బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండండి: రాష్ట్రాలకు ప్రధాని మోడీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: దేశంలోని పది రాష్ట్రాలకు పైగా బర్డ్ ఫ్లూ బారిన పడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వాక్సినేషన్ డ్రైవ్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండండి..
స్థానిక ప్రభుత్వ అధికారులు నీటి కొలనులు, జంతు ప్రదర్శనశాలలు, పౌల్టీ మార్కెట్లు, పౌల్టీఫాంల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ ఒక ప్రణాళిక రూపొందించిందని, దీనిలో జిల్లా కలెక్టర్లదే కీలక పాత్ర అని ప్రధాని స్పష్టం చేశారు.
బర్డ్ ఫ్లూ వ్యాపించిన రాష్ట్రాల సీఎంలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ద్వారా జిల్లా కలెక్టర్లను మార్దదర్శనం చేయాలని సూచించారు. బర్డ్ ఫ్లూ ప్రభావం లేని రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

పక్షుల్లో అనారోగ్య లక్షణాలుంటే..
పక్షుల్లో అనారోగ్య లక్షణాలు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలని, వాటి నమూనాలను ల్యాబ్‌లకు పంపాలని సూచించారు. తద్వారా అవసరమైన చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. అటవీ, ఆరోగ్య, పశుసంవర్థక శాఖల మధ్య సరైన సమన్వయంతో ఈ సవాల్‌ను త్వరగా అధిగమించగలమని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.

పది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ..
దేశంలో ఇప్పటి వరకు పది రాష్ట్రాలకుపైగా బర్డ్ ఫ్లూ వ్యాపించడం గమనార్హం. రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో వందలాది కాకులు బర్డ్ ఫ్లూ బారినపడి మృత్యువాతపడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా వందలాది పక్షులను చంపివేసేందుకు కూడా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే కరోనా మహమ్మారితో భయాందోళనల్లో ఉన్న ప్రజలకు ఈ బర్డ్ ఫ్లూ కారణంగా మరింత ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శుభ్రతను పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా కోళ్ల ధరలు బాగా పడిపోవడం గమనార్హం.