Pranab Mukherjee Dead:జాతికి తీరని లోటు, నేపాల్ గొప్ప స్నేహితుడిని కోల్పోయింది: ఓలీ
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగిన తర్వాత అతని ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. కరోనా వైరస్ కూడా సోకినట్టు తెలిసిందే. సోమవారం సాయంత్రం ప్రణబ్ ముఖర్జీ చనిపోయారని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రణబ్ దాదా మృతిపై పలువురు సంతాపం తెలిపారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆపరేషన్.. తర్వాత కోమాలోకి..
మెదడులో గడ్డకట్టిన రక్తానికి సంబంధించి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10వ తేదీన శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పటినుంచి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే అతను కరోనా బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. శస్త్రచికిత్స విజయవంతం అయినా.. ప్రణబ్ మాత్రం కోలుకోవడం లేదు. దేశానికి 2012 నుంచి 2017 వరకు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పనిచేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
స్పీకర్ సంతాపం..
ప్రణబ్ మృతిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం వ్యక్తం చేశారు. అతను తెలివిగల నేత అని కొనియాడారు. జీవితంలో వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడూ వేరుగా చూశారని తెలిపారు. మంచి అనుభవం కలిగిన పాలకులు అని కీర్తించారు.
జూన్‌లో కలిసి మాట్లాడాను.. అన్సారీ
ప్రణబ్ మృతి బాధ కలిగించిందని మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్నారీ అన్నారు. అతనితో కలిసి పనిచేశానని గుర్తుచేశారు. ఈ ఏడాది జూన్‌లో కూడా కలిశానని పేర్కొన్నారు. కలిసిన ప్రతీ సందర్భంలో ఏదో చెబుతుండేవారని గుర్తుచేసుకున్నారు.
జాతికి తీరనిలోటు: రాహుల్
ప్రణబ్ మృతి వార్త విషాదానికి గురిచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రణబ్ మృతి జాతికి తీరనిలోటు అని కొనియాడారు. ప్రణబ్ మృతికి సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ.. కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుకున్నారు.

నేపాల్ గొప్ప స్నేహితుడిని కోల్పోయింది: ఓలీ
రాష్ట్రపతిగా పనిచేసిన సమయంలో వివిధ దేశాధినేతలతో ప్రణబ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అందులో ఒకరు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ. ప్రణబ్ చనిపోయారని తెలిసిన వెంటనే.. ఆయన ట్వీట్ చేశారు. ప్రణబ్ మృతితో నేపాల్ ఒక గొప్ప స్నేహితుడిని కోల్పోయిందన్నారు. భారత్-నేపాల్ సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు తాము పాటుపడ్డామని గుర్తుచేశారు.