అర్థరాత్రి అంత్యక్రియలు: యోగి రాజీనామా చేయ్, ప్రియాంక డిమాండ్.. సిట్, ఫాస్ట్రాక్ కోర్టు..
యూపీ దళిత మహిళ అంత్యక్రియలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. తెల్లవారుజామున 2.45 గంటలకు పోలీసులు బలవంతంగా అంత్యక్రియలను నిర్వహించారు. కుటుంబసభ్యులు వద్దు అని, హిందూ సాంప్రదాయం ప్రకారం రాత్రి నిర్వహించొద్దు అని నెత్తి, నోరు మొత్తుకున్నారు. కానీ పోలీసులు మాత్రం వినిపించుకోలేదు. ఖాకీల వైఖరిని మృతురాలి బంధువులు ఖండించారు. వీరికి ప్రతిపక్ష నేతలు, ఇతరులు మద్దతు తెలియజేస్తున్నారు.
భగ్గుమన్న ప్రియాంక..
లైంగికదాడి ఘటనపై యూపీ కాంగ్రెస్ ఇంచార్జీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీరుపూ విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి అంత్యక్రియలు చేశారని తెలిసి.. ఇదీ మీ ప్రభుత్వ పనితీరు అని ధ్వజమెత్తారు. జరిగిన ఘటనకు సీఎం ఆదిత్యనాథ్ నైతిక బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. ఇందుకు యోగి.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమో కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుంది.. కానీ చర్యలు మాత్రం అలా ఉండటం లేదు.. అందుకే నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అని ధ్వజమెత్తారు.
యోగి సర్కార్ దిద్దుబాటు చర్యలు..
హత్రాస్ ఘటనపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో యోగి సర్కార్ స్పందించింది. యువతిపై లైంగికదాడి ఘటనపై ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. అంతేకాదు వారంలో నివేదిక సమర్పించాలని గడువు విధించింది. ఆ తర్వాత విచారణ కోసం ఫాస్ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. దీంతో వేగంగా విచారణ జరిగి.. నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంది.
పోలీసుల తీరుపై గుర్రు
పోలీసుల తీరుపై మృతురాలి కుటుంబసభ్యులు గుర్రుమీదున్నారు. కడసారి చూపు కూడా చూడనీయలేదని చెబుతున్నారు. రాత్రి అంత్యక్రియలు నిర్వహించడం సరికాదు అని.. ఉదయం చేసేందుకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. మృతురాలి సోదరుడు, తల్లిదండ్రులు మండిపడ్డారు. అంతేకాదు మృతదేహం నుంచి దుర్వాసన వస్తోందని చెప్పి మరీ బలవంతంగా అంత్యక్రియలు చేయించారని మండిపడ్డారు.