• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రశాంత్ కిశోర్: జనాన్ని మెప్పించి ఎన్నికల్లో గెలవడం ఎలా?

By BBC News తెలుగు
|
తొమ్మిది ఎన్నికలకు పని చేసి ఎనిమిందింట్లో విజయాలు అందించారు ప్రశాంత్‌ కిశోర్‌

ప్రశాంత్‌ కిశోర్‌ సాదాసీదా పొలిటికల్‌ కన్సల్టెంట్‌ కాదు. టీవీల్లో వార్తలను చూడనని, పేపర్లు చదవనని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ మెయిల్‌ చేయడం, నోట్స్‌ తీసుకోవడం కూడా చేయరట.

ఓ దశాబ్దకాలంగా ల్యాప్‌టాప్‌ ఉపయోగించలేదనీ, తాను వాడుతున్న ఒకే ఒక పరికరం ఫోన్‌ అని ప్రశాంత్‌ కిశోర్‌ నాతో చెప్పారు. మూడేళ్లలో ఆయన 86 ట్వీట్లు చేశారు. ట్విటర్‌లో ఆయనకు 5 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.

"నేను పనిని, జీవితాన్ని సమతుల్యంగా ఉంచాలి అనే సిద్ధాంతాన్ని నమ్మినవాడిని కాదు. నా పనికి సంబంధంలేని అంశాలపై పెద్దగా ఆసక్తి చూపను" అంటారు ప్రశాంత్‌ కిశోర్‌.

భారతదేశ ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త అయినా, ప్రశాంత్‌ కిశోర్‌ తన గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను మేనేజ్‌ చేసే వ్యక్తిగా, తన వ్యూహాలతో ప్రజలను ప్రభావితం చేసి, ఎన్నికల్లో గెలిపించే నైపుణ్యం ఉన్నవాడిగా ఆయన పేరు సంపాదించారు.

ప్రశాంత్‌ కిశోర్‌, ఆయన పొలిటికల్‌ కన్సల్టెన్సీ సంస్థ 2011 నుంచి తొమ్మిది ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు అందించగా, ఎనిమిదింట విజయాన్ని అందుకున్నారు.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు డిస్నీ, నెట్​ఫ్లిక్స్ నుంచి బాలీవుడ్​ హీరో షారుఖ్ ఖాన్​ వరకు మీ బయోపిక్​ తీస్తామంటూ ప్రశాంత్‌ కిశోర్‌‌కి ఆఫర్లు వచ్చాయి. కానీ, వాటన్నింటినీ ఆయన​ సున్నితంగా తిరస్కరించారు.

వివిధ రాజకీయ పక్షాల నేతలకు ప్రశాంత్‌ కిశోర్‌ సలహాలిచ్చారు. 2014లో బీజేపీ గెలుపు నుంచి, గత మే నెలలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​ పశ్చిమ బెంగాల్​లో వరుసగా మూడోసారి విజయఢంకా మోగించడం వెనక కిశోర్​ వ్యూహాలున్నాయి.

ప్రశాంత్‌ కిశోర్‌​ పట్టిందల్లా బంగారమే అని ఆయన అనుచరులు చెబుతుంటారు. ఇక ఆయన విమర్శకులు మాత్రం బంగారంలా కనిపించిన దాన్నే ఆయన పట్టుకుంటారని వ్యాఖ్యానిస్తుంటారు.

44 ఏళ్ల ప్రశాంత్‌ కిశోర్‌​ తాను చేస్తున్న పనిలో చేయాల్సిందంతా చేసేశానని భావిస్తున్నట్లు చెప్పారు. 'ఇక ఈ పనిని వదిలేస్తున్నాను. నేను వేరే పని ఏదైనా చేయాలని అనుకుంటున్నాను' అని పేర్కొన్నారు.

కానీ ఇటీవల ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు. కాంగ్రెస్​ పార్టీ నాయకుడు రాహుల్​ గాంధీ సహా, ప్రతిపక్షాలకు చెందిన ఇతర ముఖ్య నేతలను ఆయన కలుసుకున్నారు.

దాంతో ఆయన భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమికి రాజకీయ వ్యూహకర్తగా మారతారని లేదా కాంగ్రెస్​ పార్టీలో చేరబోతున్నారని వార్తలొచ్చాయి.

అయితే ఇవన్నీ ఊహాగానాలేనని ప్రశాంత్​ కిషోర్ కొట్టిపారేశారు.

"నేను గతంలో చేసిన పనిని మళ్లీ చేయబోవడం లేదు. నాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేనింకా నిర్ణయం తీసుకోలేదు. రాజకీయాలతో అసలు సంబంధం లేని విషయాన్ని నేను ఎంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను నిర్ణయం తీసుకున్న వెంటనే అందరితో ఈ విషయాన్ని పంచుకుంటాను" అని తెలియజేశారు.

'బీజేపీ కనిపించేంత బలమైంది కాదు'

దేశంలో జనరల్‌ ఎలక్షన్లు మరో మూడేళ్లలో జరగనుండగా, నరేంద్ర మోదీ నేతృత్వంలోని అధికార ప్రభుత్వానికి సవాలు విసిరేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

"బీజేపీ బయటకు కనిపిస్తున్నట్లు అతి శక్తిమంతమైన రాజకీయ పార్టీయేమీ కాదు. పాత, కొత్త అనే భేదం లేకుండా ఎల్లప్పుడూ మరో రాజకీయ పార్టీకి లేదా పార్టీల కూటమికి అధికార పార్టీని ఛాలెంజ్​ చేసే అవకాశం ఉంటుంది" అని అన్నారు ప్రశాంత్‌ కిశోర్‌.

1980ల మధ్య కాలం నుంచీ కాంగ్రెస్​ పార్టీ దేశంలో తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 20 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 52 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని, వరుసగా రెండో అపజయాన్ని మూటగట్టుకుంది. కానీ, ఆ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు ఇంకా పార్లమెంటులో ఉన్నారు. 880 మంది ఎంఎల్​ఏలూ ఉన్నారు. బీజేపీని ఎదుర్కోగల అతి పెద్ద పార్టీగా మిగిలింది కాంగ్రెస్‌ పార్టీనే.

"ఇది కాంగ్రెస్​ తప్పిదం అని చెప్పడానికి నేనెవరిని. ఆ పార్టీ సమస్యలు గత దశాబ్దంలో వారు సాధించిన ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తున్న దాని కన్నా లోతైనవి అని మాత్రం చెప్పగలను. అవి నిర్మాణాత్మకమైనవి. కొత్త ఫెడరల్​ పార్టీ గురించి మాట్లాడుకోవడం సులువే. కానీ స్థాపించడమే కష్టం. మూడో ప్రతిపక్ష కూటమి ఏర్పాటు సాధ్యపడదు. ఎందుకంటే ఇప్పటికే కూటములను ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు' అని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు.

2024 ఎన్నికల్లో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీని ఓడించడం అసాధ్యమేమీ కాదని కిషోర్ అభిప్రాయపడ్డారు.

"సరైన వ్యూహం, శ్రమతో వారిని ఓడించవచ్చు అనడానికి ఉదాహరణలు ఉన్నాయి. దేశంలో గెలిచే రాజకీయ పార్టీలన్నీ.. ఎంత పాపులారిటీ ఉన్నా కేవలం 40 నుంచి 45 శాతం మించి ఓట్లను గెలుచుకోలేవు. 2019లో బీజేపీకి పోలైన ఓట్ల శాతం 38 మాత్రమే. వాటితోనే ఆ పార్టీ 300లకు పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది" అని ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు.

ఏడు ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో ఉన్న 200 ఎంపీ స్థానాల్లో అయిదో వంతును కూడా బీజేపీ దక్కించుకోలేక పోయిందని కిశోర్ గుర్తు చేశారు. ఈ ప్రాంతాలలోని స్థానిక పార్టీలు బీజేపీని సమర్ధవంతంగా అడ్డుకున్నాయని అన్నారు.

ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 340 ఎంపీ స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ 150 సీట్లను సాధించగలిగితే, ఆ పార్టీకి వచ్చే మార్జిన్​ తగ్గుతుందని కిశోర్ అంచనా వేస్తున్నారు.

ఇండియా లాంటి దేశంలో పొలిటికల్‌ కన్సల్టెన్సీ సంస్థ ఎలా పని చేయాలో ప్రశాంత్ కిశోర్​ పని తనాన్ని చూస్తే అర్థమవుతుంది.

ఆయన సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపీఏసీ)కి చెందిన నాలుగు వేల మంది ప్రచార కార్యక్రమాల్లో పని చేస్తుంటారు. వారందరూ తాము ఎంపిక చేసుకున్న రాజకీయ పార్టీతో కలిసి పని చేస్తారు.

సిద్ధాంతాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాల కోసం ప్రశాంత్‌ కిశోర్‌ సంస్థ పని చేసింది.

ఎన్నికల్లో గెలిపించడం ఎలా?

"ఎన్నికలలో బాగా రాణించటానికి, పార్టీకి అవసరమైన కార్యక్రమాలను చేయటానికి మేము వారికి అదనపు సహాయ సహకారాలను అందిస్తాము" అన్నారు కిశోర్‌."మా తోడ్పాటు వారికి ఉపయోగపడుతుంది, కానీ మా సహకారం ఎంత వరకు మార్పు తేగలదు అనేది ఖచ్చితంగా చెప్పలేము" అంటారాయన.

ఒక దశాబ్ద కాలంలో భారత ఎన్నికల రాజకీయాల్లో ప్రశాంత్‌ కిశోర్‌ గమనించిన అంశాలు:

  • ప్రచార కార్యక్రమాల్లో కనిపించే భారీ జనసందోహం, ఎన్నికల ఫలితాల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు.
  • ధనప్రభావం కారణంగా రాజకీయాలలో ప్రవేశించడం చాలా ఖరీదైన వ్యవహారం.
  • నేటి సమాజ ఆలోచనా విధానాలను సమకాలీన రాజకీయాలు ప్రతిబింబించడం లేదు.
మమతా బెనర్జీ పార్టీ విజయానికి క్రెడిట్‌ ప్రశాంత్‌ కిశోర్‌దేనని చాలామంది నమ్ముతారు

80 కోట్లకు పైగా భారతీయుల ఓటింగ్ సరళి చెప్పేదేమిటి ?

సంక్షేమ పథకాల పంపిణీ, గుర్తింపు, సాధికారత, అందుబాటులో ఉండటంతోపాటూ ఇతర అనేక విషయాల్లో ఏవి ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయో చెప్పలేనని కిశోర్‌ పేర్కొన్నారు.

"ఓటర్లు ఎలా ఆలోచిస్తున్నారో ఊహించలేము. ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకోవడానికి వ్యవస్థను అభివృద్ధి చేస్తాను. ప్రజల నుంచి ఎప్పటికప్పుడు అందే అభిప్రాయాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి" అని ఆయన అన్నారు.2015లో ప్రశాంత్‌ కిశోర్‌ స్వస్థలం, అత్యంత పేద రాష్ట్రమైన బిహార్‌లోని 40వేల గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను కనుక్కోవడానికి ఆయన బృందం పర్యటించింది.

అక్కడ వారు గుర్తించిన వాటిలో అతి ముఖ్యమైన సమస్య మురుగునీటి పారుదల అని కిశోర్‌ అన్నారు. పోలీసు ఫిర్యాదుల్లో అయిదవ వంతు మురుగు నీటి పారుదలకు సంబంధించినవే అని తేలింది. గత సంవత్సరం బెంగాల్‌లో ప్రజల ఫిర్యాదులను నమోదు చేయడానికి హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయడంలో ప్రశాంత్‌ కిశోర్ ముఖ్యపాత్ర పోషించారు.

70 లక్షల మంది ఈ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేశారు. దీనిలో అత్యధికులు కుల ధృవీకరణ పత్రాలు ఆలస్యంగా అందడం, అవినీతిలాంటి ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 26 లక్షల ఫిర్యాదులను ఆరు వారాల్లోనే పరిష్కరించింది.ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్‌ అయినా, తాను రాజకీయాలకు సరిపోనని ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు.

"నాకు రాజకీయాలు అంతగా అర్థం కావు. కామన్‌సెన్స్‌, ఇతరులు చెప్పేది జాగ్రత్తగా వినడం నా బలం. తీవ్ర ఒత్తిడిలో పని చేయడాన్ని ఇష్ట పడతాను" అని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Prashant Kishore: How to impress the people and win the elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X