సిగ్గు సిగ్గు.. డ్యాన్స్ చెయ్యలేని డ్యాన్సర్లు.. మహా హైడ్రామా పై ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్
మహారాష్ట్రలో బలపరీక్షకు వెళ్ళకముందే బిజెపి చతికిలపడింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేసి చేతులెత్తేశారు. ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు తీర్పుతో మహా రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారాయి. అసెంబ్లీలో 27వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.సుప్రీం తీర్పును శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఆ తర్వాత శరవేగంగా చోటు చేసుకున్న మహా రాష్ట్ర రాజకీయ పరిణామాలు బలనిరూపణే చేసుకోలేని మహా ప్రభుత్వాన్ని కూల్చేశాయి.
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే పేరు ఖరారు!: డిప్యూటీ సీఎంల రేసులు వీరే
బిజెపి ఖేల్ ఖతం అని ఈ ఉదయమే వ్యాఖ్యానించిన నేతలు వారు చెప్పినట్లు గానే మారిన మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు వెలువరించిన కొద్ది గంటల్లోనేడిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికీ రాజీనామా చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన సీఎం ఫడ్నవీస్ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజాతీర్పుకు శివసేన వెన్నుపోటు పొడిచిందని ఫడ్నవీస్ విమర్శించారు.
మహారాష్ట్ర రాజకీయంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నడ రాజకీయ నాయకుడు , ప్రముఖ నటుడు ఆయన ప్రకాష్ రాజ్ బలనిరూపణ సందర్భంగా రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో డాన్స్ బేబీ డాన్స్ ఉంటుందని మొదట ట్వీట్ చేశారు. ఇక ఆ తర్వాత అనూహ్యంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయడంతో మరోమారు స్పందించిన ఆయన సిగ్గు సిగ్గు... డాన్స్ చెయ్యలేని డాన్సర్లు ఎట్టకేలకు వైదొలిగారు అంటూ ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో నెలకొన్న హైడ్రామా నేపథ్యంలో అసెంబ్లీకి తలవంపులు తెస్తున్నారంటూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ బీజేపీ నాయకులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.