వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైసామే పరమాత్మ హై: ప్రచారంలో హిందుత్వకు అందలం.. వ్యతిరేకులపై దుష్ప్రచారం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెయిడ్‌న్యూస్ పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ప్రధాన స్రవంతి మీడియా వ్యవహారాన్ని ప్రఖ్యాత పరిశోధనాత్మక కథనాల సంస్థ కోబ్రాపోస్ట్ తన 'ఆపరేషన్ 136' ద్వారా బయటపెట్టింది. డబ్బులు ఇస్తేచాలు ఎలాంటి కథనాల ప్రచారానికైనా తాము సిద్ధమేనని బడా మీడియా సంస్థల ప్రతినిధులు చెప్తున్న తీరును వీడియోలతో సహా కోబ్రాపోస్ట్ వెలుగులోకి తెచ్చింది.
హిందూత్వ అనుకూల భావజాలాన్ని ప్రత్యేక కథనాల ద్వారా ప్రజల్లోకి చొప్పించి తద్వారా మతపరమైన ఓట్లచీలికకు ప్రయత్నించడానికీ 17 మీడియా సంస్థలు సిద్ధపడటం గమనార్హం. డీఎన్‌ఏ, దైనిక్ జాగరణ్, అమర్ ఉజాలా, ఇండియా టీవీ, స్కూప్‌వూప్ వంటి దేశంలోనే పేరెన్నికగన్న పలు మీడియా సంస్థలు కూడా ఈ ఆపరేషన్‌లో చిక్కాయి.

మీడియా చేస్తున్నదంతా కేవలం డబ్బు కోసమేనని వెల్లడి

మీడియా చేస్తున్నదంతా కేవలం డబ్బు కోసమేనని వెల్లడి

హిందూత్వ ప్రచారానికి సహకరించి 2019 ఎన్నికల్లో ఓట్లు పడేలా చేయడానికి తగినట్లు ప్యాకేజీలు మాట్లాడుకున్న వ్యవహారాలు ఆడియో, వీడియో సాక్షిగా వెలుగులోకి వచ్చాయి. బీజేపీ ప్రయోజనాల కోసం మీడియా సంస్థలు ప్యాకేజీలకు సిద్ధపడడం ఈ ఆపరేషన్లలో స్పష్టంగా వెల్లడైంది. హిందూత్వ ఎజెండాను తమ చేతుల్లోకి తీసుకోవడం ద్వారా మీడియా సంస్థలు క్లయింట్ల రెండు లక్ష్యాలను నెరవేరుస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మతపరమైన ఓట్ల విభజనకు ప్రయత్నించడం, విషప్రచారానికి దిగడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై బురదచల్లడం కీలకమైన అంశాలు. మీడియా ఇదంతా చేస్తున్నది కేవలం డబ్బు కోసమే అని కోబ్రాపోస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోని సమాచారాన్ని విశ్లేషించి తప్పుడు కథనాలు సృష్టించి ఓటర్లను పాలకపక్షాలు ఏవిధంగా ప్రభావితం చేస్తున్నారో కేంబ్రిడ్జ్ ఎనలిటికా ద్వారా బహిర్గతమైన నేపథ్యంలో కోబ్రాపోస్ట్ కథనం కలకలం రేపుతున్నది. పెయిడ్‌న్యూస్ అనేది నైతిక నియమాల ఉల్లంఘనే కాక, ఎన్నికల సమయాల్లో అది నేరం కూడా. ప్రజాప్రాతినిధ్య చట్టం - 1951, ఎన్నికల నిబంధనావళి-1961, పరిశ్రమలచట్టం-1956, ఆదాయ పన్ను చట్టం - 1961, వినియోగదారుల హక్కుల చట్టం-1986, కేబుల్ టీవీ చట్టం-1994కింద ఇది శిక్షార్హమైన చర్యే కాకుండా, ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు, నియమావళికి విరుద్ధం.

పత్రికా స్వేచ్ఛలో భారత్ చాలా పూర్

పత్రికా స్వేచ్ఛలో భారత్ చాలా పూర్

ఈ పరిశోధనకు కోబ్రాపోస్ట్ ఆపరేషన్ 136 అని నామకరణం చేసింది. పత్రికాస్వేచ్ఛకు సంబంధించిన సూచికలో భారతదేశం ప్రపంచంలో 136వ స్థానంలో ఉన్న కారణంగా ఈ పేరును పెట్టినట్లు తెలుస్తున్నది. కోబ్రాపోస్ట్ ప్రతినిధి పుష్పశర్మ ఈ ఆపరేషన్ 136ను చేపట్టారు. తన పేరును ఆచార్య అటల్‌గా మార్చుకొని దాదాపు ఏడునెలల పాటు వివిధ మీడియా సంస్థల ఎగ్జిక్యూటివ్‌లతోనూ, విలేకరులతోనూ సమావేశమై ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు. తనను తాను కొన్నిచోట్ల భగవద్గీత ప్రచార సమితికి చెందినవాడినని, మరికొన్నిచోట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు చెందిన సంఘటన్ సంస్థ ప్రతినిధిగా పరిచయం చేసుకుని ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. హిందూత్వ భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించి.. హిందూ, ముస్లిం ఓట్ల చీలికకు ప్రయత్నించడం ద్వారా నిర్దిష్ట పార్టీలకు ఎన్నికల్లో ప్రయోజనాలు కల్పించాలన్న కోబ్రాపోస్ట్ ప్రతినిధి ఆఫర్‌కు మీడియా సంస్థలు సిద్ధమవడం గమనార్హం. మొదటివిడుతలో విడుదల చేసిన స్టింగ్ ఆపరేషన్ కథనాల్లో 17 మీడియా సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు హిందూత్వ కవరేజీకి అంగీకరించారు. అయితే చెల్లింపులు మాత్రం నగదురూపంలోనే ఉండాలని షరతు విధించారు.

డబ్బు కూడా ముందే చెల్లించాలని సూచనలు

డబ్బు కూడా ముందే చెల్లించాలని సూచనలు

ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న రజత్‌శర్మ ఎడిటర్‌గా ఉన్న ఇండియా టీవీ, దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్థానిక చానళ్లు హిందీ కబర్, సమాచార్ ప్లస్, లక్నోలో ప్రజాదరణ కలిగిన న్యూస్ చానెల్ సాద్నా ప్రైమ్‌న్యూస్ ఉత్తరాఖండ్‌కు చెందిన హెచ్‌ఎన్‌ఎన్ 24x7, వార్తా వినోదచానళ్ల గ్రూప్ ఎస్‌ఏబీ, ఆదే గ్రూపునకు చెందిన పంజాబీ మ్యూజిక్ చానల్ 9x తషన్, జీ గ్రూప్‌నకు చెందిన ఆంగ్ల దినపత్రిక డీఎన్‌ఏ, దైనిక్ భాస్కర్, అమర్ ఉజాలా, న్యూస్‌ఏజెన్సీ యుఎస్‌ఐ, హిందీ వార్తాపత్రికలు పంజాబ్ కేసరి, స్వతంత్ర భారత్, ఆజ్, వెబ్‌పోర్టల్స్ స్కూప్‌వూప్, రెడీఫ్ డాట్‌కామ్, ఇండియావాచ్ సంస్థలు కోబ్రోపోస్ట్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయాయి. కోబ్రాపోస్ట్ ప్రతినిధితో బేరసారాలు నడిపినవారిలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లో పనిచేసి ప్రస్తుతం 9ఎక్స్ తషన్‌లో పనిచేస్తున్న ప్రదీప్ గుహా వంటి ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉన్నారు. ప్రదీప్ గుహా మాట్లాడుతూ ఒప్పందం కుదిరిన మేరకు ముందే డబ్బు చెల్లించేస్తే తర్వాత ఎటువంటి సమస్యలు తలెత్తవని పేర్కొనడం గమనార్హం.

బీజేపీ మిత్రపక్ష నేతలను బద్నాం చేయడానికి సిద్దం

బీజేపీ మిత్రపక్ష నేతలను బద్నాం చేయడానికి సిద్దం

డబ్బు ముట్టచెబితే ఏ సమాచారమైనా ప్రచారానికి, ప్రసారానికి మీడియాలోని ఒక సెక్షన్ సిద్ధ పడిందని కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ నిగ్గు తేల్చింది. హిందుత్వ సిద్ధాంతాలకు అనుకూలంగా ప్రచారం చేయడంతోపాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, మనోజ్ సిన్హా, జయంత్ సిన్హా, మేనకాగాంధీ, ఆమె తనయుడు వరుణ్ గాంధీలకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించి, ప్రసారాలు చేయడానికి కూడా సదరు మీడియా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న భాగస్వామ్య పక్షాలను దారిలోకి తెచ్చుకునేందుకు వాటిపైనా దుష్ప్రచారం చేయడానికి వెనుకాడబోవని పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ మిత్ర పక్షాల నాయకులు అనుప్రియా పటేల్, ఓం ప్రకాశ్ రాజ్ భర్, ఉపేంద్ర కుశ్వాహా వంటి నేతలకు వ్యతిరేకంగా వార్తా కథనాలు ప్రచురించి, ప్రసారం చేయడానికి సదరు జర్నలిస్టులు సిద్దంగా ఉన్నారు. ఈ ప్రచారోద్యమంలో తొలుత ట్రయల్ రన్ గా కొంతకాలం వార్తలను ప్రచురించడం గానీ, ప్రసారం చేయడం గానీ చేస్తారు. తర్వాత కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ముడుపులు స్వీకరించి కావాల్సిన రీతిలో ప్రచారానికి వెనుకాడబోరంటే అతి శయోక్తి కాదు.

హిందువును కనుక హిందుత్వ ప్రచారంతో హాయి అని వ్యాఖ్యలు

హిందువును కనుక హిందుత్వ ప్రచారంతో హాయి అని వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వంటి ప్రముఖ నేతల వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేసేందుకు కూడా సదరు మీడియా సంస్థలు వెనుకాడబోవు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో రకరకాల అవతరాలు ఎత్తిన పుష్పా శర్మతో సంబంధిత మీడియా సంస్థల ప్రతినిధులు తమకు రావాల్సిన మనీ డెలివరీ కోసం ధ్రువీకరించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. తొలి దశలో మూడు నెలల పాటు ట్రయల్ రన్.. తర్వాత చెల్లించే మనీని బట్టి రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్ల మేరకు ముడుపులు తీసుకుని వారి ఎజెండా ప్రకారం ప్రజలపై వార్తలు వదులుతారన్న మాట. తద్వారా 2019 ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపించేందుకు శాయశక్తులా సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది.

న్యూస్ బ్రాడ్

న్యూస్ బ్రాడ్

ఏపిసోడ్‌లో న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు.. ఇండియా టీవీ అధినేత రజత్ శర్మ బీజేపీ నేతలకు, ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు కావడం ఆసక్తి కర పరిణామం. కోబ్రాపోస్ట్ ప్రతినిధితో ఇండియా వాచ్ అధినేత ఈశ్వరి ద్వివేది మాట్లాడుతూ తనకు హిందుత్వ ఏజెండా అనుకూలమని, తాను హిందుని కనుక సౌకర్యంగా, సహజంగానే హిందుత్వ ఎజెండా ప్రచారం హాయిగా ఉంటుందని కుండబద్దలు కొట్టారు. డీఎన్ఏ వార్తాపత్రి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు స్పందిస్తూ శర్మ ఎజెండాతో సమస్యే లేదన్నారు. హిందుత్వ పట్ల మెతక వైఖరిని ప్రోత్సహించడం, ఫైర్ బ్రాండ్ హిందుత్వ నాయకులు వినయ్ కతియార్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి వారి ప్రసంగాలకు ప్రోత్సాహానికి ముందున్నారు.

జీ హిందుస్థాన్ చానెల్ పై న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అథారిటీకి ఆర్జేడీ ఫిర్యాదు

జీ హిందుస్థాన్ చానెల్ పై న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అథారిటీకి ఆర్జేడీ ఫిర్యాదు

ఇటీవల బీహార్‌లోని అరారియా లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా బహిరంగంగా మతతత్వ, రెచ్చగొట్టే రీతిలో వార్తలను బీహార్ రాష్ట్రంలోని జీ హిందుస్థాన్ న్యూస్ చానల్ ప్రసారం చేసింది. ఆర్జేడీ కార్యకర్తలు, మద్దతుదారులు ‘భారత్ వ్యతిరేక నినాదాలు' చేస్తున్నారని రూపొందించిన నకిలీ వీడియోను ప్రచారం చేసిందీ జీ హిందుస్థాన్ చానెల్. కానీ ఈ ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి పాలైంది. అసత్య ప్రచారం చేసినందుకు న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అథారిటీకి ఈ నెల 16న ఆర్జేడీ నాయకత్వం ఫిర్యాదు చేసింది. ఇదే చానెల్ 2016లో గౌహర్ రాజా అనే కవిపై దుష్ప్రచారం చేసి తర్వాత క్షమాపన చెప్పింది. ఈ వార్త ప్రసారం చేసినందుకు కేవలం రూ. లక్ష ముడుపులు స్వీకరించింది. కోబ్రా పోస్ట్ అధ్యయనంలో తేలిందేమిటంటే హిందుత్వ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వారు నైతిక విలువలను పట్టించుకోవడం లేదని అర్థమైంది.

2014 ఎన్నికల్లో రూ.8000 కోట్లు ఖర్చు చేసిన సంఘ్

2014 ఎన్నికల్లో రూ.8000 కోట్లు ఖర్చు చేసిన సంఘ్

మే నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆరెస్సెస్ కు చెందిన సంఘటన్ రూ.742 కోట్లు సిద్దం చేసిందని, గత సార్వత్రిక ఎన్నికల్లో రూ.8000 కోట్లు ఖర్చు చేసిందని దీని ప్రకారం వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరింత ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉన్నదని పుష్పా శర్మ తనతో మాట్లాడిన మీడియా సంస్థల ప్రతినిధులతో ప్రతి మీడియా సంస్థకు రూ.6 కోట్ల నుంచి రూ.50 కోట్లు చెల్లించడానికి సిద్ధమని సంకేతాలిచ్చారు. కోబ్రాపోస్టు స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టడంతో దైనిక్ జాగరణ్ అధినేత సంజయ్ గుప్తా మాట్లాడుతూ తామెటువంటి తప్పిదం చేయలేదన్నారు. అసలు సదరు కోబ్రాపోస్ట్ వీడియోకు విశ్వసనీయత ఉన్నదా? అని ప్రశ్నించారు. టేపుల్లో తన సంస్థ ప్రతినిధి గొంతు వినిపించినా అది తన పరిధిలోకి రాదని దాట వేశారు. అటువంటి చర్యలకు దిగాల్సిన అవసరమే లేదన్నారు. ఒకవేళ వీడియోలో రికార్డు చేసిన మేరకు నిజానిజాలు ఉంటే దేనికైనా సిద్దమేనని పేర్కొన్నారు. ఇండియా టీవీ సేల్స్ విభాగం అధ్యక్షుడు సుదీప్తో చౌదరి మాట్లాడుతూ కోబ్రా పోస్టు విడుదల చేసిన వీడియో అంతా క్రుత్రిమం అని పేర్కొన్నారు. కోబ్రాపోస్టు ప్రతినిధితో చర్చలు, ప్రతిపాదనలు చేసినా.. ఇండియా టీవీ ఎడిటోరియల్ టీమ్స్, లీగల్ టీమ్స్ తిరస్కరించాయని చెప్పుకొచ్చారు.

English summary
The Cobrapost stings this week are by far the most definitive indicator of the willingness of prominent Indian media houses to tailor their content to further what the undercover reporter Pushp Sharma presented as a “positive Hindutva” agenda. But, as the advertising and sales manager of one TV channel assured Sharma, many were already doing that. They were only happy to be paid for the package.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X