సీజేఐ ఎన్వీ రమణ కీలక ఉత్తర్వులు: ఆ ఘటనపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు: కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో చోటు చేసుకున్న ఘటనను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టడానికి సన్నాహాలు పూర్తి చేసింది. స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్ర సారథ్యంలో ఈ కమిటీ దర్యాప్తు చేపడుతుంది. ఇందులో మరికొందరు సభ్యులుగా చేర్చింది. ప్రధాని భద్రత వైఫల్యం చోటు చేసుకోవడానికి గల కారణాలను అన్వేషిస్తుందీ కమిటీ.

పంజాబ్ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుంది. భద్రతను కట్టుదిట్టం చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలను కూడా ఇస్తుంది. కొద్దిరోజుల కిందట ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనకు రాగా..ఆయనకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ట్రాఫిక్ కష్టాలు ఎదురు కావడంతో తన ఎన్నికల సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మోడీ కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. 20 నిమిషాల పాటు ప్రధాని ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది.

లాయర్స్ వాయిస్ పిటీషన్‌పై..
అది కూడా ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్‌లో చిక్కుకున్నందు వల్ల ఎటూ కదల్లేని స్థితిని ఎదుర్కొన్నారాయన. ట్రాఫిక్ క్లియర్ చేసేంత వరకూ కారులో గడిపారు. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా సమీపంలో ఓ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన రాజకీయంగా పెను దుమారానికి దారి తీసింది. దీనిపై దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిరుద్ధ్ తివారి, పోలీస్ డైరెక్టర్ జనరల్ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరుతూ లాయర్స్ వాయిస్ ఈ పిటీషన్లను దాఖలు చేసింది.

ఆ దర్యాప్తు కమిటీలు రద్దు..
రెండు రోజల కిందట దీనిపై కీలక ఆదేశాలను ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రధాని భద్రత వైఫల్యానికి దారి తీసిన కారణాలను గుర్తించడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు పంజాబ్ సర్కార్ వేర్వేరుగా చేపట్టిన దర్యాప్తును తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. స్వతంత్రంగా పనిచేసే కమిటీని తామే నియమిస్తామని సుప్రీంకోర్టు అప్పుడే తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది.

రిటైర్డ్ న్యాయమూర్తితో..
ఇప్పుడు తాజాగా ఈ కమిటీ ఛైర్పర్సన్ పేరును ప్రకటించింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రను ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా నియమించింది. జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ అదనపు డైరెక్టర్ జనరల్ (సెక్యూరిటీ)ను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లీతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది.

కమిటీ విధులేంటీ..
ఈ కమిటీ విధి విధానాలు, ఉద్దేశాలను సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు. ప్రధాని మోడీ భద్రతలో వైఫల్యం చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఈ కమిటీ దర్యాప్తు చేపడుతుంది. పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిరుద్ధ్ తివారి, పోలీస్ డైరెక్టర్ జనరల్ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ సహా, ఫిరోజ్‌పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఆ ప్రాంత అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్‌ను విచారణకు పిలిపించే అవకాశం ఉంది. ఓ సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుంది. అలాగే ప్రధాని భద్రతను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలను ఇందులో పొందుపరుస్తుంది.