వారిద్దరికీ వ్యత్యాసం ఉంది: సీఏఏపై సభలో నెహ్రూ లేఖను ప్రస్తావించిన ప్రధాని మోడీ
దేశ విభజన తర్వాత భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు అర్థం ఏంటనేది స్పష్టంగా వివరించారని అన్నారు ప్రధాని మోడీ. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్కు వస్తున్న వారి గురించి ప్రధాని లోక్సభలో మాట్లాడారు. భారత పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు జరుగుతున్న వేళ ప్రధాని ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు వ్యత్యాసం
దేశ తొలి ప్రధాని హోదాలో నెహ్రూ అప్పటి అస్సాం ముఖ్యమంత్రి గోపీనాథ్ బర్దోలీకి రాసిన లేఖను సభలో గుర్తు చేశారు ప్రధని మోడీ. హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని నెహ్రూ పేర్కొన్న విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఇప్పుడు హిందూ శరణార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత భారత భుజస్కంధాలపై ఉందని మోడీ అన్నారు.

నెహ్రూ లియాఖత్ ఒప్పందం గురించి..
భారత్ పాక్ మధ్య 1950లో జరిగిన నెహ్రూ - లియాఖత్ ఒప్పందం గురించి కూడా ప్రధాని సభలో గుర్తుచేశారు. రెండు దేశాల్లోని మైనార్టీలుగా ఉన్నవారిని వారి మతాలను పరిరక్షించాలని ఉందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. మరి ఆ సమయంలో నెహ్రూ కేవలం పాకిస్తాన్లో నివసించే మైనార్టీల గురించే ఎందుకు మాట్లాడారని కాంగ్రెస్కు సూటి ప్రశ్న వేశారు. నెహ్రూ మత విద్వేషాలను రెచ్చగొట్టాలని భావించారా అని ప్రశ్నించారు.

పాకిస్తాన్లో హిందువులు అణిచివేతకు గురయ్యారు
ఇక మతపరమైన అణిచివేతకు లేదా హింస నుంచి తప్పించుకునేందుకు ఒక దేశం నుంచి మరొక దేశంకు వెళ్లాల్సిన దుస్థితి తమకు పట్టలేదని ధైర్యంగా పాకిస్తాన్లోనే భూపేంద్రకుమార్ మరియు జోగేంద్రనాథ్ మండల్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు ఉండిపోయారని ప్రధాని మోడీ గుర్తు చేశారు. భూపేంద్ర కుమార్ పాకిస్తాన్ చట్టసభలకు ఎన్నికయ్యారని ప్రధాని మోడీ చెప్పారు. అయితే పాకిస్తాన్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు ఎక్కువయ్యాయని పాక్ పార్లమెంటులోనే ఆయన తన స్వరాన్ని వినిపించారని చెప్పిన ప్రధాని ఆ తర్వాత భారత్కు వలస వచ్చి ఇక్కడే మరణించినట్లు చెప్పారు. ఇక పాకిస్తాన్ తొలి న్యాయశాఖ మంత్రి జోగేంద్ర నాథ్ మండల్ కూడా అక్కడ హిందువులకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారని ప్రధాని మోడీ చెప్పారు.

శరణార్థులకు పౌరసత్వం కల్పించేలా చట్టాలు చేయాలన్న నెహ్రూ
ఇక ప్రధానిగా నెహ్రూ లోక్సభలో ఒక ప్రకటన చేశారని గుర్తు చేశారు మోడీ. పాకిస్తాన్ నుంచి భారత్కు వలస వస్తున్న మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించాలని చెప్పారని మోడీ సభలో గుర్తుచేశారు. పాకిస్తాన్లో అణిచివేతకు హింసకు గురైన ప్రజలు భారత్కు రావాలని భావిస్తే మంచిదే అన్న నెహ్రూ ఒకవేళ ఇందుకు చట్టాలు అనుకూలించకపోతే చట్టసవరణ జరగాలని నవంబర్ 5, 1950లో చెప్పిన మాటలను ప్రధాని మోడీ సభకు గుర్తు చేశారు. ముందు చూపున్న నెహ్రూ పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతిఒక్కరికీ భారత పౌరసత్వం ఇవ్వాలని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. ఇక 1955లో తొలిసారిగా భారత పౌరసత్వ చట్టంకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పలు సవరణలు జరుగగా తాజాగా డిసెంబర్లో మోడీ సర్కార్ చట్టానికి సవరణలు చేసింది.