ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్: రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు కమిటీ: పేర్లు కూడా ఫిక్స్
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో చోటు చేసుకున్న ఘటనను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సూచించింది. పంజాబ్ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తును తక్షణమే నిలిపి వేయాలని ఆదేశించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోన్న విచారణను కూడా నిలిపివేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. దీనికి బదులుగా సుప్రీంకోర్టు స్వయంగా.. ఓ దర్యాప్తు కమిటీని నియమించింది. స్వతంత్రంగా పని చేస్తుందని స్పష్టం చేసింది.

పంజాబ్ ఘటనపై..
కొద్దిరోజుల కిందట ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనకు రాగా..ఆయనకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ట్రాఫిక్ కష్టాలు ఎదురు కావడంతో తన ఎన్నికల సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మోడీ కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. 20 నిమిషాల పాటు ప్రధాని ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. అది కూడా ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్‌లో చిక్కుకున్నందు వల్ల ఎటూ కదల్లేని స్థితిని ఎదుర్కొన్నారాయన. ట్రాఫిక్ క్లియర్ చేసేంత వరకూ కారులో గడిపారు.

దర్యాప్తునకు కేంద్రం..
ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా సమీపంలో ఓ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన రాజకీయంగా పెను దుమారానికి దారి తీసింది. ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనికి గల కారణాలను సమర్పించాల్సిందిగా పంజాబ్ హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. డీజీపీ నుంచి నివేదికను కోరింది. ఈ ఘటన పట్ల భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటు విమర్శలు చేశారు.

సెక్యూరిటీ లోపం లేదు..
ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్ చిక్కుకోవడం పట్ల ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ స్పందించారు. రాష్ట్ర పోలీసుల లోపాలు ఏమీ లేవని అన్నారు. వారికి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే.. అన్ని ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. భటిండా విమానాశ్రయానికి చేరుకున్న తరువాత ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని ఫిరోజ్‌పూర్ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉందని, చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో ఆయన వచ్చారని ఛన్నీ స్పష్టం చేశారు.

మోడీ వ్యాఖ్యలతో మరింత..
కాగా- ఈ ఘటనపై ప్రధానమంత్రి మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాణాలతో తిరిగి వెళ్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీకి తెలియజేయాలని అన్నారు. ఢిల్లీకి బయలుదేరి వెళ్లడానికి మోడీ.. ఫిరోజ్‌పూర్ నుంచి తిరిగి భటిండా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో మాట్లాడారు. తాను పంజాబ్‌కు వచ్చి, ప్రాణాలతో తిరిగి వెళ్తున్నానని, మీ ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పండి.. అని తెలిపినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. ఈ వివాదానికి ఈ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టయింది.

సుప్రీంకోర్టులో విచారణ..
ప్రధాని మోడీ భద్రత వైఫల్యంపై సుప్రీంకోర్టు సైతం తీవ్రంగా పరిగణించింది. దీనిపై దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టింది. కీలక ఆదేశాలను జారీ చేసింది. పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తును నిలిపివేయాలని సూచించింది. అదే సమయంలో ఇండిపెండెంట్ కమిటీని వేయడానికి అంగీకారాన్ని తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఈ స్వతంత్ర కమిటీకి సారథ్యాన్ని వహిస్తారని స్పష్టం చేసింది. చండీగఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జాతీయ దర్యాప్తు సంస్థ ఇన్స్పెక్టర్ జనరల్, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ అదనపు డైరెక్టర్ జనరల్ (సెక్యూరిటీ)ను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.

విచారణ నుంచి తప్పుకోవాలంటూ..
మోడీ భద్రత వైఫల్యంపై పంజాబ్, కేంద్ర ప్రభుత్వం వేర్వేరుగా నిర్వహిస్తోన్న విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు సూచించింది. పంజాబ్ డీజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులను పంపించిందంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు వివరించారు. దీన్ని నిలిపివేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాను నియమించిన దర్యాప్తు కమిటీ విచారణకు పుల్‌స్టాప్ పెట్టిందని న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు.