ప్రణబ్ టూర్, టి బిల్లు లేట్: రాయలపై వెంకయ్యతో చర్చ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మూడ్రోజుల పాటు పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణ బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించినా రాష్ట్రపతి వద్దకు వెళ్లేందుకు, అటు నుండి అసెంబ్లీకి వచ్చేందుకు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రణబ్ బెంగాల్‌కు అధికారిక పర్యటన నిమిత్తం వెళ్తున్నారు. ఆయన ఎనిమిదో తేదిన సాయంత్రం తిరిగి ఢిల్లీకి వస్తారు.
జివోఎం ఈ రోజు(గురువారం) విభజన బిల్లును కేబినెట్ ముందు పెట్టనున్న విషయం తెలిసిందే. దానికి ఇవాళే కేబినెట్ ఆమోదం తెలిపి రాత్రి వరకు రాష్ట్రపతి ఆమోదానికి పంపించాలని భావించారు. ఆ తర్వాత ఈ నెల 7వ తేదీన అసెంబ్లీకి పంపించాలని ఢిల్లీ పెద్దలు భావించారని తెలుస్తోంది.

కానీ, ప్రణబ్ పశ్చిమ బెంగాల్ వెళ్లనున్న నేపథ్యంలో కేబినెట్ ఆమోదం పొందినా ఎనిమిదో తేది వరకు రాష్ట్రపతి ఆమోదం లభించక పోవచ్చునంటున్నారు. ఆ తర్వాతే రాష్ట్రపతి నుండి అసెంబ్లీకి వెళ్తవచ్చునంటున్నారు. అయితే కేబినెట్ ఈ రోజు బిల్లును ఆమోదించి అప్పటికప్పుడు రాష్ట్రపతికి ఆమోదం లభిస్తే అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అంటున్నారు.
రాయల ప్రయత్నాలు
మరోవైపు కాంగ్రెసు పార్టీ రాయల తెలంగాణ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు హాలులో జివోఎం సభ్యులు, కేంద్రమంత్రి జైరామ్ రమేష్ బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడితో రాయల టి అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. కాగా, నార్త్ బ్లాకులో జైరామ్ రమేష్‌తో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ గురువారం సమావేశమైంది. కేబినేట్ ఎజెండాపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, రాయల తెలంగాణపై తర్జనభర్జన కొనసాగుతోంది. తుది నిర్ణయాన్ని కోర్‌కమిటీ సోనియాకే వదిలేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications