నక్కతోక తొక్కిన ప్రశాంత్ కిషోర్: జగన్ రాజకీయ వ్యూహకర్తకు భలే ఆఫర్: సీఎం చీఫ్ అడ్వైజర్‌గా
చండీగఢ్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జనతాదళ్ (యునైటెడ్) మాజీ నాయకుడు ప్రశాంత్ కిషోర్.. నక్కతోక తొక్కారు. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తోన్న వేళ ఆయన డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్‌కు మరో బంపర్ ఆఫర్ లభించింది. పంజాబ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రశాంత్ కిషోర్‌కు ఏకంగా కేబినెట్ హోదా కల్పించింది.
జగన్ పార్టీతో కటీఫ్?: వైఎస్ షర్మిలతో యాంకర్ శ్యామల: పార్టీని ప్రకటించడమే ఆలస్యం

వైసీపీ విజయం వెనుక..
ఎన్నికల సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించే ఐ-ప్యాక్ సంస్థను నెలకొల్పిన ప్రశాంత్ కిషోర్.. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో మలచుకోవడానికి ఆయన ఇచ్చిన సలహాలు అద్భుతంగా పనిచేశాయి. ఫలితంగా- 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలచుకోగలిగింది. వైసీపీ సాధించిన ఈ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారనేది బహిరంగ రహస్యమే.

జేడీయూలో చేరినా..
ఎన్నికల అనంతరం ఆయన బిహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూలో చేరారు. ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అనంతరం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు విషయంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో భేదాభిప్రాయాలు తలెత్తడంతో పార్టీ నుంచి బయటికి వచ్చారు. అనంతరం మమతా బెనర్జీ వద్ద రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది విడతల్లో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంటుందని రెండు నెలల కిందటే జోస్యం చెప్పారు. దానికే తాను కట్టుబడి ఉన్నాననీ రెండు రోజుల కిందట ప్రకటించారు కూడా.

పంజాబ్ ముఖ్యమంత్రి వద్ద
తాజాగా ఆయన పంజాబ్ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రశాంత్ కిషోర్‌కు కేబినెట్ హోదా కల్పించారు. ఆయనకు ఒక్క రూపాయి మాత్రమే గౌరవ వేతనంగా చెల్లిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో తన పట్టును మరింత నిలుపుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రశాంత్ కిషోర్ సహకారాన్ని తీసుకుంటోందనడంలో సందేహాలు అనవసరం. మొన్నటికి మొన్నే పంజాబ్‌లో మున్సిపల్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. అదే ఊపును వచ్చే ఏడాది నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది.