రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు... ప్రధాని మోదీ, వెంకయ్యలతో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పుట్టినరోజు ఈరోజు. ఆయన 75 వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన నరేంద్ర మోడీ రామ్ నాథ్ కోవింద్ తెలివితేటలు, ఆయన విధానాలను అర్థం చేసుకునే తీరు అమోఘం అంటూ ప్రశంసించారు. అవి దేశానికి గొప్ప ఆస్తులుగా ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. సేవ చేయడంలో ఆయన ముందుంటారని ఆయన ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను అని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి పుట్టినరోజు సందర్భంగా తన విషెస్ ను తెలియజేశారు.
భారత ప్రధాని మోడీని ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ... రీజన్ ఇదే !!

రాష్ట్రపతి సింప్లిసిటీ , సునిశిత దృష్టి అమోఘం: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ప్రస్తుతం కరోనావైరస్ తో బాధపడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాష్ట్రపతి కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు."ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన సంప్లిసిటీ, సునిశిత దృష్టి, ఆదర్శప్రాయమైన నాయకత్వం మరియు పేదల పట్ల ఉన్న శ్రద్ధపై అనిర్వచనీయం అన్నారు . ఆయన మంచి ఆరోగ్యం మరియు సుదీర్ఘ జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాఅని ఆయన అధికారిక ఖాతా నుండి ట్వీట్ చేశారు.

దేశ సేవలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ..తెలుగురాష్ట్రాల గవర్నర్ల శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతి జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్లు కూడా రాష్ట్రపతి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తునట్లుగా పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా తన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో భారతదేశ సేవలో కొనసాగాలని ఆశిస్తున్నాను అని తమిళిసై సౌందరరాజన్ ఈమేరకు ట్వీట్ చేశారు. మీ మార్గనిర్దేశనంలో భారత దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు తమిళిసై సౌందరరాజన్.

శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
భారత రాష్ట్రపతి గౌరవ రామ్ నాథ్ కోవింద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా . ఆయన సింప్లిసిటీ, నిరంతర కృషి , అనునిత్యం అందరిని కలుపుకునే స్వభావం చాలా ఉత్తేజాన్నిచ్చేవని ఆయన కొనియాడారు. భగవంతుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మంచి ఆరోగ్యాన్ని మరియు దేశ సేవలో సుదీర్ఘ జీవితాన్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు.

1945లో యూపీలో పుట్టిన రాం నాథ్ కోవింద్
న్యాయవాది నుండి రాజకీయ నాయకుడుగా మారిన రామ్ నాథ్ కోవింద్ అక్టోబర్ 1, 1945 న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లాలోని పరాంఖ్ గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారు. న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత, కోవింద్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ లో న్యాయవాదిగా చేరాడు, అక్కడఆయన 1977 నుండి 1979 వరకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాడు. ఆ కాలంలో ఆయన ప్రధాన మంత్రి మొరాజీ దేదేసాయికి వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేశాడు. ఆయన 1978 లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులయ్యారు. 1980 నుండి 1993 వరకు కేంద్ర ప్రభుత్వానికి స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశాడు.

రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి స్థాయిలో
ఆయన రాజకీయ జీవితం 1991 లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యునిగా ప్రారంభమైంది. ఆయన బీజేపీ జాతీయ ప్రతినిధిగా కూడా పనిచేశారు.కోవింద్ 1994 నుండి 2000 మరియు 2000 నుండి 2006 వరకు రెండు సార్లు ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు, అక్కడ ఆయన షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమం , గృహ వ్యవహారాలు, పెట్రోలియం మరియు సహజ వాయువు, సామాజిక న్యాయం మరియు సాధికారత లా అండ్ జస్టిస్ కోసం పార్లమెంటరీ కమిటీలో పనిచేశారు. జూన్ 19, 2017 న అప్పటి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా భారత రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్‌ను నామినేట్ చేశారు. జూలై 14, 2017 న భారత 14 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.