ప్రశాంత్ కిషోర్ తాజా సవాల్ .. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి 200 సీట్లు రాకుంటే ఆ పని చేస్తారా ?
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అమిత్ షా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. పశ్చిమ బెంగాల్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి రెండు డిజిట్స్ కూడా దాటదని , అలా దాటితే తాను ట్విట్టర్ ని వదిలేస్తానని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు సీరియస్ కౌంటర్ ఇచ్చారు.
ప్రశాంత్ కిషోర్ కు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్: బెంగాల్ ఎన్నికల తర్వాత జరిగేదదే అంటున్న బీజేపీ

200 సీట్లు రాకుంటే ఆ పార్టీ నేతలు పదవులకు స్వస్తి చెప్తారా ?
రానున్న ఎన్నికలలో బిజెపి రెండు వందల స్థానాలను గెలుచుకుంటుందని, భవిష్యత్తులో ఒక ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి వెళుతుంది అంటూ బీజేపీ నేత విజయ వర్గీయ చేసిన వ్యాఖ్యలకు ప్రశాంత్ కిషోర్ తాజాగా కొత్త సవాల్ విసిరారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 200 సీట్లు గెలుచుకోవడం విఫలమైతే ఆ పార్టీ నేతలు పదవులకు స్వస్తి పలుకుతారా అని ప్రశ్నించారు. ఇక అదే విషయాన్ని ఆన్ రికార్డు చెప్పాలని పొలిటికల్ స్త్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.

పీకే , బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
ప్రస్తుతం మరోమారు తాజాగా బిజెపి పై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ లో దుమారం గా మారాయి. పీకే , బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
2014 ఎన్నికల్లో బిజెపికి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్, ప్రస్తుతం తాజాగా బీజేపీని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ అధినేత్రి మమతా బెనర్జీ కి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్త గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన వ్యూహాలకు పదును పెడుతున్న ప్రశాంత్ కిషోర్, పశ్చిమ బెంగాల్ లో బిజెపికి పరాజయం తప్పదని పదే పదే చెబుతున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్ లో రసవత్తర రాజకీయం
ఇక బీజేపీ నేతలు సైతం పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా జెండా పాతాలని అగ్ర శ్రేణి నాయకులను రంగంలోకి దించి ఇప్పటినుండే తెగ కష్టపడుతున్నారు. టీఎంసీ లో ఉన్న నేతలను ఆపరేషన్ ఆకర్ష్ అంటూ తమ పార్టీలో చేరేలా వ్యూహాలు రచిస్తున్నారు . మరోపక్క మమతా బెనర్జీకి రానున్న ఎన్నికల్లో షాక్ ఇవ్వటం కోసం మరోపక్క ఎంఐఎం పార్టీ కూడా రంగంలోకి దిగింది. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుండి పోటీ చెయ్యటానికి సమాయత్తం అవుతుంది. మమతా బెనర్జీతో ఢీ కొడుతుంది .