రోడ్ షోలో డీకే చేతిలో జేడీఎస్ జెండా, మాజీ సీఎం ఫైర్, వైరల్, లవ్ ఎక్కువ, దెబ్బకు దెబ్బ!
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ నిర్వహించిన రోడ్ షోలో ఆయన చేతిలో జేడీఎస్ పార్టీ జెండా ఉన్న ఫోటోలు, వీడియో ఇప్పుడు వైరల్ అయ్యాయి. డీకే. శివకుమార్ చేతిలో జేడీఎస్ పట్టుకుని ఊపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చేతిలో ఏ పార్టీ జెండా ఉందో కూడా తెలీకుండా రోడ్ షోలు నిర్వహించడం ఏమిటని సిద్దరామయ్య ఆయన సన్నిహితుల దగ్గర మండిపడ్డారు. డీకే. శివకుమార్ మీద సిద్దరామయ్య మండిపడుతున్న సమయంలో తీసిన వీడియో బయటకు రావడంతో అది సోషల్ మీడియా వైరల్ అయ్యింది. తన మీద సిద్దరామయ్యకు లవ్ ఎక్కువ అని డీకే. శివకుమార్ సెటైర్లు వేశారు.
తీహార్ జైల్ టూ బెంగళూరు
అక్రమ ఆస్తులు సంపాదించారని. మనీల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎన్ ఫోన్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు డీకే. శివకుమార్ ను అరెస్టు చేసి ఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించారు. దాదాపు 50 రోజులు తీహార్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించిన డీకే. శివకుమార్ ఈనెల 23వ తేదీ (గత వారం) బెయిల్ మీద బయటకు వచ్చారు. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన డీకే. శివకుమార్ గత శనివారం బెంగళూరు వచ్చారు.
డీకే ఫ్యాన్స్ హంగామా
ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న డీకే. శివకుమార్ కు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రం (బెంగళూరు ఎయిర్ పోర్టు)లో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామితో పాటు డీకే. సన్నిహితులు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు ఆయన మద్దతుదారులు, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు స్వాగతం పలుకుతూ రోడ్ షో ఏర్పాటు చేశారు. వేలాది మంది కార్యకర్తలతో డీకే. శివకుమార్ ఎయిర్పర్టు నుంచి ఊరేగింపుగా బయలుదేరారు.
చేతిలో జేడీఎస్ జెండా
డీకే. శివకుమార్ రోడ్ షోలో పెద్ద ఎత్తున జేడీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓపెన్ టాప్ జీప్ లో రోడ్ షో నిర్వహిస్తున్న డీకే. శివకుమార్ చేతికి జేడీఎస్ కార్యకర్తలు ఆ పార్టీ జెండాలు ఇచ్చారు. ఆ సమయంలో డీకే. శివకుమార్ జేడీఎస్ పార్టీ జెండాలు ఊపుతూ రోడ్ షో కొనసాగించారు. డీకే. శివకుమార్ తెలిసి జేడీఎస్ జెండా పట్టుకున్నారా ? లేక ఆ పార్టీ కార్యకర్తల మీద అభిమానంతో జెండా పట్టుకున్నారా ? అనే విషయం అర్థం కాక కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు.
మాజీ సీఎం సిద్దూ ఫైర్
డీకే. శివకుమార్ రోడ్ షోలో జేడీఎస్ జెండాలు పట్టుకున్న విషయంపై మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన అధికార నివాసం కృష్ణలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం అయ్యి చర్చించారు. ఆ సమయంలో ఏందండి ఇది, డీకే. శివకుమార్ బహిరంగంగా జేడీఎస్ జెండాలు పట్టుకుని రోడ్ నిర్వహించడంలో ఏమిటి అర్థం అంటూ చాల కోపంగా అన్నారు. మాజీ సీఎం అధికార నివాసం కృష్ణలో అత్యంత సన్నిహితులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే మంజునాథ్ తదితరులతో కోపంగా మాట్లాడుతున్న వీడియో సైతం లీక్ కావడంతో అది కాస్త వైరల్ అయ్యింది.
నా మీద లవ్ ఎక్కువ
సిద్దరామయ్య తన మీద మండిపడుతున్న వీడియో విడుదల కావడంతో మాజీ మంత్రి డీకే. శివకుమార్ సోమవారం మీడియాతో మాట్లాడారు. తనకంటే సిద్దరామయ్య చాల సీనియర్, ఆయన పెద్ద మనిషి అన్నారు. తన మీద సిద్దరాయ్యకు ప్రేమ (లవ్) ఎక్కువని, అందుకే అలా మాట్లాడి ఉంటారని డీకే. శివకుమార్ అన్నారు. తన మీద విమర్శలు చేస్తున్న వారి మీద డీకే. శివకుమార్ సెటైర్లు వేశారు. మొత్తం మీద డీకే. శివకుమార్ పెద్ద జేడీఎస్ జెండా చేతిలో పట్టుకుని రోడ్ షోలో ఊరేగింపుగా వెళ్లిన విషయంలో ఆయన అంటే గిట్టవారు మండిపడుతున్నారు.