పంజాబ్ కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలో చేరిన ఎమ్మెల్యే హర్జోత్ కమల్, సోనూ సూద్ చెల్లెలిపై పోటీ
ఛండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మోగా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ హర్జోత్ కమల్ ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఛండీగఢ్‌లోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన హర్జోత్ కమల్.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మీనాక్షి లేఖి సహా పలువురు బీజేపీ కీలక నేతల సమక్షంలో కాషాయ దళంలోకి చేరారు.
అయితే, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక సూద్‌కు ఆ పార్టీ మోగ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఖరారు చేసింది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హర్జోత్ కమల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాగా, ఇటీవల మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో ఏర్పాటు చేసిన సబకు కూడా హర్జోత్ హాజరుకాలేదు. ఆయన గైర్హాజరుపై పీసీసీ చీప్ నవజ్యోత్ సింగ్ స్పందిస్తూ.. హర్జోత్ తనకు వ్యక్తిగతమైన స్నేహితుడిగా చెప్పుకొచ్చారు. అయితే, ఇంతలోనే కమల్ కాంగ్రెస్ పార్టీని వీడటం ఆ పార్టీకి షాకేనని చెప్పాలి.

బీజేపీలో చేరిన సందర్భంగా హర్జోత్ కమల్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిందని, అందుకే బీజేపీలో చేరి అదే స్థానంలో పోటీలో నిలబడనున్నట్లు హర్జోత్ ప్రకటించారు. టికెట్ ఇవ్వకపోగా తనను వేరే స్థానం నుంచి పోటీ చేసుకోమని బిరుసు సమాధానం ఇచ్చారంటూ హర్ జోత్ ఆవేదన వ్యక్తం చేశారు.
21 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన తానూ.. మోగ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దానని పేర్కొన్నారు. టికెట్ కేటాయింపులపై మాట మాత్రం చెప్పలేదని, రెండు రోజుల క్రితం మోగ పర్యటనకు వచ్చిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్దు.. తనను కలవకుండా నేరుగా సోనూసూద్ ఇంటికి వెళ్లారని.. హర్ జోత్ కమల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, సోనూసూద్ సోదరి మాళవికాకు టికెట్ ఇవ్వడంలో తనకేమి అభ్యంతరం లేదని.. సొంతచెల్లెలి లాంటి ఆమెకు టికెట్ ఇవ్వడంపై తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు హర్ జోత్ కమల్ చెప్పుకొచ్చారు. అయితే సొంత నియోజకవర్గం మోగ టికెట్‌ను తనకు కాదని ఆమెకు ఎలా ఇస్తారంటూ హర్ జోత్ ప్రశ్నించారు. కేవలం సోనూసూద్ చెల్లిగా తప్ప, మాళవికాకు ఉన్న రాజకీయ పలుకుబడి ఏంటంటూ నిలదీశారు. ఈ విషయంపై పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీ స్పందిస్తూ.. పార్టీ అధిష్టానం మేరకే తామంతా నడుచుకుంటున్నట్లు తెలిపారు.