కరోనాపైపోరుకు పీఎం-కేర్స్: విరాళాలు ఇద్దాం..కష్టకాలంలో ఆదుకుందామన్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి దేశాన్ని కుదిపేస్తోంది. దేశంలో క్రమంగా కరోనావైరస్ కేసులు పెరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం దేశంలో సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించింది. అయితే ఈ సమయంలో కొందరికి ఇబ్బందులు తప్పడం లేదు. లాక్డౌన్ ప్రభావంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. లాక్డౌన్ ప్రభావంతో నష్టపోతున్న వారిని ఆదుకునేందుకు విరాళాలు సేకరించి ఆదుకుందామని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే "ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్ ఫండ్" (పీఎం-కేర్స్)ను ప్రకటించారు.
పీఎం కేర్స్‌కు విరాళాలు
పీఎం- కేర్స్‌కు దేశ ప్రజలు తమ విరాళాలు ఇవ్వాలని ప్రధాని కోరారు. తద్వారా ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి దేశంలో 21మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19పై పోరుకు దేశప్రజలంతా అంగీకారం తెలిపారని ట్విటర్లో ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో తాను "ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్ ఫండ్" ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆరోగ్యకరమైన భారత్ కోసం అందరం పాటుపడదామని ట్విటర్లో రాసుకొచ్చారు.
ఆరోగ్యవంతమైన భారత్ కోసం..
పీఎం కేర్స్‌కు విరాళాలు ఇచ్చి బాధితులను ఆదుకొందామని మరో ట్వీట్ ద్వారా తెలిపారు ప్రధాని మోడీ. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులే ఎదురైతే ఈ నిధి నుంచే ఖర్చు చేస్తామని ప్రధాని మోడీ చెప్పారు. ఇక విరాళాలు ఎలా పంపాలి ఏ అకౌంట్‌కు పంపాలి అనే పూర్తి వివరాలను ప్రధాని స్పష్టంగా తెలిపారు. ఇక పీఎం కేర్స్‌కు ఎంత డబ్బులైనా విరాళంగా ఇవ్వొచ్చని ప్రధాని చెప్పారు. ఈ నిధి విపత్తు సంభవించిన సమయంలో వినియోగిస్తామని మన పౌరులకు వినియోగిస్తామని చెప్పారు.భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం ఏ ఒక్క అవకాశం వదులుకోకూడదని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ.

విరాళాలు పంపాల్సిన పూర్తి వివరాలు
ఇక నుంచి దేశంలో ఏదైనా విపత్తు సంభవిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు పీఎం కేర్స్ స్థాపిస్తున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అని దీనికి ఛైర్మెన్‌గా ప్రధాని వ్యవహరిస్తారని ప్రకటన పేర్కొంది. ఇందులో సభ్యులుగా రక్షణశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి మరియు ఆర్థికశాఖ మంత్రులు ఉంటారని ప్రకటన పేర్కొంది. ఇక విరాళాలు పంపాలనుకునేవారు ఈ కింది వివరాలకు పంపాల్సి ఉంటుంది.
అకౌంట్ పేరు: PM CARES
అకౌంట్ నెంబర్ : 2121PM20202
బ్యాంక్ పేరు మరియు బ్రాంచ్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్
IFSC Code : SBIN0000691
SWIFT Code : SBININBB104
UPI ID: pmcares@sbi
అంతేకాదు pmindia.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించొచ్చు. అంతేకాదు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ(బీహెచ్ఐఎం, ఫోన్ పే అమెజాన్ పే, గూగుల్ పే, పేటీఎం, మోబిక్విక్), ఆర్టీజీఎస్/ఎన్ఈఎఫ్టీ ద్వారా కూడా చెల్లింపులు చేయొచ్చు. ఇక విరాళాలు ఇచ్చేవారికి సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుందని ప్రకటన పేర్కొంది.