వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’ - అభిప్రాయం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పీవీ నరసింహారావు

పాములపర్తి వెంకట నరసింహారావు - పొట్టి చేస్తే, పీవీ నరసింహారావు - ఇంకా పొట్టి చేస్తే పీవీ అనే వామనుడు, బక్కపలచనివాడు, నిరంతరమూ నిశ్శబ్దాన్ని కప్పుకునేవాడు, బహుభాషాపండితుడు, రాజకీయంగా ఎలాంటి బలమూ లేనివాడు భారతదేశ ప్రధాని కావడమే ఒక అద్భుతం! స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి అద్భుతంతో పోల్చగలిగిన అద్భుతం బహుశా మరొకటి లేదు. ఇది నిజానికి 'చాయ్ వాలా' ప్రధాని కావడాన్ని మించిన విశేషం. చాయ్ వాలా ప్రధాని కావడం అంత హఠాత్తుగా ఏమీ జరగలేదు. దానికి కనీసం రెండేళ్ల పూర్వరంగం ఉంది. పీవీకి అలాంటిదేమీలేదు.

1991లో ఇక రాజకీయ సన్యాసం తీసుకుందామని ఆయన నిర్ణయించుకుని పెట్టేబేడా సర్దుకుని హైదరాబాద్ వచ్చేశారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఆయన నిజంగానే సన్యాసం తీసుకుని, తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో ఉన్నశ్రీ సిద్ధేశ్వరపీఠానికి అధిపతి కావాలనుకున్నట్టు వదంతులు ప్రచారంలో ఉండేవి. చివరికి, లోక్ సభ ఎన్నికల మధ్యలో రాజీవ్ గాంధీ దారుణ హత్యానంతర పరిస్థితులలో ప్రధానిగా కేంద్రప్రభుత్వ అధిపతి అయ్యారు.

1950 దశకం నుంచి 1970 దశకం వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ 1977లో లోక్‌సభకు ఎన్నికై 1980 నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి గొప్ప నిర్ణయాలు చేశారో, సమూల పరివర్తనకు దారి తీయగల ఎలాంటి చర్యలు తీసుకున్నారో గత రెండుతరాల తెలుగువారికి సైతం ఒక అభిప్రాయం ఉన్నట్టు లేదు. తెలుగు అకాడెమీ స్థాపన ఆయన ఆలోచనే అంటారు కానీ, ఆ అకాడెమీ తెలుగుభాషకు ఎంత గొప్ప దోహదం చేసిందో లోతుగా చూస్తే తప్ప చెప్పలేం. ఎప్పుడూ మౌనముద్రాంకితుడిగా, గంభీరుడిగా కనిపించే పీవీలో హాస్యం లేదనుకుంటారు కానీ, తెలుగు అకాడెమీతో ముడి పెట్టి ఆయన హాస్యచతురతను సీనియర్ పాత్రికేయులు ప్రస్తావిస్తూ ఉంటారు.

ఒకసారి తనను కలసిన కొందరు పాత్రికేయులతో ఆయన ఆఫ్ ది రికార్డ్ ముచ్చట్లు చెబుతున్నప్పుడు.. ఉద్యోగం లేకుండా ఏవో ఉద్యమాలలో తిరుగుతూ ఉండే ఒక యువకుడి ప్రస్తావన వచ్చిందట. ఆ యువకుడు పీవీకి కాస్త దగ్గరి బంధువు కూడా. "పాపం అతగాడు ఏ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడు. అతనికి తెలుగు అకాడెమీలో ఉద్యోగం ఇప్పించకూడదా?" అని పీవీతో చనువున్న ఒక పాత్రికేయుడు అన్నాడట. అప్పుడు పీవీ, "అదెట్లా కుదురుతుందయ్యా? అందులో పండితులు పనిచేస్తారట కదా?!" అన్నారట.

రాజీవ్ గాంధీతో పీవీ నరసింహారావు

స్వరాష్ట్రానికి చేసిందేమిటి?

అదలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన భూసంస్కరణల అమలుకు చొరవ తీసుకున్న సంగతీ, దాని పర్యవసానాల గురించీ ఆయన ఆత్మకథాత్మక రచన 'ది ఇన్ సైడర్' (తెలుగులో 'లోపలి మనిషి')ద్వారా ఎంతో కొంత తెలుస్తోంది తప్ప తెలుగునాట అది కూడా పెద్ద ప్రచారంలో లేదు. ఇక 1980-91 మధ్యలో ఆయన కేంద్రమంత్రిగా ఫలానా గొప్ప చర్యలు తీసుకున్నారని కూడా పెద్దగా ఎవరూ చెప్పుకోరు. ఆయన ఆలోచనా ఫలితమైన నవోదయ పాఠశాలల స్థాపన ఒకింత మినహాయింపు.

ఆయన 'తీసుకోని చర్యలు' మాత్రం కొన్ని ప్రచారంలో ఉన్నాయి. భోపాల్‌లో వేలాదిమంది ప్రాణాలు తీసిన యూనియన్ కార్బైడ్ దుర్ఘటన దరిమిలా భారత్‌కు వచ్చిన ఆ సంస్థ అధిపతి వారెన్ ఆండర్సన్, కేంద్రంలోని పెద్దల అండదండలతో అరెస్టును తప్పించుకుని అమెరికాకు జారుకున్నప్పుడు పీవీ కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. అలాగే, అదే సంవత్సరం (1984) అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణహత్యకు గురైనప్పుడు, ఆ వెంటనే ఢిల్లీలో పెద్ద ఎత్తున సిక్కుల ఊచకోత జరిగినప్పుడు ఆయనే హోం మంత్రిగా ఉన్నారు.

ఆయన ప్రధానమంత్రి అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కాబోలు, "ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే"నని చెప్పుకున్నారు. కానీ ఆయన ప్రధాని అవడాన్ని ఆయన తెలుగు సోదరులు చాలామంది హర్షించినట్టు లేరు. "ఆయనేమిటి… ప్రధానమంత్రి కావడమేమిటి?" అని తూలనాడుతూ అప్పట్లో ఎన్నో ఉత్తరాలు పత్రికాఫీసులకు వచ్చిపడడం ఈ వ్యాసకర్తకు తెలుసు. కేంద్రమంత్రిగా, (ఆ తర్వాత ప్రధానమంత్రిగా కూడా) తెలుగు ప్రాంతాలకు ఆయన ఏమీ చేయలేదన్న విమర్శ ఉంది.

పీవీ నరసింహారావుతో మన్మోహన్ సింగ్

ఆర్థిక సంస్కరణలు.. పీవీపై ప్రశంస-విమర్శ

నిశ్శబ్దాన్ని కప్పుకుని హఠాత్తుగా ప్రధాని గద్దె మీద ప్రత్యక్షమైన పీవీ పాలనా దక్షత గురించి కూడా బహుశా మొదట జనం అంతే నిశ్శబ్దం పాటించి ఉంటారు. అంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక పరిణామం సంభవించి జనాన్ని ఒక్క కుదుపు కుదిపింది. అప్పటినుంచే కాబోలు జనం పీవీని ఒకింత నిశితంగా, జాగ్రత్తగా; బహుశా వారిలో చాలామంది ఒకింత ప్రశంసాభావంతోనూ గమనిస్తూవచ్చారు.

అది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలు, ద్రవ్యలోటు, విదేశీమారక నిల్వల తరుగుదల వగైరాల రూపంలో 1985లోనే క్రమంగా మొదలై, 1991 నాటికి విషమించి, దిగుమతులకు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో అంతర్జాతీయంగా భారత్ పరపతి తీవ్రంగా దెబ్బతినే పరిస్థితికి దారితీసిన ఆర్థిక సంక్షోభం. ఆ సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద భారత్ తన బంగారపు నిల్వలను తాకట్టు పెట్టడం జనంలో ఆందోళన రేకెత్తించింది. సరిహద్దుల్లో యుద్ధమే కానీ, ప్రాకృతిక ఉత్పాతాలే కానీ, కీలక రాజకీయపరిణామాలే కానీ-ఎలాంటివి సంభవించినా సాధారణంగా ప్రభావితం కాని భద్రస్థితిలో ఉండే మధ్యతరగతి బహుశా ఈ ఆర్థిక సంక్షోభంతోనే మొదటిసారి ఎక్కువ ప్రభావితమైనట్టుంది. ఆ క్షణాలలో తన కాళ్ళ కింద నేల తొలచుకుపోతున్నట్టు మధ్యతరగతి ప్రజలు భావించడంలో ఆశ్చర్యం లేదు.

తను వస్తూనే వెంటనే రంగంలోకి దిగి, డా. మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా ఆర్థికసరళీకరణ విధానాల ద్వారా అతి తక్కువ కాలంలోనే దేశ ఆర్థికతను సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీపై మధ్యతరగతి విద్యావంతులలోని ఒక వర్గంలో ప్రశంసాభావం పుంజుకుని అనంతర పరిణామాలతో మిన్నంటింది.

అదే సమయంలో వారిలోనే మరొక వర్గం నుంచి ఆర్థిక సరళీకరణపై విమర్శలూ వెల్లువెత్తాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ పీవీపై ప్రశంస-విమర్శ సమాంతరంగా సాగుతూనే ఉన్నాయి.

నెహ్రూవియన్ మిశ్రమ ఆర్థిక విధానాలతో మెల్లగా నడుస్తున్న భారత ఆర్థిక సమాజాన్ని ఒక కుదుపుతో ఒక అంగ వేయించినవాడు పీవీ నరసింహారావు. ఇవ్వాళ మనం చూస్తున్న భారత్ ఆ సంస్కరణల ఫలితమే.

పీవీ నరసింహారావు అంతిమ యాత్ర

పీవీ పట్ల కక్షతో చెరుపు చేసుకున్న కాంగ్రెస్

ఉగ్రవాదంతో ఉడుకుతున్న పంజాబ్‌ను దారికి తేవడం వంటి పీవీ సాఫల్యాలు మరికొన్ని ఉన్నాయి. వాటిని అలా ఉంచితే, పీవీ గురించి చెప్పుకునేటప్పుడు ఆయన ధరించిన నిశ్శబ్దత అనే ముసుగు, లేదా మౌనం మాటి మాటికీ ప్రస్తావనకు వస్తుంది, తప్పదు. ఆ నిశ్శబ్ద వ్యవహరణ దేశానికి ఏమైనా మంచో, చెడో చేసిందేమో కానీ; వ్యక్తిగతంగా శత్రువులను, అనుమానితులను, మాపుకోలేని కొన్ని కళంకాలను పెంచింది తప్ప ఆయనకు మంచి చేసినట్టు లేదు. చివరికి చనిపోయాక మాజీ ప్రధానిగా ఆయనకు ఢిల్లీలో కాస్తంత సమాధిస్థలం కూడా దొరకలేదు. నిరంతరాయంగా నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వం గురించి విమర్శలు ఎదుర్కొనే కాంగ్రెస్ పార్టీ, ఆ కుటుంబానికి చెందని పీవీ ప్రధానమంత్రి అయి, సాపేక్షంగా సమర్థంగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన సంగతిని విశేషంగా ప్రచారం చేసుకునే బదులు ఆయన పట్ల కక్షధోరణిలో వ్యవహరించి తనకు తానే చెరుపు చేసుకుందనిపిస్తుంది. ఆశ్చర్యంలేదు. ఇన్నేళ్ల అస్తిత్వంలో దాని మెదడు మోకాల్లోకి వచ్చింది!

బీజేపీ నాయకుల్ని నమ్మి మోసపోయారా!?

ప్రధానిగా పీవీ తెచ్చుకున్న మాపుకోలేని కళంకం, 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత. ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నారని, అప్పటినుంచి వినిపిస్తున్న విమర్శ అలా ఉండగా, బాబ్రీ మసీదు కూలిపోతేనే మంచిదనుకుని ఆయన కావాలనే నిద్ర నటించారా లేక, మసీదు జోలికి వెళ్లబోమని యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ సహా బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను నిజంగానే నమ్మి మోసపోయారా అన్నది కచ్చితంగా మనకు తెలియదు. బాబ్రీ మసీదు కూలిపోతే, బీజేపీ శాశ్వత అప్రతిష్ఠను మూటగట్టుకోవడమే కాక, దాని చేతిలోని ఒక రాజకీయఆయుధం మాయమై, దాని బలం క్షీణిస్తుందని ఆయన అనుకున్నారా?! లేక, ఆయన సైతం 'ఒక హిందువు'గా బాబ్రీ మసీదు పతనాన్ని కోరుకున్నారా?! మనకు స్పష్టంగా తెలియదు.

ఈ సందర్భంలో ఒక సామ్యాన్ని చెప్పుకోవాలి. అద్వానీ అయోధ్యకు రథయాత్ర ప్రారంభినప్పుడు, ఆ యాత్రను యూపీ, బీహార్‌లలోకి రాకుండా అడ్డుకుంటామని ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు పదే పదే భీషణ ప్రతిజ్ఞలు చేసి, వాస్తవానికి రథయాత్ర టెంపోను పెంచి బీజేపీ లాభపడడానికే పరోక్షంగా దోహదం చేశారు. ఇందుకు భిన్నంగా పీవీ తన హయాంలో, మురళీ మనోహర్ జోషీ శ్రీనగర్‌కు యాత్రగా వెళ్ళి జాతీయపతాకాన్ని ఎగురవేస్తానన్నప్పుడు, నిరభ్యంతరంగా ఆ పని చేసుకోవచ్చుననీ, అందుకు అవసరమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ప్రతిఘటన లేక ఆ యాత్ర నీరుగారింది. బాబ్రీ మసీదు విషయంలో కూడా పీవీ అలాంటి వ్యూహాన్నే అమలు చేయాలనుకున్నారా?! ఏమో!

బాబ్రీ మసీదు పతనంలో పీవీ పాత్రకు సంబంధించిన పూర్వాపరాల గురించి వినయ్ సీతాపతి తన 'హాఫ్ లయన్: హౌ నరసింహారావు ట్రాన్స్ ఫార్ముడ్ ఇండియా' అనే పుస్తకంలో చాలా సమాచారం ఇచ్చారు. అది చదివినప్పుడు పీవీ నిర్దోషా అనిపించే మాట నిజమే కానీ, అప్పటికీ ఆయన పాత్ర గురించి పైన ప్రస్తావించిన సందేహాలు అలాగే ఉంటాయి.

వాజ్‌పేయి, పీవీ నరసింహారావు

గాంధీ-నెహ్రూల భావజాలం

బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పేయితో సాన్నిహిత్యం నెరపడంలో, ఆయనను కాశ్మీర్ కు సంబంధించి జెనీవా సదస్సుకు పంపడంలో కూడా తనకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యర్థుల ధాటిని తగ్గించే వ్యూహాన్ని పీవీ అమలు చేశారా, లేక సహజసిద్ధమైన మైత్రీభావంతోనే అలా వ్యవహరించారా?! ఇదీ మనకు స్పష్టంగా తెలియదు.

పీవీ రాజకీయ, భావజాల వ్యక్తిత్వ వికాస, పరిణామాలలోకి తొంగి చూడడం కొంత ఉపయోగకరం అవుతుందేమో! ఆయన భాష, పాండిత్యం, సంస్కృతి, మతం, సంప్రదాయనిష్ఠ కలిగిన అతి పెద్ద అగ్రకులానికి చెందినవారన్న విషయాన్ని ఇక్కడ గుర్తుకు చేసుకోవడం ఎందుకు అవసరమంటే, స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఈ అగ్రకులంలోని ఒక వర్గం గాంధీని వ్యతిరేకించే సనాతన, హిందూభావజాల పక్షాన చేరితే, ఇంకో వర్గం గాంధీ-నెహ్రూల పక్షాన చేరింది. వారిద్దరూ జీవించి ఉన్నంతవరకూ, ఆ తర్వాత కూడా హిందూభావజాల పక్షం బలం పుంజుకోనంతవరకు ఈ వర్గం గాంధీ-నెహ్రూల భావజాలాలకూ, ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, సెక్యులర్, ప్లూరలిస్టిక్ భావజాలానికీ అధికారికంగానే ప్రాతినిధ్యం వహిస్తూవచ్చింది. పీవీ 'లోపలిమనిషి' చదివితే, ఆయనపై నెహ్రూ ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతుంది. అలాగే, నెహ్రూ పట్టుబట్టిన భూసంస్కరణలు వగైరాలు కూడా.

కానీ, గాంధీ-నెహ్రూల ప్రభావాన్ని సవాలు చేస్తూ హిందుత్వ వర్గాలు బలపడుతున్నకొద్దీ, గాంధీ-నెహ్రూల లౌకికవాదం పట్లనే కాకుండా, అసలు దాని నిర్వచనంపట్ల కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఆవిధంగా గాంధీ-నెహ్రూల సమ్మోహనం కింద అంతవరకూ సుప్తంగా ఉన్న హైందవ, సాంప్రదాయిక చింతన క్రమంగా పీవీ వంటి అనుయాయులలో మొదలైందా?! బాబ్రీ మసీదు కూల్చివేతలో పీవీ పాత్రను అలా కూడా చూడగలమా?! సమాధానం కోసం తడుము కోవలసిన ప్రశ్నలలో ఇది ఒకటి.

ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ రూపంలో మరో ఉదాహరణ స్పష్టంగా కళ్ళముందు ఉండనే ఉంది. పీవీలానే ఆయన కూడా కాంగ్రెస్‌లో చిరకాలం ఉండి, గాంధీ-నెహ్రూల భావజాలంతో ప్రభావితుడైనవారే. కాంగ్రెస్ ప్రభుత్వాలలో కీలక మంత్రిత్వశాఖలను నిర్వహించినవారే. చివరికి కాంగ్రెస్ సాయంతో రాష్ట్రపతి అయినవారే. అయినాసరే, కొన్ని రోజుల క్రితం ఆయన ఆర్ఎస్ఎస్. కార్యక్రమానికి వెళ్ళడం ఎలాంటిది? భక్తితత్పరతలు గల ఆస్తికుడిగా ఆయనలో నిద్రాణంగా ఉన్న హిందుత్వ చింతన ఇప్పుడు మేలుకున్నదా?!

అదే నిజమైతే, దైవభక్తి ఉండడాన్నే హిందుత్వగా భావించడంలోని అవగాహనారాహిత్యం గురించి ఎంతైనా చెప్పుకోవలసి ఉంటుంది. అందుకు ఇది వేదిక కాదు.

పీవీ నరసింహారావు

'..అవి ఇలాగే ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదు’

పీవీ గారి 'ది ఇన్ సైడర్' ను 'లోపలి మనిషి' పేరుతో అనువదించిన వాడిగా ఆయనను పలుసార్లు కలసుకునే అవకాశం కలిగింది. ఒక సందర్భంలో ఆయన అన్న మాటలకు భయంతో నా ఒళ్ళు జలదరించింది.

మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక క్షణం ఆగి, ఆలోచనాముద్ర వహించి, తల వంచి, "ఎన్నో చేయాలని అనుకున్నాను. చేయలేకపోయాను" అన్నారు. మళ్ళీ ఒక్క క్షణం మౌనం తర్వాత.. "యూపీ, బీహార్‌లు ఈ దేశానికి గుదిబండలుగా మారాయి. అవి ఇలాగే ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదు" అంటూ భారంగా నిట్టూర్చారు.

ఈ మాటలకు భయంతో ఎందుకు ఒళ్ళు జలదరించిందంటారా? అయిదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుకొచ్చిన ఒక మాజీ ప్రధాని "ఎన్నో చేయాలనుకున్నాననీ, చేయలేకపోయాననీ" అన్నప్పుడు ఇంత పెద్ద దేశమూ, దానిని ఆవరించిన సమస్యలూ ఒక్కసారిగా కళ్ళముందు మెదిలి ఎవరికి మాత్రం భయం కలగదు?!

ఇప్పుడాలోచిస్తే ఆయన నిశ్శబ్దమే దేశానికి ఎంతోకొంత దోహదం చేసిందేమో ననిపిస్తుంది. ప్రధాని స్థానంలో ఉన్నవారు నిశ్శబ్దంగా పనిచేయడంలో శ్రద్ధ చూపాలి కానీ మాటలు చెప్పడంలో కాదని ఇప్పటి అనుభవం రీత్యా మరింత బలంగా అనిపిస్తుంది.

ఎన్నో చేయాలన్న తన కోరికను నిశ్శబ్దంగా తనలోనే దాచుకుని, చేయలేకపోయినందుకు ఆ తర్వాత విచారం వ్యక్తం చేసిన ఈ మాజీ ప్రధానికి భిన్నంగా; ఎన్నో చేస్తామని చెబుతూనే అన్నీ చేయక పోవడం ఇప్పుడు చూస్తున్నాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
PV Narasimharao Centenary celebrations: The man behind India's economic reforms
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X