వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ ఎన్నికలు: త్రిశంకు సభ అనివార్యమా?

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం కోసం అధికార అకాలీదళ్ - బిజెపి కూటమి ప్రయత్నాలు సాగిస్తుండగా, ఐదేళ్ల క్రితం టిక్కెట్ల కేటాయింపులో పొరపాట్లతో అధికారానికి దూరమైన కాంగ్రెస్.. ఈ దఫా ఆరునూర

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం కోసం అధికార అకాలీదళ్ - బిజెపి కూటమి ప్రయత్నాలు సాగిస్తుండగా, ఐదేళ్ల క్రితం టిక్కెట్ల కేటాయింపులో పొరపాట్లతో అధికారానికి దూరమైన కాంగ్రెస్.. ఈ దఫా ఆరునూరైనా గెలుపొందాలని ఆకాంక్షిస్తోంది.

సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో 1947 నుంచి రెండు సంప్రదాయ పార్టీలు చెరో ఏడుసార్లు గద్దెనెక్కాయి. అయితే ఈ దఫా ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి తారుమారైంది. ముఖాముఖీ పోరు కాస్తా త్రిముఖ పోరుగా మారింది.

కాంగ్రెస్, అకాలీ - బిజెపి కూటమికి మూడో ప్రత్యామ్నాయంగా ఆప్ పంజాబీల ముంగిట నిలిచింది. అయితే తన ప్రత్యర్థి పార్టీల మాదిరిగా క్షేత్రస్థాయిలో సంస్థాగత పార్టీ మద్దతు లేకపోవడం ఆమ్ఆద్మీ పార్టీకి లోటేనని చెప్పొచ్చు.

2014 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు (25% ఓట్లు సంపాదించి) గెలుచుకుని పంజాబ్ గడ్డపై తన సత్తా ఏమిటో రుజువుచేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ముఖ్యంగా మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 69 స్థానాలున్న మాల్వా ప్రాంతంలో ఇది కీలకమైన అంశం. గతంలో ఇక్కడ నుంచే ఆప్‌ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్నది. తద్వారా 2019 ఎన్నికల్లో తమ ఆకాంక్షలపై ఆప్ బాగానే ఆశలు పెట్టుకున్నది.

బాదల్ సర్కార్ విధానాలపై ప్రజా వ్యతిరేకత

రైతుల ఆత్మహత్యలు, వివిధ రంగాల్లో మాఫియా రంగ ప్రవేశం, బాదల్ కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలు అధికార అకాలీ - బిజెపి కూటమికి ప్రజా వ్యతిరేకత తెచ్చి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆప్, కాంగ్రెస్ పార్టీల మాదిరిగానే రైతులకు రుణ మాఫీపై ఆశలు కల్పించింది అకాలీదళ్ పార్టీ. రెండు లక్షల రుణంతోపాటు గెలిస్తే క్వింటాల్ ధాన్యంపై రూ.100 బోనస్ చెల్లిస్తామని అన్నదాతకు ఆశలు చూపుతోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల సమరానికి సారథ్యం వహించిన కెప్టెన్ అమరీందర్ సింగ్, 2007, 2012 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైనా.. 2014 లోక్ సభ ఎన్నికల్లో అమ్రుత్ సర్ స్థానం నుంచి ఘన విజయం సాధించి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఇది తన చివరి ఎన్నికల పోరాటమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీలో త్రిశంకు అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆప్ పై బయటి పార్టీ ముద్ర

తమ విజయావకాశాలకు గండికొడ్తున్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హర్యానా వాసి కావడంతో దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్, అకాలీ - బిజెపి కూటమి నిమగ్నమయ్యాయి. ఆప్ పార్టీ బయటి పార్టీ అన్న ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాయి.

హర్యానా వాసి కావడంతో ఆప్ గెలిస్తే.. సట్లెజ్ నది నుంచి జలాలను సొంత రాష్ట్రానికి కేజ్రీవాల్ తరలించుకువెళ్తారని ఎదురుదాడికి దిగాయి ఆ పార్టీలు. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలను శిరోమణి అకాలీదళ్ మసిబూసి మారేడుగాయ చేసింది. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ను చూసి ఓటేయండని పంజాబీలను సిసోడియా కోరడమే దీనికి కారణం.

దీనిపై వివాదం తలెత్తే అవకాశం ఉండటంతో కేజ్రీవాల్ వెంటనే స్పందింది. 'నేను ఎప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రినే' అంటూ విస్పష్టంగా ప్రకటించారు. కేజ్రీవాల్‌ కాబోయే ముఖ్యమంత్రి అని సిసోడియా అనలేదని, 'ఆయనను ముఖ్యమంత్రి చేస్తున్నామని అనుకొని ఓటువేయండి' అని మాత్రమే అన్నారని ఆప్ వివరణ ఇచ్చింది.

మండిపడ్డ అకాలీదళ్

కేజ్రీ దురాశకు ఇది నిదర్శనమంటూ శిరోమణీ అకాలీదళ్‌ తాడెత్తున మండిపడింది. ఆయన హర్యాన్వీ అని గుర్తుచేసింది. సిసోడియా నోరుజారారని అనుకోలేమని, పంజాబీలను పరీక్షించేందుకే ఆప్ స్థానికేతరులను అధికసంఖ్యలో అభ్యర్థులుగా నిలబెడుతున్నదని ఎదురుదాడికి దిగింది.

ఎన్నికల్లో విజయం సాధిస్తే సట్లెజ్‌-యమున కాలువతో ఢిల్లీకి నీరు తరలించుకుపోతారని అకాలీదళ్‌ ఇప్పటికే అంటున్నది. ఈ వివాదాన్ని స్థానిక, స్థానికేతర అంశంగా ప్రజల్లో మరింత ఉధృతంగా ప్రచారం చేసేందుకు అకాలీదళ్‌ పూనుకుంటున్నది.

కేజ్రీవాల్ పై కాంగ్రెస్, బిజెపిల దాడి

ఆప్‌ ప్రవేశం కారణంగా బీజేపీ- అకాలీదళ్‌ కూటమి కానీ, కాంగ్రెస్‌ కానీ తమ భవిష్యత్తును ఏమాత్రం అంచనావేయలేకపోతున్నాయి. ఈ పార్టీలు పరస్పర విమర్శలకంటే కేజ్రీవాల్‌మీదే అధికంగా విరుచుకుపడుతున్నాయి. రాజకీయంగా ఎన్ని పొరపాట్లు చేసినా ఆప్‌ ఇప్పటికీ అక్కడ బలంగానే ఉన్నది.

పంజాబ్‌ ఓటర్లలో మూడోవంతు ఉన్న దళితుల్లో అధికులు ఆ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారట. సహజంగానే ఆ ఓటుబ్యాంకుమీద ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఇది చీకాకు కలిగిస్తున్నది.

అకాలీదళ్‌ - బీజేపీ కూటమి పదేళ్ళుగా అక్కడ అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత పతాకస్థాయికి చేరుకున్నదనీ, ఈసారి తాను అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్‌ విశ్వసిస్తున్నది. కానీ, ఆప్‌ మధ్యలో దూరినందువల్ల ఈ వ్యతిరేక ఓట్లు చీలిపోతే అధికారకూటమే తిరిగి గద్దె ఎక్కుతుందని కాంగ్రెస్‌ భయం.

ఇంకా తేలని ఓటరు నాడి

ఫిబ్రవరి 4వ తేదీన పోలింగ్‌కు ఇంకా రెండు వారాల గడువే ఓటర్ల నాడేమిటో తెలియడం లేదు. బాదల్‌ కుటుంబీకులపై అవినీతి ఆరోపణలు హెచ్చడం, రాష్ట్రం కంటే వ్యాపారాలే వారికి ప్రధానమన్న భావన ప్రజల్లో బలంగా ఉండటం అకాలీదళ్‌ - బీజేపీ కూటమి విజయావకాశాలను తగ్గిస్తున్నది.

మాదకద్రవ్య ముఠాలకు అండగా ఉన్నారన్న విమర్శలూ వారిపై ఉన్నాయి. డ్రగ్స్‌కు బానిసలై మరణిస్తున్న యువకుల సంఖ్య పంజాబ్‌లో అత్యధికంగా ఉంది. తీవ్రంగా కుదిపేస్తున్న ఈ సమస్యకు పాలకపక్షమే కారణమంటూ కాంగ్రెస్‌, ఆప్‌ విరుచుకు పడుతున్నాయి. రెండు పార్టీలూ ఈ ఆరోపణతో రాష్ట్రాన్ని అవమానిస్తున్నాయని అకాలీదళ్‌ ప్రతిదాడి చేస్తున్నది. డ్రగ్స్‌రహిత రాష్ట్రమంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది.

 Punjab elections 2017: a cliffhanger on the cards

పంజాబ్‌పై డ్రగ్స్, వ్యవసాయ సంక్షోభం పడగ నీడ

మాదకద్రవ్యాలు ఇలా చంపుతుంటే, మరొకపక్కన వ్యవసాయం దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉన్నది. గత ఏడాది మహారాష్ట్ర తరువాత స్థానం పంజాబ్‌దే. పేరుకుపోతున్న అప్పులు, నకిలీ విత్తనాలు, పురుగుమందులు, పంట వైఫల్యాలతో అక్కడ వ్యవసాయం సంక్షోభంలోకి జారిపోయింది. అకాలీలకు బలమైన ఓటుబ్యాంకుగా ఉంటున్న గ్రామీణ జాట్‌-సిక్కు రైతులు ఈ కారణంగా పాలకపక్షంపై ఆగ్రహంగా ఉన్నారు.

అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు రద్దుచేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ రైతులతో ఇప్పటినుంచే పత్రాలు నింపిస్తూ ప్రచారం చేసుకుంటున్నది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఇదే తరహా కార్యక్రమాన్ని ఆరంభించి, వ్యవసాయ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. అధికారంలోకి రాగానే డ్రగ్స్‌ ముఠాల నాయకులందరినీ జైళ్ళలో పెడతానని కూడా హామీ ఇస్తున్నది. దళితులకోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించింది.

ప్రియాంకకు ఝలక్, వెంటనే వ్యూహం మార్చిన అఖిలేష్: రంగంలోకి సోనియాప్రియాంకకు ఝలక్, వెంటనే వ్యూహం మార్చిన అఖిలేష్: రంగంలోకి సోనియా

కేజ్రీ అంటే యువతకు క్రేజీ

అధికార విపక్షాల పాలన బాగా తెలిసిన పంజాబ్‌ యువతరం కొత్తగా బరిలోకి దిగిన ఆప్‌ను విశ్వసించి 'కేజ్రీవాల్‌.. కేజ్రీవాల్‌.. సారా పంజాబ్‌ తేరే నాల్‌' అంటూ పట్టం కడతారో లేదో చూడాలి. యువరక్తం బలంగా ఉన్న రాష్ట్రమది. నలభైశాతం మంది కన్ను కుర్ర కేజ్రీవాల్‌ మీద పడితే ఉభయపక్షాలూ భారీగా నష్టపోవాల్సి వస్తుంది. కేజ్రీవాల్‌ వివరణకు తాను హర్యాన్వీ కావడం ఒక్కటే కారణం కాకపోవచ్చు.

సిసోడియా వ్యాఖ్య విపక్షాల్లోనే కాక స్వపక్షంలోనూ అగ్గిరాజేసింది. ముఖ్యమంత్రి పదవిమీద ఆశలు పెట్టుకున్న నలుగురు ప్రధాన నాయకుల్లోనూ అలజడినీ, అసమ్మతినీ సృష్టించింది. కేజ్రీవాల్‌ వివరణ ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఈ వివాదంతో రాష్ట్రంలో రాజకీయ అలజడి సృష్టించి మీడియాలో ప్రాచుర్యం సంపాదించుకోవడం వరకూ ఆప్‌ విజయం సాధించగలిగింది.

ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఆగ్రహం

అయితే ప్రజల ఆకాంక్షలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అధికార కూటమిపై ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో బాదల్ సర్కార్ భారీస్థాయిలో అభివ్రుద్ధి ఎజెండా అమలు చేసింది.

అదనపు విద్యుత్ గల రాష్ట్రంగా పంజాబ్ ను తీర్చిదిద్దింది. పలు మౌలిక వసతుల ప్రాజెక్టులతోపాటు సామాజిక సంక్షేమానికి పెద్ద పీట వేసింది. అందులో భాగంగా దేశంలోనే సంపన్న రాష్ట్రంగా పేరొందిన పంజాబ్ లో ప్రారంభించిన 'ఆటా - దాల్' సబ్సిడీ స్కీం బహుళ ప్రాచుర్యం పొందింది.

హామీల అమలులో విఫలం

30 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల వాగ్దానం అమలు కాకపోవడంతోపాటు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ఎమ్మెల్యేలంటేనే పంజాబీలు మండిపడుతున్నారు. మాఫియా దన్ను, అధికారం అండతో బాదల్ సొంత కుటుంబ వ్యాపారాల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవడం ప్రజల్లో వ్యతిరేకతను పెంపొందిస్తున్నది.

మీడియాతోపాటు ప్రశ్నించిన ప్రజలను అణగదొక్కేందుకు పోలీసుశాఖను దుర్వినియోగం చేసేందుకు కూడా బాదల్ ప్రభుత్వం వెనుకాడటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సిక్కుల మత సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాలకు చరమ గీతం పాడనున్నారు.

బాదల్ సర్కార్ ఏ రకంగా చూసినా ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకున్న పరిస్థితుల్లో ప్రకాశ్ సింగ్ బాదల్ తన కొడుకు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను తన వారసుడిగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరా? లేదా? అన్నది తెలుసుకునేందుకు మార్చి 11 వరకూ వేచి చూడాల్సిందే.

English summary
Across north India, ‘Magh’, the 11th month of the Hindu and Sikh calendars, marks a change of seasons. In Punjab, the westerly winds, colloquially called ‘pacchhon’, gently sweep away the chill and fog, revealing stunningly sun-drenched lush-green swathes of wheat crop, the air redolent with mustard in bloom. This time, the breeze has a palpable flavour, that of political change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X