మమతా బెనర్జీ పై ప్రధాని మోడీ ధ్వజం .. ఆమె భావజాలం వల్లే బెంగాల్ నాశనం, రైతులకు నష్టం
పశ్చిమ బెంగాల్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి, బిజెపి నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పదునైన మాటల దాడిని చేశారు.

బెంగాల్ రైతులు కేంద్రం పథకాల ప్రయోజనాలను కోల్పోయారు : మోడీ
రైతుల పేరిట తమ రాజకీయ భావజాలాన్ని నిరసన పేరుతో ముందుకు తీసుకురావడంలో నాయకులు బిజీగా ఉన్నందున కేంద్రం పథకాల ప్రయోజనాలను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. నేడు, రూ .18,000 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయబడ్డాయని, ఇందులో ఎలాంటి మధ్యవర్తులు లేరు, కమీషన్లు లేవు. కానీ బెంగాల్ రైతులు కేంద్రం పథకాల ప్రయోజనాలను పొందడాన్ని కోల్పోయారు అని నరేంద్రమోడీ పేర్కొన్నారు.

కేంద్ర పథకాల ప్రయోజనాలు రైతులకు చేరేందుకు అనుమతించని ఏకైక రాష్ట్రం బెంగాల్
ఈ పథకాల ప్రయోజనాలు రైతులకు చేరేందుకు అనుమతించని ఏకైక రాష్ట్రం బెంగాల్ అని, రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం పిఎం-కిసాన్ నిధుల విడుదల చేసిన తరువాత పిఎం చెప్పారు.
మమతా బెనర్జీ భావజాలం పశ్చిమ బెంగాల్‌ను నాశనం చేసిందన్నారు. బెంగాల్లో కేంద్ర పథకాలకు వ్యతిరేకంగా నిలబడే వ్యక్తులు పంజాబ్‌కు వెళ్లి రంగులు మార్చినప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరాలు తెలపలేదని ప్రశ్నించారు. రైతుల విషయంలో మమతా బెనర్జీ చర్యలు తను చాలా బాధించాయని పేర్కొన్నారు మోడీ .

మమతా బెనర్జీ తీరు వల్ల 70 లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు దెబ్బ
మమతా బెనర్జీ తీరు వల్ల 70 లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాల దెబ్బతిన్నాయన్నారు. పి ఎం కిసాన్ పథకాన్ని అమలు చేయకూడదని మమతాబెనర్జీ నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు కనిపించలేదని నరేంద్రమోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయో చెప్పాలన్నారు మోడీ. పీఎం కిసాన్ పథకం కింద చిన్న మరియు సన్నకారు రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది .

ఆన్ లైన్ లో రైతులు దరఖాస్తు చేసినా ధ్రువీకరణ నిలిపివేసిన మమత సర్కార్
ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది అని పేర్కొన్న నరేంద్ర మోడీ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇరవై మూడు లక్షలకు పైగా పశ్చిమబెంగాల్ రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని , కానీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరణ ప్రక్రియను నిలిపి వేసిందని మోడీ పేర్కొన్నారు.
అందువల్ల పశ్చిమ బెంగాల్ రైతులకు నష్టం జరిగిందని ఆయన మండిపడ్డారు . మమతా బెనర్జీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మోడీ .