అంతా కిరణ్ బేడీనే చేస్తున్నారు!: అసెంబ్లీలో వైద్య మంత్రి నల్లచొక్కాతో ధర్నా
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు దీక్షకు దిగారు. లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా గవర్నర్ కిరణ్ బేడీ తీసుకుంటున్న నిర్ణయాలపై మంత్రి మల్లాడి అసంతృప్తి వ్యక్తం చేశారు.

గవర్నర్‌పై ఫిర్యాదు..
గవర్నర్ కిరణ్ బేడీ నిర్ణయాలపై ప్రధాని, సీఎం, అసెంబ్లీ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు మంత్రి మల్లాడి కృష్ణారావు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది యానాం వాసులను క్వారంటైన్ చేయకుండా, ఆసుపత్రికి పంపించకుండా నాలుగు రోజులపాటు చెక్ పోస్ట్ వద్ద నిలుపుదల చేయడంపై మంత్రి మల్లాడి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తీరుపై మండిపడ్డారు.

మంత్రి పదవి వదిలేస్తానంటూ..
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని 24 గంటల్లో క్వారంటైన్‌కు తరలించకపోతే పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి వైదొలుగుతానని ఇప్పటికే మంత్రి మల్లాడి అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం పుదుచ్చేరి అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం ఎదురుగా నల్లదుస్తులు ధరించి దీక్ష చేపట్టారు ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు.

ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కిరణ్ బేడీ వైఖరంటూ..
ఈ క్రమంలో ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి, స్పీకర్ వీపీ శివకోలుంధు మంత్రి మల్లాడి కృష్ణారావును కలిశారు. ఈ క్రమంలో మంత్రి గవర్నర్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. యానాం ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గవర్నర్ కిరణ్ బేడీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఒడిశా, హైదరాబాద్, పుట్టపర్తి నుంచి యానాంకు చెందిన ప్రజలు నడుచుకుంటూ వచ్చి నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్-పుదుచ్చేరి సరిహద్దులకు చేరుకున్నారని, వారిని క్వారంటైన్ చేయకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని మంత్రి మల్లాడి ఆరోపించారు. కాగా, హోంమంత్రి ఆదేశాల మేరకు వారిని వెంటనే క్వారంటైన్ చేసేందుకు చీఫ్ సెక్రటరీ సిద్ధమయ్యారు. అయినా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

అంతా గవర్నరే చేస్తున్నారు..
ఎన్నికైన తమ లాంటి ప్రజాప్రతినిధుల ఆదేశాలు కాకుండా గవర్నర్ ఆదేశాలకే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి మల్లాడి ఆరోపించారు. మొదట్నుంచి కూడా గవర్నర్ కిరణ్ బేడీకి పుదుచ్చేరి సీఎం నారాయణస్వామికి విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సీఎంతోపాటు మంత్రులు కూడా గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అధికారాలను కూడా లాగేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.