హోలీ ముందే వచ్చేసింది-2024లోనూ ఇవే ఫలితాలు- యుద్ధం వల్లే ధరల పెరుగుదల-మోడీ కామెంట్స్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రసంగించారు. బీజేపీ ఘన విజయం నేపథ్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతిచ్చిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇది ప్రజాస్వామ్యానికి ఎంతో సంతోష దాయకమైన రోజని ప్రధాని మోడీ తెలిపారు. ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. మహిళలు, యువత బీజేపీకి ఇచ్చిన మద్దతు ఓ గొప్ప సందేశమన్నారు. తొలిసారి ఓటర్లు భారీగా తరలివచ్చి బీజేపీకి ఓటేశారన్నారు. హోలీ మార్చి 10నే మొదలవుతుందని ఎన్నికప్పుడు బీజెపీ కార్యకర్తలు హామీ ఇచ్చారని, వారు తనకు ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారన్నారు.

రాత్రింబవళ్లూ శ్రమించిన బీజేపీ కార్యకర్తలందరికీ మోడీ అభినందనలు తెలిపారు. జన మనసులు గెల్చుకోవడంలో వారు సఫలమయ్యారన్నారు. యూపీ దేశానికి ఎక్కువ మంది ప్రధానమంత్రుల్ని అందించిందని, కానీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిని మాత్రం తొలిసారి ఇచ్చిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
ఇవాళ ఫలితాలు వెలువడిన ఐదు రాష్ట్రాల్లో మూడింట బీజేపీ ప్రస్తుతం అధికారంలోనే ఉన్నప్పటికీ మరోసారి ఓట్ల శాతం పెరిగిందని ప్రధాని మోడీ గుర్తుచేసారు. యూపీ, గోవా, మణిపూర్ లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నా ప్రజా వ్యతిరేకత లేదనడానికి ఇదే నిదర్శనం అన్నారు. గోవాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని, మూడోసారి ప్రజలు తమకు అధికారం ఇచ్చారని మోడీ తెలిపారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయించాయని అన్నారు. పంజాబ్లో క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ జెండాను మాఫీ చేసినందుకు బీజేపీ కార్యకర్తలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచం కరోనా రూపంలో వందేళ్లలో అతిపెద్ద మహమ్మారిని చూస్తుండగా ఈ ఎన్నికలు జరిగాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలు నేలతో ముడిపడి ఉండడం వల్లే దేశం మనుగడ సాగిస్తోందన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడిని ప్రస్తావిస్తూ, భారతదేశం శాంతికి అనుకూలంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.భారతదేశం అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అనుకూలంగా ఉందన్నారు.అయితే ఈ యుద్ధంలో పోరాడుతున్న దేశాలు బహుళ రంగాలలో భారతదేశంతో సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉన్నాయన్నారు. అందుకే యుద్ధం ప్రభావంతో దేశంలో ఆయిల్, గ్యాస్, ఎరువుల ధరలు పెరుగుతున్నట్లు మోడీ తెలిపారు.