
పంజాబ్ కాంగ్రెస్‌కు బూస్టింగ్: పార్టీలో చేరిన సింగర్ సిద్దూ.. వెల్కం చెప్పిన సిద్దూ, చన్నీ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ చేరికల పర్వం మొదలైంది. విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు తమ వ్యుహాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుంది. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసీవాలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబీ యువకుల మధ్య మూసీవాలాకు మంచి క్రేజ్ ఉంది. పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ సమక్షంలో మూసీవాలా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కండువా కప్పి ఆహ్వానం
నవజ్యోత్‌సింగ్ సిద్ధూ.. సిద్దూ మూసీవాలాకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మూసీవాలా యూత్ ఐకన్ అని, ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొనియాడారు. కాంగ్రెస్ కుటుంబంలో చేరాలనే ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మూసీవాలా అతికష్టంతో కళాకారుడిగా ఎదిగారని.. తన పాటలతో లక్షలాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారని సీఎం చన్నీ కొనియాడారు.

గళం వినిపించేందుకే
పంజాబీల గళం దేశమంతటా వినిపించడానికే తాను కాంగ్రెస్‌లో చేరానని మూసీవాలా తెలిపారు. సిద్ధూ మూసీవాలా గతంలో కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. తన పాటలతో హింస, గన్ కల్చర్‌ను మూసీవాల ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ మేరకు ఆయనపై పోలీసు కేసులు కూడా నమోదు చేశారు. మూసీవాల అసలు పేరు సుభ్‌దీప్ సింగ్ సిద్ధు. మన్సా జిల్లాలోని మూసా గ్రామం ఆయన స్వస్థలం. మూసీవాలా తల్లి ఆ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ టికెట్‌పై ఎలాంటి ప్రకటన లేదు. కానీ అతనితో ప్రచారం చేసే ఆలోచనలో పార్టీ ఉంది.

సిద్దూతో క్యాంపెయిన్
వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పార్టీలు ప్రిపేర్ అవుతున్నాయి. పొత్తులు, ఎత్తులపై ఫోకస్ చేశాయి. ఇటీవల అమరీందర్ సింగ్ తాము అంతా కలిసి పోటీ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దానికి బలం చేకూరేలా.. శిరోమణి అకాళీదల్ (సంయుక్త్) ఎంపీ సుఖ్‌దేవ్ సింగ్ ధింసా మట్లాడారు. అమరీందర్ చెప్పినట్టు తామంతా కలిసి పోటీచేస్తానమని వివరించారు. అయితే ఎస్ఏడీ, కాంగ్రెస్‌తో మాత్రం తమ పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు. తాము ఒంటరిగా పోటీ చేయమని.. కూటమిగా కలిసి బరిలోకి దిగుతామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి హై కమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు.