మరో ఉగ్ర కుట్ర భగ్నం.... కశ్మీర్లో మరో పుల్వామా తరహా దాడికి స్కెచ్... 52కిలోల పేలుడు పదార్థాలు..
జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రకుట్రను భారత భద్రతా బలగాలు బట్టబయలు చేశాయి. పుల్వామా తరహా దాడికి వేసిన స్కెచ్‌ను చేధించాయి. గత ఏడాది పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే పేలుళ్లకు కుట్ర చేసినట్లు గుర్తించాయి. దాదాపు 52కిలోల పేలుడు పదార్థాలను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

52 కిలోల పేలుడు పదార్థాలు..
ఇండియన్ ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం... గురువారం(సెప్టెంబర్ 17) ఉదయం 8గంటలకు గడికల్ ప్రాంతంలోని కరెవా ప్రాంతంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. ఇందులో భాగంగా ఓ పండ్ల తోటలో పూడ్చిపెట్టిన సింటెక్స్ ట్యాంకును గుర్తించారు. అందులో 52 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. మొత్తం 416 ప్యాకెట్లలో 125గ్రా. చొప్పున పేలుడు పదార్థాలు నింపినట్లు గుర్తించారు.

50 డిటోనేటర్లు స్వాధీనం...
తనిఖీల్లో అదే ప్రాంతంలో 50 డిటోనేటర్లతో కూడిన మరో ట్యాంకును గుర్తించినట్లు ఆర్మీ వెల్లడించింది. దాన్ని 'సూపర్ 90'గా పేర్కొంది. పేలుడు పదార్థాలు బయటపడిన ఈ ప్రాంతం 2019లో పుల్వామా దాడి జరిగిన ప్రదేశానికి కేవలం 9కి.మీ దూరంలో ఉన్నట్లు తెలిపింది. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పింది. ఉగ్రవాదులు మరోసారి పుల్వామా తరహా దాడికి సిద్దమవుతున్నట్లు ఈ కుట్రతో బయటపడటంతో కశ్మీర్లో సైన్యం మరింత అప్రమత్తమైంది.

గత నెలలో ఢిల్లీలోనూ...
ఈ ఏడాది అగస్టులో దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉగ్ర కుట్రను పోలీసులు బయటపెట్టిన సంగతి తెలిసిందే. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతీకారంగా ఢిల్లీలో భారీ పేలుళ్లకు చేసిన కుట్రను పోలీసులు చేధించారు.బుద్ద జయంతి పార్క్ సమీపంలో భూమిలో పాతిపెట్టిన 15 కిలోల బరువైన రెండు భారీ ఐఈడీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు యూసుఫ్‌ను అదుపులోకి తీసుకుని అతని లింకులపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.

గత ఏడాది పుల్వామా దాడి...
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14,2019న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు చనిపోయారు. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా ఉగ్రవాదులు వ్యూహాత్మకంగానే ఎంపిక చేసుకున్నారు. జమ్మూ-శ్రీనగర్ రహదారిలో లెత్పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఆ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయని గుర్తించి ఉగ్రవాదులు అక్కడే స్పాట్ పెట్టారు.ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమెరాల నిఘా కూడా లేకపోవడంతో వారి పని మరింత సులువైంది.