కరోనా టీకాకు ఇవీ కంపల్సరీ.. అవీ ఏంటంటే.. సీఎంలతో మోడీ వర్చువల్ మీట్..
ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే సమయం ఆసన్నమైంది. అయితే ఇందుకు కొవిన్, ఆధార్ కంపల్సరీ అని కేంద్రం స్పష్టంచేసింది. కొవిన్ (కరోనా వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్) పునాదిని ఏర్పరుస్తుందని కేంద్రం పేర్కొంది. ప్రపంచంలో అతి పెద్ద టీకా కార్యక్రమం జనవరి 16 నుంచి కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ను భారత్‌లో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.

ఆధార్, కొవిన్ కంపల్సరీ
కొవిడ్-19పై పోరులో సాంకేతిక పరిజ్ఞానం, సమాచార నిర్వహణపై ఏర్పాటయిన సాధికారిక బృందానికి చైర్మన్ అయిన రామ్‌సేవక్ శర్మ భేటీకి అధ్యక్షత వహించారు. వ్యాక్సిన్లు అందరికీ ఎక్కడైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండేలా ప్రక్రియ ఉండాలని సూచించారు. వ్యాక్సినేషన్ సమాచారాన్ని రియల్‌టైమ్‌లో సేకరించడం అన్నింటికన్నా ముఖ్యమని చెప్పారు. వ్యాక్సిన్ ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో వేయించుకుంటున్నారు.. ఏ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు తదితర అంశాలన్నీ కూడా పక్కాగా సేకరించాలని.. ఒకరి బదులు మరొకరు వ్యాక్సిన్ వేయించుకోకుండా చూడాలని.. ఇవన్నీ జరగాలంటే లబ్ధిదారులు తమ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకునేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించారు.

ముందు ఢిల్లీ.. తర్వాత...
వ్యాక్సినేషన్ ప్రణాళికను అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఢిల్లీ ప్రకటించింది. తొలిదశలో వారందరికీ 89 ఆస్పత్రుల్లో మాత్రమే టీకాలు వేయిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తమ రాష్ట్రంలో కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచిన యోధులందరికీ ఉచితంగా టీకా వేయిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక లేఖలో తెలిపారు. కరోనా టీకా కార్యక్రమాన్ని జనవరి 16 నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించినందున.. జనవరి 17న తలపెట్టిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని కేరళ సర్కారు వాయిదా వేసింది.

సీఎంలతో మోడీ వర్చువల్ మీట్
వ్యాక్సినేషన్ సన్నాహకాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం వర్చువల్ భేటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే ఈ భేటీలో.. సీఎంలు తమ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సన్నాహాల గురించి, ఇతరత్రా సమస్యలేవైనా ఉంటే వాటి గురించి ప్రధానికి వివరించనున్నారు.