పింక్ సిటీలో మహారాజుల్లా ''మహా'' కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: రోజు ఖర్చు ఎంతో తెలుసా.?
మహారాష్ట్రలో రాజకీయం సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఓ లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తుందేమో అన్న అనుమానంతో కాంగ్రెస్ పార్టీ వారి ఎమ్మెల్యేలను జైపూర్‌లోని హోటల్లో ఉంచింది. ఇక్కడే కొద్ది రోజుల పాటు ఆ ఎమ్మెల్యేలు రాజభోగాలు అనుభవించారు.
అనాలిసిస్: మహారాష్ట్రలో హైడ్రామా.. గవర్నర్ ఏం చేయబోతున్నారు..?

ఫైవ్‌స్టార్ రిసార్ట్స్‌లో ప్రైవేట్ విల్లాలో ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్లేలను ఆ పార్టీ రాజస్థాన్‌లోని జైపూర్‌కు తరలించింది. అక్కడే ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీరికి బస ఏర్పాటు చేసింది. ఉన్న కొద్దిరోజులు ఈ ఎమ్మెల్యేలు రాజభోగాలు అనుభవించారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం వీరి ఖర్చులను భరాయించినట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ పలు అభివృద్ధి పనులకు ఖజానాలో నిధులు లేవని అశోక్ గెహ్లాట్ సర్కార్ చెబుతుండగా.. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం అతిథి మర్యాదలు చేసేందుకు రోజుకు రూ. 1.2 లక్షలు ఖర్చు చేసింది.

జైపూర్ - ఢిల్లీ హైవేకు 1.5 కిలోమీటర్ల దూరంలో...
ఇతర పార్టీ నేతలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయకుండా వారిని చాలా దూరంగా ఉంచింది కాంగ్రెస్ పార్టీ. జైపూర్‌లోని బ్యూనా విస్తా రిసార్ట్స్ పేరుతో ఉన్న ఫైవ్‌స్టార్ రిసార్ట్స్‌లో వీరిని ఉంచింది. జైపూర్ ఢిల్లీ హైవేకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ లగ్జరీ రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్యేలు సేదతీరారు. ఇందులో 50 ప్రైవేట్ విల్లాలు ఉన్నాయి. ఒక్కో విల్లాకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక స్విమ్మింగ్ పూల్తో పాటు రెండు రెస్టారెంట్లు, రెండు బార్లు, ఒక స్పాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యేలు తెగ ఎంజాయ్ చేసినట్లు సమాచారం.

సాధారణ గది రోజు అద్దె రూ. 24వేలు
ఈ ప్రైవేట్ లగ్జరీ రిసార్టు ఫ్రాన్స్‌కు చెందిన ఓ రాజకీయనాయకుడిదని సమాచారం. ఈ రిసార్ట్‌లోని విల్లాలు ఫ్రెంచ్, రాజస్థాన్ స్టైల్లో ఉంటాయి. ఇక అత్యంత మామూలుగా ఉండే ప్రైవేట్ విల్లాలో రోజుకు అద్దె రూ.24వేలు. దీనికి 18శాతం ట్యాక్సులు అదనం. ఇక ఆ తరువాతి స్థాయి విల్లాలు రోజుకు రూ.25వేలు. దీన్నే హెరిటేజ్ విల్లాగా పిలుస్తారు. ఇక టాప్ ఎండ్ విల్లాలు, అంటే ప్రైవేట్ పూల్తో కూడిన విల్లాల రోజు అద్దె అక్షరాల రూ. 1.2 లక్షలు. ఈ విల్లాలు అద్దెకు తీసుకున్న అతిథులకు ప్రత్యేక మర్యాదలు చేస్తారు. గత మూడు రోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ బస చేస్తున్న నేపథ్యంలో బిల్లు కూడా భారీగానే వచ్చి ఉంటుంది. అయితే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోక తప్పదని చెబుతున్నారు కాంగ్రెస్ నేత ఒకరు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఇలాంటి ఖర్చులు తప్పవు అని చెబుతున్నారు.

టూరిస్టులుగా మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఇక ఈ లగ్జరీ విల్లాలో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ సీనియర్ నేతలు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా హాజరయ్యారు.ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక అతిథులుగా ట్రీట్ చేశారు. వీరికి జైపూర్ అందాలను తిప్పి చూపించారు. జోద్పూర్, ఆమెర్, పుష్కర్, అజ్మేర్లాంటి ప్రాంతాల్లో ఈ ఎమ్మెల్యేలను తిప్పి చూపించారు. ఈ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రానికి పర్యాటకులుగా వచ్చారని స్వయంగా రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ అవినాష్ పాండే చెప్పడం విశేషం. అంతేకాదు ఈ ఎమ్మెల్యేలు బయటకు అడుగు పెడితే చాలు వారి వెనకే పోలీసు సెక్యూరిటీ కదిలేది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!