డేటింగ్ యాప్‌లో పరిచయం... ట్రాప్... కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి రేప్...
సోషల్ యాప్స్ ద్వారా పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం వెలుగుచూస్తూనే ఉన్నాయి. డబ్బు కోసమో,లైంగిక అవసరాల కోసమో యువతులకు వల వేస్తున్న కేటుగాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా మహారాష్ట్రలోని పుణేలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

టిండర్ యాప్... ట్రాప్...
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం... మహారాష్ట్రలోని పుణేకి చెందిన ఓ యువతికి పింప్రి చించ్వాడ్కి చెందిన అభిజిత్ అనే యువకుడితో టిండర్ డేటింగ్ యాప్‌లో పరిచయం ఏర్పడింది. ఆమెతో తీయగా మాటలు కలిపిన యువకుడు మెల్లిగా ఆమెను ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె తన వలలో పడిందని నమ్మిన తర్వాత ఓరోజు ఇద్దరం కలుద్దామని అడిగాడు. డిసెంబర్ 26న పుణేలోని హింజేవాడిలో ఓ లాడ్జిలో గది బుక్ చేసి ఆమెను అక్కడికి రమ్మన్నాడు.

కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి... రేప్...
అనుకున్నట్లు గానే ఇద్దరూ ఆరోజు లాడ్జిలో కలుసుకున్నారు. అయితే లాడ్జి గదిలో అతని ప్రవర్తనతో ఆమె షాక్ తిన్నది. పైపైన పడుతూ మాట్లాడటంతో దూరం ఉండాలని చెప్పింది. అయినప్పటికీ అతను మాట వినిపించుకోలేదు. దీంతో గట్టిగా హెచ్చరించగా... ఆమెపై అతను దాడి చేశాడు. పిడిగుద్దులు కురిపించాడు. ఆఖరికి షూతో కూడా ఆమెను కొట్టాడు.అనంతరం బలవంతంగా ఆమెతో మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించాడు. అక్కడినుంచి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.

కొనసాగుతున్న దర్యాప్తు...
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జనవరి 2 వరకు రిమాండ్ విధించింది. ఆన్లైన్లో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని... ముందూ వెనకా ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువతులు పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.