4 గంటల్లో 2.8 లక్షల మంది స్పందన.. ఆప్ పంజాబ్ సీఎం క్యాండెట్‌పై జనం రియాక్షన్
పంజాబ్‌పై ఆప్ కన్నేసింది. గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావడంతో.. ఈ సారి అధికారం చేపట్టాలని అనుకుంటుంది. ఇటీవల సీఎం అభ్యర్థిని మీరు ఎన్నుకోవాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కోరిన సంగతి తెలిసిందే. అయితే దానికి జనం నుంచి విశేష స్పందన లభించింది. కేవల 4 గంటల్లోనే 2.8 లక్షల మంది స్పందించారు. ఆప్ ఇచ్చిన నంబర్‌కు తమ అభిప్రాయం తెలియజేశారు.

జన నేత
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ఓ పార్టీ సీఎం అభ్యర్థి గురించి జనం అభిప్రాయాన్ని పార్టీ కోరింది. ఫోన్ చేసి.. లేదంటే వాట్సాప్ ద్వారా జనాలను అభిప్రాయం కోరింది. 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం.. కొన్ని గంటల్లోనే జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సీఎం అభ్యర్థికి సంబంధించి తన వ్యక్తిగత అభిప్రాయం అవసరం లేదు... ప్రజల మనసులో ఉన్న వారే అవుతారని కేజ్రీవాల్ ఇంతకుముందు అన్న సంగతి తెలిసిందే. అంతకుముందు భగవత్ మాన్ వైపు కేజ్రీవాల్ మొగ్గుచూపారు. మాన్.. కేజ్రీవాల్‌తో సన్నిహితంగా మెలగుతారు. అతను తన చిన్న తమ్ముడు లాంటి వాడు అని అన్నారు.

80 సీట్లు పక్కా
పంజాబ్‌లో తమ పార్టీ 80 స్థానాలు గెలుచుకుంటుందని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. తమ లక్ష్యం దిశగా దూసుకెళ్లాంటే.. వాలంటీర్లు పనిచేయాలని కోరారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని కేజ్రీవాల్ తెలిపిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14వ తేదీన పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపడుతారు.

4 గంటల్లో 2.8 లక్షల మంది
ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు సంచలన ప్రకటన చేశారు. పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రజలే సీఎం అభ్యర్థిని ఎన్నుకునేలా ఓ ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. సీఎంగా ఎవరు కావాలో ఆ నెంబర్ కు ఫోన్ చేసి అభ్యర్థి పేరు చెప్పాలని సూచించారు.
7074870748 నెంబర్ కు ఫోన్ చేసి అభిప్రాయం చెప్పాలని కేజ్రీవాల్ కోరారు. ఇన్నేళ్ల నుంచి ఎన్నికలు జరుగుతున్నా.. ఏ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండదన్నారు. దేశ చర్రితలోనే సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావొచ్చునని పేర్కొన్నారు. ఫోన్ చేసి గానీ, వాట్సాప్ లో మెసేజ్ ద్వారా గానీ ప్రజలు అభిప్రాయం చెప్పొచ్చని తెలిపారు. జనవరి 17 సాయంత్రం 5 గంటల లోపు ప్రజలు తమ అభీష్టాన్ని చెప్పాలన్నారు. దానికి జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.