డిప్యూటీ సీఎం ఇంట్లో చెత్త వేసి నిరసన (వీడియో)
న్యూఢిల్లీ: పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్నది. వేతనాలు రెగ్యులర్ గా చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతున్నది.
తమ డిమాండ్లు సాధించడానికి నిరసనకారులు వినూత్న రూపంలో ఆందోళనకు దిగారు. బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిష్టిబోమ్మను దగ్ధం చేసి ఆందోళనకు దిగారు. గురువారం తమ ఆందోళన వేదికను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటి దగ్గరకు మార్చారు.
చెత్త చెదారాన్ని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటి గేటు లోపలికి విసిరివేసి నిరసన వ్యక్తం చేశారు. తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మనీష్ సిసోడియా ఇంటి ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం జరిగి తోపులాటకు దారితీసింది. పెండింగ్ వేతనాలు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ఏడెనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే తాము ఎలా బతికేది అని ప్రశ్నించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శాపనార్థాలు పెట్టారు. తమ డిమాండ్లు సాధించే వరకు పోరాటాన్ని ఆపబోమని కార్మికులు హెచ్చరించారు. కార్మికులు చేస్తున్న సమ్మెపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, మనిసిపల్ కార్పొరేషన్ కు ఢిల్లీ హై కోర్టు నోటీసులు జారీ చేసింది.
