పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదల- సీఎం చన్నీ, సిద్దూ పోటీ చేసే స్ధానాలివే
పంజాబ్ లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ తమ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 86 మంది అభ్యర్ధుల పేర్లు ఉన్నాయి. వీరిలో సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీతో పాటు పీసీసీ ఛీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోదరి మాళవికతో పాటు ఇతరుల పేర్లు ఉన్నాయి.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్సర్ తూర్పు నుంచి పోటీ చేయనుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చమ్‌కౌర్ సాహిబ్‌తో పోటీ చేయనున్నారు. పంజాబ్ ఉపముఖ్యమంత్రులు సుఖ్జీందర్ సింగ్ రంధవాను డేరా బాబా నానక్ నుంచి, ఓం ప్రకాష్ సోనీని అమృత్సర్ సెంట్రల్ నుంచి మరోసారి నిలబెడుతున్నారు. కొంతకాలం క్రితం కాంగ్రెస్‌లో చేరిన పంజాబీ గాయకుడు సిద్ధూ ముస్సేవాలా మాన్సా నుంచి, నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ మోగా నుంచి పోటీ చేయనున్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని ఖాదియన్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా పోటీ చేయనున్నారు.

మాజీ పిసిసి అధ్యక్షుడు, ప్రచార కమిటీ చీఫ్ సునీల్ జాఖర్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. ఆయనకు బదులుగా మేనల్లుడు సందీప్ జాఖర్ అబోహర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు. అలాగే పంజాబ్ మంత్రి బ్రహ్మ మొహింద్రా పోటీకి దూరం కాగా.. ఆయన స్థానంలో పాటియాలా రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన కుమారుడు మోహిత్ మొహింద్రా పోటీ చేయనున్నారు. పంజాబ్ లో ఫిబ్రవరి 14న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. ప్రస్తుతం ఆప్ తో పాటు బీజేపీ, అకాలీదళ్ ఇతర పార్టీలతో కాంగ్రెస్ అక్కడ పోటీ పడుతోంది.