వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామతీర్థంలో రాజకీయ వేడి: శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలేం జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చంద్రబాబు

విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో రాముని తల తొలగించిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ సంఘటనపై రాజకీయ పార్టీలు స్పందించడంతో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో రాజకీయ పార్టీలు ఛలో రామతీర్థం అంటూ తమ శ్రేణులకు పిలుపునిచ్చాయి.

రామతీర్థం

పోటాపోటీగా రామతీర్థం పర్యటనలు

శనివారం ఉదయం విశాఖ చేరుకున్న చంద్రబాబుకు ఎయిర్ పోర్ట్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. కాసేపు స్ధానిక నాయకులతో చర్చలు జరిపిన చంద్రబాబు రామతీర్థం బయలుదేరారు. అప్పటికే విజయసాయిరెడ్డి రామతీర్థం చేరుకున్నారు.

మా నాయకుడు చంద్రబాబు రామతీర్థం వస్తున్నాడని తెలిసి విజయసాయిరెడ్డి అప్పటికప్పుడు రామతీర్థం వెళ్లడంలో ఆంతర్యమేమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

విజయాసాయిరెడ్డి

ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. వైఎస్సార్‌‌సీపీ శ్రేణులతో కలిసి ఘటన జరిగిన ప్రాంతాన్ని, కొండ పక్కన ఉన్న కొలనును పరిశీలించారు. ఆలయ అర్చకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు కొండ కింద వైసీపీ శ్రేణులు రామతీర్థం ఘటనపై టీడీపీ రాద్ధాంతం చేస్తోందంటూ ఆందోళనలు చేపట్టాయి. అలాగే టీడీపీ, బీజేపీ, వైసీపీ ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొండ కింద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

లారీ

టీడీపీ నాయకులకు నో ఎంట్రీ

ఇంతలో చంద్రబాబు, మాజీ హోం మంత్రి చినరాజప్ప ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయనగరం చేరుకున్నారు. రామతీర్థం వెళ్లేందుకు కేవలం చంద్రబాబు కాన్వాయ్‌కి మాత్రమే అనుమతి ఇచ్చి, మిగతా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

తనతో పాటు తన వారిని కూడా అనుమతించాలంటూ చంద్రబాబు కాసేపు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు మాత్రం చంద్రబాబుకి మాత్రమే అనుమతి ఇచ్చి మిగతా వారు వెళ్ళకుండా రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టారు. పోలీసులకి టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

విజయసాయిరెడ్డి

విజయసాయి రెడ్డి కారు అద్దాలు ధ్వంసం

చంద్రబాబు కాన్వాయ్ రామతీర్థం బయలుదేరిన సమయానికి విజయసాయిరెడ్డి కొండ కిందకు చేరుకున్నారు. ఆయన తన కారు వద్దకు వెళ్తుండగా టీడీపీ, బీజేపీ కార్యకర్తలు విజయసాయి రెడ్డి వైపు దూసుకొచ్చి చెప్పులు, రాళ్లు విసిరారు.

ఈ ఘటనలో విజయసాయిరెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో టీడీపీ, బీజేపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిపావని సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు అందర్నీ చెదరగొట్టి విజయసాయిరెడ్డిని కారు ఎక్కించి, అక్కడ నుంచి పంపించేశారు.

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. "రామతీర్థం ఘటనను ఖండిస్తున్నాం. హిందువుల మనోభావాలు, హిందూ దేవాలయాలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఆలయాల పరిరక్షణ, పవిత్రతను కాపాడేందుకు బీజేపీ కట్టుబడి ఉంది" అని అన్నారు.

చంద్రబాబు

విజయనగరం వచ్చిన సీఎం ఎందుకు మాట్లాడలేదు?

ఇంతలో చంద్రబాబు రామతీర్థం బోడికొండపైకి చేరుకున్నారు. చంద్రబాబు వెళ్లేసరికి ఆలయానికి తాళాలు వేసి ఉండడంతో విజయసాయి రెడ్డి వచ్చినప్పుడు తీసిన తాళాలు తాను రాగానే ఎందుకు వేశారంటూ అక్కడ ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి నుంచే విగ్రహాలను పరిశీలించిన చంద్రబాబు.. కోనేరును కూడా పరిశీలించారు.

అనంతరం కొండ దిగిన చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడారు.

"దేవాలయాలపై దాడులు జరగడం దారుణం. విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తెదేపా హయాంలో ఎప్పుడూ ప్రార్థనా మందిరాలపై దాడులు జరగలేదు. ముఖ్యమంత్రి జగన్ విజయనగరం వచ్చినా రామతీర్థం ఘటనపై ఎందుకు మాట్లాడలేదు. కనీసం ఆలయాన్ని కూడా ఎందుకు దర్శించలేదు. ఆలయానికి వచ్చి పరిశీలించాల్సిన బాధ్యత ఆయనకు లేదా..? బైబిల్‌ చదవకుండా నిద్రపోనని అనే సీఎం జగన్‌, ఇతరులకు కూడా విశ్వాసాలు ఉంటాయని గ్రహించలేదా? దేవాలయాలపై దాడుల ఘటనలపై సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని ప్రసంగాన్ని ముగించి విశాఖ బయలుదేరారు.

చంద్రబాబు, అశోక్ గజపతిరాజు

ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజు తొలగింపు

ఇది ఇలా ఉండగా... రామతీర్థం ఆలయ నిర్వహణలో విఫలం అయ్యారంటూ ఆలయ ఛైర్మన్, వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న అశోక్ గజపతిరాజును ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి దేవస్థానం, తూర్పుగోదావరి జిల్లా మండపల్లిలోని మండేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్ బాధ్యతల నుంచి కూడా అశోక్ గజపతిరాజును తప్పిస్తున్నట్లు దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఆదేశాలు జారీ చేశారు.

స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పందన

దేవాలయాలపై దాడుల విషయంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు దేవాదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లంపల్లికి స్వామీజీ పత్రికా ప్రకటన ద్వారా సూచించారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రలను నియంత్రించాలని కోరారు. ఆలయాల భద్రత విషయంలో కిందిస్థాయి సిబ్బందిని కూడా అప్రమత్తం చేయాలనీ, దేవాలయాలపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు.

జనసేన

ఈ నెల 5న రామతీర్థం ధర్మ యాత్ర

రామతీర్థం సంఘటనలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

"రామతీర్థం క్షేత్రంలో కోదండరామ స్వామి విగ్రహం తల నరికి వేస్తే భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ చర్యను నిరసించిన వారిపై ఆ క్షేత్రంలో పోలీసులు వ్యవహరించిన విధానం అప్రజాస్వామికంగా ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకురాలు రెడ్డి పావని సొమ్మసిల్లి పోయే విధంగా పోలీసులు దురుసుగా వ్యవహరించిన తీరు చూస్తే... ఆ వ్యవస్థ ఎవరి కోసం పని చేస్తుందో అర్థం అవుతుంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అలాగే జనసేన పార్టీ కార్యాలయం విడుదల చేసిన మరో పత్రికా ప్రకటనలో ఈ నెల 5న జనసేన-బీజేపీ సంయుక్తంగా 'రామతీర్థం ధర్మ యాత్ర' కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 5వ తేదీ ఉదయం 11 గంటలకు జనసేన, బీజేపీ... నేతలు,కార్యకర్తలు యాత్రగా రామతీర్థం వెళ్తున్నట్టు అందులో తెలిపారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

ట్వీట్లు, మీడియా మీట్లు, పేపర్ స్టేట్మెంట్లు

శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఉద్రిక్త సంఘటనల నేపథ్యంలో పార్టీల నాయకులు చేసిన ట్వీట్లు, పత్రికా ప్రకటనలు, మీడియా సమావేశాల్లో ఏమన్నారంటే:

"ప్రభుత్వంపై బురద జల్లాలనే దుర్బుద్ధితో కొందరు రామతీర్థం దుశ్చర్యకు పాల్పడ్డారు. రెండు రోజుల్లో నిజానిజాలు తెలుస్తాయి. దోషులను కఠినంగా శిక్షిస్తాం. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు" అని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారు.

"నాపై జగన్ రెడ్డి చేస్తున్న, చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవమేననీ సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చెయ్యడానికి నేను సిద్ధం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమా?" అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. "సీఎం జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న పాలనను తప్పుపట్టేవిధంగా టీడీపీ పార్టీకి చెందిన వాళ్లే రామతీర్థంలో విగ్రహాల విధ్వసం దుశ్చర్యకు పాల్పడ్డారు. లోకేష్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాను. లోకేష్ చెప్పినట్టుగానే సింహాద్రి అప్పన్న సన్నిధిలో చర్చకు తాను సిద్ధం. అయితే నారా లోకేశే స్వయంగా రావాలి" అని అన్నారు.

రామతీర్థం సంఘటనలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. "చంద్రబాబు మత రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఓటుకు నోటు కేసు తెరమీదకు రావడంతో జైశ్రీరామ్ అంటూ మోడీతో లాలూచీకి ప్రయత్నిస్తున్నారు. అసలు రామతీర్థం దుశ్చర్య వెనకాల చంద్రబాబు హస్తం ఉంది. ఇప్పటి వరకు రామతీర్థం ఆలయానికి ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు ఘటన జరిగిన వెంటనే ఎందుకు స్పందించలేదు..? ఆయనకు బాధ్యత లేదా?" అని అన్నారు.

మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు

"రాష్ట్రంలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత, లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. అలాగే వీటికి జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు చర్యలు తీసుకుంటున్నారు. మత సామరస్యానికి ప్రతీకైన ఏపీలో కొంతమంది ఆకతాయిలు, రాజకీయ నాయకులు మతాల మధ్య చిచ్చు పెడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు" అని హోంమంత్రి సుచరిత తెలిపారు.

రామతీర్ధానికి మంత్రులు

శనివారం రామతీర్థంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్ధితులతో ఏపీ మంత్రులు రామతీర్థం వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఆదివారం ఉదయం 10 గంటల మంత్రులు బొత్స, వెల్లంపల్లి రామతీర్థం వెళ్ళి సంఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Political heat in Ramatirtha: What actually happened on Saturday morning to evening
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X