H-1B Visas: ప్రెసిడెంట్ బైడెన్‌తో హెచ్1బీ వీసా అంశంపై చర్చించిన ప్రధాని మోడీ
వాషింగ్టన్: మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక అంశాలపై చర్చలు జరిపారు. అమెరికాలోని భారత కమ్యూనిటీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భారతీయ ప్రొఫెషనల్స్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉండే హెచ్1బీ వీసా అంశంపైనా మోడీ.. బైడెన్‌తో చర్చించారు. ఈ మేరకు వివరాలను విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జో బైడెన్‌తో ప్రధాని మోడీ కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ భేటీలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని, సత్ససంబంధాలు మరింత దృఢంగా కొనసాగుతాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

హెచ్1బీ వీసాలపై మోడీ ఏమన్నారంటే.?
భారతీయ నిపుణులకు ఎంతో కీలకమైన హెచ్1బీ వీసా అంశంపై బైడెన్‌తో ప్రధాని మోడీ చర్చించారు. అనేక మంది భారతీయ నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారని, మరికొంత మంది ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక్కడ భారతీయ నిపుణులకు లభించే ప్రాధాన్యతను బట్టి ఈ దేశానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఈ దేశానికి వారు తమవంతుగా సేవలనందిస్తున్నారని తెలిపారు. అమెరికా ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.
యూఎస్‌లోని విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే?
వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. 2021లో రికార్డు స్థాయిలో 62,000 మంది విద్యార్థులకు అమెరికా వీసాలను మంజూరు చేసింది. కాగా, దాదాపు 2 లక్షల మంది వరకు ఇక్కడ ఉన్న భారతీయు విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి 7.7 బిలియన్ డాలర్ల మొత్తాన్ని అందిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఫుల్బ్రైట్ ప్రోగ్రామ్ 75 వ వార్షికోత్సవం కింద, ఈ కార్యక్రమం భారతదేశంలో ప్రారంభమైనప్పటి నుంచి 71 సంవత్సరాల పాటు అమెరికన్లు, భారతీయులను మరింత దగ్గర చేసింది.
2008లో, యునైటెడ్ స్టేట్స్తో సంయుక్తంగా ఈ ఫెలోషిప్‌లకు నిధులు సమకూర్చాలని భారతదేశం నిర్ణయించింది, ఆ తర్వాత ఈ కార్యక్రమం ఫుల్బ్రైట్-నెహ్రూ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌గా పేరు మార్చబడింది. ఈ మార్పిడి కార్యక్రమం కింద 20,000 కంటే ఎక్కువ ఫెలోషిప్‌లు, గ్రాంట్లు అందించబడ్డాయి. ఈ క్రమంలో ఈ విజయాలను యునైటెడ్ స్టేట్స్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తోంది.
వైట్ హౌస్ ప్రకారం.. రాబోయే యుఎస్-ఇండియా అలయన్స్ ఫర్ ఉమెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, యుఎస్ఎఐడి, యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో భారతదేశంలో మహిళల ఆర్థిక స్థితిస్థాపకత, సాధికారత కోసం ముందుకు సాగడానికి సహకరిస్తుంది.