‘హీరా బెన్’ జీ మీరైనా మీ కొడుక్కి చెప్పండి: ప్రధాని మోడీ తల్లికి ఓ రైతు లేఖ
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన కొనసాగున్న క్రమంలో ఓ రైతు ఆ చట్టాల రద్దు కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీకి లేఖ రాశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తన కుమారుడికి చెప్పాలని లేఖలో కోరారు.
ఈ మేరకు మోడీ తల్లి హీరాబెన్‌కు పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అనే రైతు లేఖ రాశారు. 'బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నా. ఈ దేశానికి ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నలు సాగు చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ రోడ్లపై ఆందోళన చేస్తున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు' అని తెలిపారు.

అంతేగాక, 'వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నవారిలో కొందరు అనారోగ్యం పాలవగా, మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. తోటి రైతులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధిస్తోంది. మీ కుమారుడైన ప్రధాని నరేంద్ర మోడీకి ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకురావాలని చెప్పండి. ఎవరు చెప్పినా వినకపోవచ్చు కానీ, మీరు చెప్తే తప్పక వింటారన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే ఎంతో ఆశగా ఈ లేఖ రాస్తున్నా. మీరు ఆ పని చేస్తే దేశం మొత్తం మీకు రుణపడి ఉంటుంది. ధన్యవాదాలు' అని ఆ రైతు లేఖలో పేర్కొన్నారు.
అంబానీ, అదానీ, కార్పొరేట్లకు మేలు చేసేవిగా ఈ చట్టాలున్నాయని ఆరోపించారు.
కాగా, కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది రైతులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా రహదారులపైనేవారు ఆందోలన తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ.. సఫలం కాలేదు.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదంటూ కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. చట్టాల రద్దు మినహా దేనికైనా తాము సిద్ధమేనని పేర్కొంది. అయితే, రైతు సంఘాల నేతలు కూడా వ్యవసాయ చట్టాల రద్దు తప్ప తమకేం అవసరం లేదని చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన చర్చలు ఫలవంతం కాలేదు. మరోసారి చర్చలు జరిపేందుకు అటు కేంద్రం, ఇటు రైతు సంఘాల ప్రతినిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. చర్చలు మాత్రం సఫలమయ్యేట్లు కనిపించడం లేదు. తాజా, కేంద్రం వ్యవసాయ చట్టాల అమలును ఒకటిన్నర సంవత్సరాలపాటు నిలిపివేస్తామని చెప్పినా.. రైతులు మాత్రం చట్టాల రద్దుకే డిమాండ్ చేస్తున్నారు.