచి రిఫైనరీకి తీసుకెళ్లడానికి రవాణ ఖర్చులు ఉంటాయి.

దీనిని ప్రాసెస్ చేసిన తరువాత, ఈ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రూపంలో డీలర్లకు (పెట్రోల్ పంప్) పంపిణీ చేస్తాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం, డీలర్ల కమిషన్‌ను జత చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను విధిస్తాయి.

ఆరేళ్లలో 300% పెరిగిన ఆదాయం

డీలర్‌కు చేరినప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.35.65 గా ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం రూ.32.90 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది, డీలర్ కమీషన్‌ను చేరుస్తారు. (దిల్లీలో ఇది సగటున రూ.3.80)

ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తాయి (మహారాష్ట్రలో 46.52%, కేరళలో 34%, గోవాలో 17%).

గత మూడేళ్ల డేటాను అధ్యయనం చేసినప్పుడు, మూడేళ్ల క్రితం దిల్లీలో వ్యాట్ రూ .16 గా ఉందని, ఇప్పుడు ఇది సుమారు రూ .22 గా ఉందని తేలింది. మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ .19.48, డీజిల్‌కు రూ.15.33 చొప్పున విధించేది.

ఈ రెండు ఉత్పత్తులపై ఇప్పుడు రూ.32 కంటే ఎక్కువ విధిస్తోంది.

ఇలా వినియోగదారులు పెట్రోల్ కొనుగోలు చేసే ధరపై సుమారు 95 శాతం పన్ను చెల్లించాలి. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి కాబట్టి ఈ మొత్తం రోజూ పెరుగుతూనే ఉంటుంది.

ఈ ఏడాది మార్చిలో (2021) పార్లమెంటుకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ సమర్పించిన గణాంకాల ప్రకారం, గత ఆరు సంవత్సరాలలో, పెట్రోల్, డీజిల్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో సుమారు 300 శాతం పెరుగుదల ఉంది.

2014లో పెట్రోల్‌పై లీటరుకు ఎక్సైజ్ సుంకం 9.48 రూపాయలు ఉండగా, ఇప్పుడు రూ .32 కన్నా ఎక్కువైంది.. డీజిల్‌పై ఇది 3.56 రూపాయల నుండి రూ.32 రూపాయలకు పెరిగింది.

కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించగలదా?

కేంద్రం కోరుకుంటే తాను నష్ట పోకుండా పెట్రోల్, డీజిల్ ధరలలో కనీసం రూ.4.50 తగ్గించవచ్చు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ వ్యయం చాలా పెరిగింది. అటువంటి పరిస్థితిలోఆర్థిక లోటు పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పెట్రోల్ డీజిల్‌పై పన్నును తగ్గించడం లేదు.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు (అమెరికా, చైనా తరువాత) అయిన భారతదేశానికి మద్యంతోపాటు పెట్రోల్, డీజిల్‌ ఉత్తమ ఆదాయ వనరులు.

చమురు ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. ఒకవేళ ఈ రెండింటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తే వాటి ధరలు సగానికి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Petrol, diesel rates: Are oil prices rising because of UPA policies? Is the Modi government's argument true?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X