
ఆ అల్లర్లకు బీజేపీ నాయకుడే కారణం.. అరెస్ట్: కలెక్టర్‌పై వేటు: ప్రధాని మోడీ పర్యటన రోజే
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులకు అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నాయకుడే ప్రధాన కారణమని తేలింది. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేయడం వల్లే ఈ అలర్లకు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయనను అరెస్ట్ చేశారు. ఆ బీజేపీ నాయకుడితో పాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న 50 మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించిన రోజే ఈ ఘటన సంభవించిన విషయం తెలిసిందే. యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమాల కోసం ఆయన గత శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించారు. అదే రోజు కాన్పూర్‌లో అల్లర్లు సంభవించాయి. రెండు వర్గాలకు చెందిన వారు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుకున్నారు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు.
ఈ ఘటనపై పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి బీజేపీ నాయకుడిని అరెస్ట్ చేశారు. ఆయన పేరు హర్షిత్ శ్రీవాస్తవ. బీజేపీ యువజన విభాగం పదాధికారి. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వివాదాస్పద ట్వీట్లను పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత వాటిని డిలిట్ చేసినట్లు నిర్ధారించారు. ఈ అల్లర్లకు కారణమైన వారిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించిన కాన్పూర్ పోలీసులు.. వారి పోస్టర్లను విడుదల చేశారు.

ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొందరిని అరెస్ట్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. వారికోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు 50 మందిని అరెస్ట్ చేశామని, ఓ మైనర్.. సరెండర్ అయ్యాడని కాన్పూర్ పోలీస్ కమిషనర్ విజయ్ మీనా తెలిపారు. కాగా- ఈ అల్లర్లపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కాన్పూర్ జిల్లా కలెక్టర్‌పై వేటు వేసింది. కలెక్టర్ నేహాశర్మను బదిలీ చేసింది. ఆమెను స్థానిక సంస్థల డైరెక్టర్‌గా అపాయింట్ చేసింది. ఆమెతో పాటు మొత్తం 20 మంది ఐఎఎస్‌లకు స్థానం చలనం కలిగించింది.
మరోవంక- మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం తగ్గట్లేదు. గల్ఫ్ దేశాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. తమ దేశాల్లోని భారత రాయబారులు, హై కమిషనర్లకు సమన్లను జారీ చేసి, వివరణ కోరాయి. అటు అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కూడా స్పందించింది. భారత్‌లో దాడులు చేస్తామంటూ హెచ్చరించింది. ఢిల్లీ, ముంబై, ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.