Prabhas ఆదిపురుష్ చిత్ర బృందానికి బీజేపీ వార్నింగ్...పొలిటికల్ ట్విస్ట్: ఏమైందంటే..?
హైదరాబాద్ : టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం కేజీఎఫ్ మూవీ మేకర్స్‌తో సైన్ చేసిన చిత్రం సలార్ సెట్స్‌పైకి వెళ్లకముందే టైటిల్ పై వివాదం నెలకొంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా కూడా కాంట్రవర్శీకి కేరాఫ్‌గా మారింది. ఇంతకీ ఆచిత్రం ఏంటి.. ఆ విశేషాలేంటి...?

వివాదంలో ఆదిపురుష్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రంకు సంబంధించిన ప్రతి అంశం వార్తల్లో నిలుస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న చెడు పై మంచి ఎలా విజయం సాధించిందనే ఈ మూవీ కాన్సెప్ట్. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తుండగా లంకాధిపతి రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం టైటిల్ ప్రకటించినప్పటి నుంచే వార్తల్లో నిలుస్తోంది. భారీ తారాగణంతో వస్తున్న ఈ మూవీపై అదే స్థాయిలో కాంట్రవర్శీలు కూడా క్రియేట్ అవుతున్నాయి.
బీజేపీ ఎందుకు అభ్యంతరం చెబుతోంది..
సినిమా షూటింగ్ మొదలు కాకముందే బీజేపీ నేతలు దీనిపై అభ్యంతరం తెలుపుతున్నారు. రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎందుకు లేవనెత్తుకుపోయాడో దానికి గల కారణాలు ఈ చిత్రం ద్వారా తెలుస్తాయని, చిత్రం చూసినవారు ఈ ఎపిసోడ్‌పై కన్విన్స్ అవుతారంటూ రావణాసురుడి పాత్ర ధరిస్తున్న సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సైఫ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. దీనిపై మండిపడ్డ బీజేపీ నేత రాం కదం చిత్ర బృందంపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్‌కు హెచ్చరికలు ట్విటర్ వేదికగా పంపారు.

రావణాసురుడిని మంచి వాడిగా చూపిస్తున్నారా..
తన్హాజీ లాంటి అత్యుత్తమమైన చిత్రం తీసిన ఓ రౌత్ అందరి ప్రశంసలు పొందారని బీజేపీ నేత రాంకదం చెప్పారు. ఆ చిత్రంలో హిందూ గొప్పతనం వివరించారని గుర్తుచేశారు. అయితే ఆది పురుష్లో లంకాధిపతి రావణాసురుడిని మంచివాడిగా చూపించడం న్యాయం కాదని పేర్కొన్నారు. అంతేకాదు సీతాదేవీని అపహరించడాన్ని సమర్థిస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ పంపారు రాంకదం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పుకొచ్చారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారని తాము భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు బీజేపీ నేత రాంకదం.

క్షమాపణ చెప్పిన సైఫ్ అలీఖాన్
ఇక లంకాధిపతి రావణాసురుడి పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ జరిగిన నష్టాన్ని గమనించి నష్ట నివారణ చర్యలకు దిగారు. వెంటనే ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని తాను తెలుసుకున్నట్లు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల వెనక మరో చెడుద్దేశం ఏమీ లేదని వివరించాడు. రావాణాసురుడు సీతమ్మ ఎపిసోడ్ పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సైఫ్ అలీఖాన్ వెల్లడించాడు. అంతేకాదు ఎవరైన తన వ్యాఖ్యలతో బాధపడి ఉంటే వారందరికీ క్షమాపణ చెబుతున్నట్లు తెలిపాడు. తనకు శ్రీరాముడు ఎప్పటికీ ఒక హీరోనే అని చెప్పుకొచ్చాడు సైఫ్ అలీఖాన్. ఆదిపురుష్ అనే చిత్రం చెడుపై మంచి విజయం సాధించడంతో జరుగుతున్న వేడుక అని వివరణ ఇచ్చారు. ఈ అద్భుతమైన కథలో ఎలాంటి ఒరిజినాలిటీ మిస్ కాకుండా... ఉన్న వాస్తవాలను వక్రీకరించకుండా తీసేందుకు చిత్ర బృందం కష్టపడుతోందని సైఫ్ వెల్లడించారు.
ఇక ఆదిపురుష్ చిత్రం విషయానికొస్తే ఈ చిత్రాన్ని 2022 ఆగష్టు11న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మొత్తానికి ఈ కాలంలో వస్తున్న సినిమాలపై ఎక్కడో ఓ చోట ఏదో ఒక వర్గం వారు అడ్డు చెబుతున్నారు. కొన్ని చోట్ల సినిమా యూనిట్లపై దాడులు కూడా జరుగిన విషయాలను చూశాం. మరి ఆదిపురుష్ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యాక మరెన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటుందో వేచిచూడాలి.