థర్డ్ వేవ్ ఎఫెక్ట్- మరోసారి ఆ నిర్ణయాలే : నేడు సీఎంలతో ప్రధాని సమావేశం - ప్రకటన దిశగా..!!
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2.45 లక్షల కేసులు నమోదయ్యాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ సైతం క్రమేణా వ్యాపిస్తోంది. ఈ సమయంలో దేశ వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ మొదలైంది. సెకండ్ వేవ్ తరహాలోనే రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. వారాంతపు లాక్ డౌన్ లు ప్రకటించాయి.

ప్రధాని కీలక సమావేశం
ఇక, ఈ సమయంలో పెరుగుతున్న కేసులు... తీసుకోవాల్సిన తక్షణ చర్యల పైన ప్రధాని ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకొని.. మరోసారి కరోనా తీవ్ర స్థాయికి చేరకుండా నియంత్రణ దిశగా కీలక చర్యలకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలోనూ కొవిడ్ పరిస్థితిపై మోదీ చర్చించారు. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు.

రాష్ట్రాల్లో పరిస్థితులపై సమీక్ష
కరోనాను నిలువరించేందుకు టీకానే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. భారత్‌లో బుధవారం కొత్తగా 1,94,720 మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ కారణంగా మరో 442 మంది మరణించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు దేశంలోని ఆరోగ్యకర్తలు, 60ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీని ఇప్పటికే ప్రారంభించింది కేంద్రం. ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ సారి రాష్ట్రాలే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనేలా సూచించే అవకాశం కనిపిస్తోంది.

నిర్ణయాధికారం సీఎంలకే ఇస్తారా
మహారాష్ట్ర..తమిళనాడు..కర్ణాటక..ఢిల్లీల్లో కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఇక, పండుగ వేళ మరింతగా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాగాన్ని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. కానీ, ఈ సారి మరణాల సంఖ్య పెరగక పోవటం కొంత మేర ఉపశమనం ఇస్తోంది. అయినా.. కేసుల సంఖ్య రెండున్నార లక్షలు దాటటంతో .. వ్యాప్తి కట్టడి చర్యల పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది.
అదే సమయంలో కరోనా పరీక్షలు..చికిత్స పైన రాష్ట్రాలకు ప్రధాని దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. పండుగ తరువాత కొన్ని కఠిన నిర్ణయాల అమలు దిశగా చర్యలు ప్రకటించే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. దీంతో..ఈ రోజు జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొని ఉంది.