త్వరలో ప్రజా రవాణా ప్రారంభం, లండన్ తరహాలో..: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలోనే ప్రారంభం కానుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు బుధవారం వెల్లడించారు.

భౌతిక దూరం పాటిస్తూ..
ప్రజా రవాణా ప్రారంభించిన తర్వాత.. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించేలా ఈ మార్గదర్శకాలు ఉండబోతున్నాయని నితిన్ గడ్కరీ చెప్పారు. బుధవారం బస్సు, కారు ఆపరేటర్స్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రవాణా రంగానికి సంబంధించి వచ్చిన బెయిల్ ఔట్ ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తూ ఈ రంగంలో ఉన్న అన్ని సమస్యలూ తమకు తెలుసని గడ్కరీ తెలిపారు. రవాణా రంగ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

చైనాను నమ్మరు.. అదే మనకు అవకాశం
ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, వారితో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇక కరోనా కారణంగా ఏర్పడిన ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాలని నితిన్ గడ్కరీ పరిశ్రమ వర్గాలకు సూచించారు. ఇప్పుడున్న స్థితిలో చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, ఇదే అవకాశంగా భావించి విదేశీ పెట్టుబడిదారులను భారత పారిశ్రామిక వర్గాలు ఆకర్షించాలని సూచించారు.

లండన్ తరహాలోనే..
కరోనాతోపాటు ఆర్థిక మందగమనం నుంచీ గట్టెక్కుతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రవాణాకు లండన్ మోడల్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు. జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులు పునర్ ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, తమకు కొన్ని వెసులుబాటులు కల్పించాలని కోరారు. కాగా, మే 17తో మూడో దశ లాక్డౌన్ ముగియనుండటంతో ఆ తర్వాత రైలు, విమానాల సేవలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.