rahul gandhi narendra modi rafale rafale deal delhi congress bjp రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ రాఫెల్ రాఫెల్ డీల్ ఢిల్లీ కాంగ్రెస్ బీజేపీ
రక్షణ శాఖ కంటే ముందే అనిల్ అంబానీకి సమాచారం: రాఫెల్‌పై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఒప్పందం గురించి రక్షణ శాఖ కంటె ముందే అనిల్ అంబానీకి తెలుసునని ఆరోపించారు. ఇటీవల హిందూ పత్రిక రాఫెల్ ఒప్పందంపై సంచలన కథనాన్ని ప్రచురించింది. తాజాగా, మరో పత్రిక మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తూ రాసింది. రాఫెల్ ఒప్పందానికి ముందు అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణ మంత్రిని కలిసినట్లు తాజాగా మీడియా కథనం వచ్చింది.
ఈ కథనాన్ని ఉదహరిస్తూ రాహుల్ గాంధీ ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ డీల్ విషయంలో అనిల్ అంబానీ కోసం మోడీ మధ్యవర్తిగా మారారని ఆరోపించారు. దేశ భద్రతను ప్రధానమంత్రి పణంగా పెడుతున్నారన్నారు. రాఫెల్ ఒప్పందంపై ప్రధాని మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అనిల్ అంబానీ ఏ హోదాలో అక్కడకు వెళ్లారో చెప్పాలని నిలదీశారు. ప్రధాని మోడీ.. అనిల్ అంబానీకి మధ్యవర్తిగా వ్యవహరించారన్నారు. దేశ రక్షణ వ్యవహారాల్లో రహస్యంగా ఉంచాల్సిన అంశాలను రాజీపడి ఇతరులకు చేరవేశారని ఆరోపించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. రాఫెల్ ఒప్పందం గురించి రక్షణ శాఖ, హెచ్ఏఎల్ లిమిటెడ్, విదేశాంగ కార్యదర్శికి తెలియకముందే అనిల్ అంబానీకి సమాచారం చేరిందన్నారు.
ఈ సందర్భంగా రాఫెల్ ఒప్పందంపై కాగ్ ఆడిట్ నివేదికపై కూడా రాహుల్ విమర్శలు కురిపించారు. కాగ్ నివేదికకు ఎలాంటి విలువ లేదని, అది చౌకీదార్ ఆడిట్ జనరల్ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. జాతీయ భద్రత విషయంలో ప్రధాని మోడీ రాజీ పడ్డారని ఆరోపించారు.