టార్గెట్ 400 సీట్లు-ఎక్కడికక్కడ పొత్తులు- కాంగ్రెస్ కుప్రశాంత్ కిషోర్ 2024 భారీ ప్లాన్ -త్వరలో పార్టీలోకి
దేశవ్యాప్తంగా నానాటికీ ప్రభ కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమైన ప్రశాంత్ కిషోర్.. పలు కీలక సూచనలు చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెల్చుకోవాలన్న టార్గెట్ పెట్టారు. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన ఇవాళ సోనియాతో పంచుకున్నారు.

సోనియాతో ప్రశాంత్ కిషోర్ భేటీ
దేశంలో కాంగ్రెస్ పతనావస్ధ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త సేవల్ని తీసుకోవాలని భావిస్తున్న అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ ఆయనతో ఢిల్లీలోని తన నివాసంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలా లేక కేవలం వ్యూహరచనకే పరిమితం కావాలా అన్న మీమాంసతో ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇవాళ సోనియాతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇందులో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. త్వరలో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికలపైనా వీరు చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.

400 ఎంపీ సీట్లు గెలిచే వ్యూహం
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 370 నుంచి 400 సీట్లను లక్ష్యంగా చేసుకోవాలని సోనియాగాంధీతో పాటు పార్టీ కీలక నేత కేసీవేణుగోపాల్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ లక్ష్యం నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని ఎలా అందుకోవాలనే అంశంపై కాంగ్రెస్ పెద్దలకు పీకే ఓ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ చేసిన సూచనల్ని అమలు చేసేందుకు ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసేందుకు సోనియా ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.

ఎక్కడికక్కడ పొత్తులతో
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నా చాలా చోట్ల నాయకత్వ లేమి వేధిస్తోంది. అలాగే చాలా రాష్ట్రాల్లో పార్టీ గతంతోపోలిస్తే బలహీనపడుతోంది. అదే సమయంలో విపక్షాలు పుంజుకుంటున్నాయి. అలాగే ప్రాంతీయపార్టీలు కూడా బలపడుతున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలు తిరిగి బీజేపీతో పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో ముందున్నాయి కూడా. దీంతో ఆయా చోట్ల కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవాలని సోనియాగాంధీకి ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు తెలుస్తోంది.

త్వరలో కాంగ్రెస్ లోకి ప్రశాంత్ కిషోర్
ఇవాళ సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్ తో చర్చల తర్వాత ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపైనా మంతనాలు జరిగాయి. వీటిలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో చేరితే ఆయనకు అప్పగించే బాధ్యతలపై సరైన హామీ లభిస్తే చేరేందుకు ఆయన ఎప్పటినుంచో సిద్ధంగానే ఉన్నారు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ కు పార్టీలో చేరితే ఇచ్చే బాధ్యతలపై సోనియాగాంధీ క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది దీంతో ఆయన త్వరలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.