ఆరు నెలల్లో ఏం సాధించాం?: సర్కార్ పెర్మామెన్స్ పై ప్రధాని మోదీ రివ్యూ.. మంత్రుల ప్రెజెంటేషన్
కేంద్రంలో రెండోసారి మోడీ సర్కార్ ఏర్పడి అప్పుడే ఏడు నెలలు పూర్తికావస్తున్నది. ఇంకొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నవేళ.. గత ఆరు నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై, అనుసరించిన పనితీరుపై ప్రధాని నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కీలక శాఖలను విడివిడిగా రివ్యూ చేసిన ఆయన... శనివారం కేబినెట్ మంత్రులందరినీ ప్రత్యేకంగా పిలిపించుకుని పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మంత్రులు ఒక్కొక్కరుగా..
ప్రధాని ఆదేశాల మేరకు ఒక్కో మంత్రి తమ శాఖకు సంబంధించిన పనితీరు, సాధించిన విజయాలపై చిన్నపాటి ప్రజెంటేషన్లు ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా ఎన్నికల ప్రచారంలో ఆయా రంగాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఆయా శాఖలు ఏమేరకు నెరవేర్చగలిగాయనే విషయాన్ని ప్రధాని నేరుగా మంత్రులనే అడిగితెల్సుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా అగ్రికల్చర్, రూరల్ డెవలప్ మెంట్, సోషల్ సెక్టార్లపై ప్రధాని మోడీ ఎక్కువగా ఫోకస్ పెట్టారని విశ్వసనీయింగా తెలిసింది. భవిష్యత్తులో చేపట్టాల్సిన భారీ పనులకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

రెగ్యులర్ మీటింగ్స్ లా కాదు..
సాధారంగా ప్రతి బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమై, అవసరమైనమేరకు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది కాకుండా నెలకు ఒకసారి మంత్రులంతా మరోసారి భేటీ అయి, శాఖల మధ్య సమన్వయానికి సంబంధించిన అంశాలపై చర్చించడం మోడీ హయాంలో ఆనవాయితీగా వస్తున్నది. ఇవాళ్టి మీటింగ్ మాత్రం రెగ్యులర్ వాటిలా కాకుండా చాలా భిన్నంగా జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మీటింగ్ లో.. ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూగా ఉన్న సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులు, వాటిపై జరుగుతున్న నిరసనల ప్రస్తావన కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే దానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.