Pulwama Attack: ఆ దారుణ మారణకాండకు నేటితో ఏడాది..స్మారకస్థూపం..వాహనాల రాకపోకలపై నిషేధం..!
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలగొన్న ఆ మారణకాండకు శుక్రవారం నాటితో ఏడాది నిండింది. దేశంలో చోటు చేసుకున్న కొన్ని కీలక పరిణామాలకు పుల్వామా ఉగ్రవాదుల దాడి కారణమైంది.. కేంద్రబిందువుగా మారింది. పుల్వామా ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం రక్షణపరంగా కొన్ని సంక్లిష్ఠ నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చింది. తన విధానాలు, వ్యూహాలను మార్చుకోవడానికి దారి తీసింది.
అల్ ఖైదా, ఇండియన్ ముజాహిదీన్ కమాండర్ కాల్చివేత: పుల్వామా దాడికి సూత్రధారిగా!

40 మందిని పొట్టనబెట్టుకున్న మారణకాండ..
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ఉగ్రవాదులు భీకర దాడి చేశారు. సెలవులను ముగించుకుని విధుల్లో చేరడానికి బయలుదేరిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై చోటు చేసుకున్న ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరవీరులయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ భూభాగంపై నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోన్న జైషె మహమ్మద్ సంస్థ.. ఈ దాడులకు తామే కారణమని ప్రకటించుకుంది. తమ ఆత్మాహూతి దళ సభ్యుడు ఈ దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది.

పుల్వామా దాడి విషాదానికి గుర్తుగా..
పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల స్మారకార్థం రక్షణ మంత్రిత్వ శాఖ సంఘటనా స్థలంలో ఓ స్మారకస్థూపాన్ని నెలకొల్పింది. దీనిపై అమర జవాన్ల పేర్లను రాశారు. మరి కొన్ని గంటల్లో ఈ స్మారకస్థూపాన్ని ఆవిష్కరించనున్నారు. గురువారమే సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్.. ఈ స్థూపాన్ని పరిశీలించారు. అవంతిపురా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న లేత్‌పురా వద్ద దీన్ని నిర్మించారు.

ప్రైవేటు వాహనాలపై నిషేధం..
స్మారకస్థూపాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా వాహనాల రాకపోకలపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నిషేధం విధించింది. రెండురోజుల పాటు ఈ నిషేధం అమలులో ఉంటుంది. అవంతిపురా మార్గంలో ప్రైవేటు వాహనాల రాకపోకలను దారి మళ్లించింది. స్మారక స్థూపాన్ని సందర్శించడానికి పెద్ద సంఖ్యలో ఆర్మీ అధికారులు, జవాన్లు చేరుకుంటారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ అధికారులు వెల్లడించారు.

12 రోజుల్లోనే పగ తీర్చుకున్న భారత్..
పుల్వామా ఉగ్రదాడి చోటు చేసుకున్న 12 రోజుల్లో భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగింది. సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌లో జైషె మహ్మద్‌కు చెందిన ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది. వాటిని నేలమట్టం చేసింది. ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు భారత వైమానిక దళ అధికారులు వెల్లడించినప్పటికీ.. పాకిస్తాన్ వాటిని ఖండించింది.