• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో 22.6 శాతం మంది పొగరాయుళ్లే, ప్రకాశం జిల్లాలో అత్యధికం, కడపలో అత్యల్పం

By BBC News తెలుగు
|
పొగ తాగడం

ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్లు దాటిన వారిలో 22.6 శాతం మంది పొగరాయుళ్లేనని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఇక, 15 ఏళ్లు దాటిన మహిళల్లో 3.8 శాతం మందికి ధూమపానం అలవాటు ఉన్నట్లు సర్వే పేర్కొందని 'సాక్షి’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

పురుషుల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 28.2 శాతం మంది పొగ తాగుతుండగా అత్యల్పంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో 18 శాతం మందికి ఈ వ్యసనం ఉంది.

పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పొగతాగుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 15.8 శాతం పురుషులు పొగతాగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో 25.6 శాతం మంది పొగ తాగుతున్నారు. మహిళల్లో 1.9 శాతం మంది పట్టణాల్లో, 4.7 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో పొగ పీలుస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహిళలు ఎక్కువగా పొగ తాగుతున్నట్లు సర్వే పేర్కొంది.

దేశంలో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు తేలింది. మిజోరాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో అత్యధికంగా మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే తెలిపింది.

తెలంగాణలో 22.3 శాతం పురుషులు, 5.6 శాతం మంది మహిళలు పొగతాగుతున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పోల్చితే అత్యధికంగా బిహార్‌లో 48.8 శాతం, గుజరాత్‌లో 41.1 శాతం, మహారాష్ట్రలో 33.8 శాతం మంది పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే పేర్కొందని ఈ కథనంలో తెలిపారు.

కరోనావైరస్

ఇకపై ఆరోగ్యశ్రీలో కోవిడ్

కోవిడ్‌ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఈనాడు పత్రిక తెలిపింది.

ఆయుష్మాన్‌ భారత్‌(ఏబీ) పథకంలో కరోనాకు చికిత్సను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా రాష్ట్రంలో ఏబీని అమలు చేస్తుండటంతో ఇది సాధ్యమైందని వైద్యవర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో ఇకనుంచి 'ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్‌ భారత్‌’ పేరిట ఈ పథకం అమలవుతుంది. కరోనాకు అందించే చికిత్సలను మొత్తంగా 17 రకాలుగా విభజించారు. ఇందులో 'అక్యూట్‌ ఫెబ్రైల్‌ ఇల్‌నెస్‌’, 'పైరెక్సియా ఆఫ్‌ అన్‌నోన్‌ ఆరిజిన్‌’, 'నిమోనియా’ ఉన్నాయి.

వీటితోపాటు మిగిలిన 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలోనే వైద్యం అందిస్తారు. దశలవారీగా ప్రైవేటు దవాఖానాలకు విస్తరించే అవకాశం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ రాకతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య 1,668కి పెరిగింది. అయితే వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 50 పడకలున్న ఆసుపత్రులకు అనుమతి లభిస్తోంది.

ఆయుష్మాన్‌ భారత్‌ చేరికతో ఇకనుంచి 6 పడకలున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. 6 పడకలున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ 'ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్‌ భారత్‌’ను అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాక, దీనిపై నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని 642 చికిత్సలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అతి సాధారణ జ్వరం, మలేరియా, డెంగీ, గన్యా వంటి విష జ్వరాలతో పాటు డయేరియా, అక్యూట్‌ గ్యాస్ట్రో ఎంటరైటిస్‌, వడదెబ్బ, పాముకాటు, కుక్కకాటు, నిమోనియా, సెప్టిక్‌ ఆర్థరైటిస్‌, పిల్లల్లో కారణం తెలియని కడుపునొప్పి, నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో రెటినోపతి జబ్బు వస్తే అందించే లేజర్‌ థెరపీ, హెచ్‌ఐవీ, దాని అనుబంధ సమస్యలు, రక్త మార్పిడి, ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌ వంటి జబ్బులకు ఉచిత చికిత్స లభిస్తుంది. మెంటల్‌ రిటార్డియేషన్‌, న్యూరాలజీ స్ట్రెస్‌ రిలేటెడ్‌ డిజార్డర్స్‌ వంటి మానసిక రుగ్మతలూ దీని పరిధిలోకి వస్తాయి.

ఇక్కడి ప్రజలు అవసరాల రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో అక్కడ అనారోగ్య సమస్య ఎదురైతే.. 'ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్‌ భారత్‌’ కార్డు ద్వారా ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఇతర రాష్ట్రాల వారూ ఇక్కడ చికిత్స చేయించుకోవచ్చు. తమ రోగులకు అయిన వైద్య ఖర్చులను ఆయా రాష్ట్రప్రభుత్వాలు చెల్లిస్తాయి.

ఇకనుంచి ఆరోగ్యశ్రీ పరిధిలో ఆసుపత్రులు అనుసంధానం కావాలంటే జిల్లా స్థాయిలోనే అనుమతులు పొందవచ్చు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి చేరతాయని వైద్యవర్గాలు తెలిపాయని ఈ కథనంలో వివరించారు.

స్కూల్

పంచాయతీరాజ్ టీచర్లకు లోకల్‌ క్యాడర్ గుర్తింపు ప్రక్రియ పూర్తి

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్‌రూల్స్‌ అమలుకు ఉన్న అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్‌ టీచర్లను లోకల్‌ క్యాడర్‌గా గుర్తించే ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని నమస్తే తెలంగాణ ఒక కథనంలో పేర్కొంది.

ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలను జారీచేసింది. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పడినందున రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జీవో 124ను రూపొందించారు.

దీన్ని అనుసరించి అన్నిశాఖల ఉద్యోగులు, క్యాడర్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా శుక్ర, శనివారాల్లోనే విద్యాశాఖకు సంబంధించి రాష్ట్ర సర్కారు 4 జీవోలను జారీచేసింది.

గతంలో ఎంఈవోలు, డైట్‌ లెక్చర్లర్లకు సంబంధించి జీవో -158ను జారీచేయగా.. తాజాగా ప్రభుత్వ, పీఆర్‌ టీచర్ల క్యాడర్‌ను ఖరారుచేస్తూ జీవో నంబర్లు 254, 255, 256ను జారీచేశారు. మండల ప్రజా పరిషత్తు, జిల్లా పరిషత్తు హెచ్‌ఎంలను సైతం ప్రభుత్వ పాఠశాలల్లోని హెచ్‌ఎంలతో సమానంగా మల్టీజోనల్‌ పోస్టుగా గుర్తిస్తూ శనివారమే జీవో 256ను సవరించి 257ను జారీచేసింది. దీంతో ఏకీకృత సర్వీస్‌రూల్స్‌ అమలుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయినట్టేనని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు.

బీపీ మానిటర్

బీపీ రీడింగ్ మారింది..

మానవ శరీరంలో రక్తపోటు(బీపీ) ఎక్కువైనా, తక్కువైనా సమస్యే. బీపీ రీడింగ్‌ 120/80 వస్తే మందులు వాడటం మొదలుపెట్టాల్సిందే. అయితే ఈ విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందని ప్రజాశక్తి తన కథనంలో తెలిపింది.

తల్లిదండ్రుల్లో లేదా వారి కుటుంబ చరిత్రలో ఎవరికైనా గుండె, బీపీ సమస్యలు ఉన్నట్లయితే వారి పిల్లలకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇలాంటివారికి బీపీ రీడింగ్‌లో సిస్టోలిక్‌(పై అంకె) 130 దాటితే మందులు వాడటం మొదలుపెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది.

అంటే బీపీ రీడింగ్‌ 130/90 వస్తే...మందులు వాడటం ప్రారంభించాలని తెలిపింది. కుటుంబ చరిత్రలో ఎవరికీ రిస్క్‌ ఫ్యాక్టర్స్‌, గుండె సమస్యలు లేనట్టయితే..బీపీ రీడింగ్‌ 140/90 దాటితే మందులు వాడటం ప్రారంభించాలని పేర్కొంది. అధిక బీపీతో బాధపడే పెద్దవాళ్లు ఒక ఔషధం కాకుండా, రెండు ఔషధాల సమ్మేళనంతో మందులు తీసుకోవాలని సూచించిందని ఈ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Prakasam district has the highest at 22.6 per cent smokers in AP and Kadapa has the lowest
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X